పెండింగ్ చలాన్లు చెల్లిస్తేనే ఎంట్రీ
మనది నగరం కాదు కాదా... ఏదో పనిమీద వచ్చాం... పోతున్నాం... తొందరపాటులో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఏమవుతుందులే అనుకుంటే పొరపాటే... ఇలా నిబంధనలు అతిక్రమించినవారు వందల్లో ఉన్నారని గుర్తించిన హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్లు రాబట్టేందుకు టోల్‌ప్లాజాల వద్దే సంయుక్త తనిఖీలు చేపడుతున్నారు. పెండింగ్ చలాన్లు ఉంటే జరిమానా అక్కడికక్కడే కట్టాల్సిందే. లేదంటే వాహన డాక్యుమెంట్లు తీసుకోనున్నారు. - సాక్షి, హైదరాబాద్
* టోల్‌ప్లాజాల వద్ద ‘ట్రాఫిక్’ ప్రత్యేక డ్రైవ్
* అక్కడికక్కడే జరిమానా చెల్లించాల్సిందే..
* నేటి నుంచి శంషాబాద్ టోల్‌ప్లాజా వద్ద అమలు
హైదరాబాద్‌లోకి ప్రవేశించి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వారికి విధించిన పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. నగరంలోకి ప్రవేశించే టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ అతిక్రమణదారుల నుంచి జరిమానా వసూలు చేయనున్నారు.
తొలిసారిగా పైలట్ పద్ధతిన ఈ ప్రత్యేక డ్రైవ్‌ను శంషాబాద్ విమానాశ్రయ టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం నుంచి చేపడుతున్నారు. సుమారు ఆరుగురుతో కూడిన బృందం పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులను గుర్తించి...అక్కడికక్కడే జరిమానాను కట్టిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా పే బూత్‌ను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. మూడు మించి చలాన్లు ఉంటే తప్పనిసరిగా కట్టాల్సిందే. ఒకవేళ జరిమానా కట్టని పక్షంలో సదరు వాహన పత్రాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.
వందల్లో పెండింగ్ చలాన్లు...
నగరంలోకి ప్రవేశించి రాష్ డ్రైవింగ్, నో పార్కింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా, లేన్ అండ్ లైన్ క్రాసింగ్... ఇలా నిబంధనలు అతిక్రమించి చలాన్లు చెల్లించనివారు... దాదాపు వందల్లో ఉన్నట్టు గుర్తించిన హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి జరిమానాలను వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. శంషాబాద్ అనంతరం ఇతర టోల్‌ప్లాజాల వద్ద కూడా స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టనున్నారు.
బయటివారి కోసమే..
నగరానికి వచ్చి పోతూ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారిని పట్టుకోవడానికి టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు చేపడితే బాగుంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చర్చించాం. అందుకే సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. దీంతో వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించరాదన్న భయం కలుగుతుంది.
- జితేంద్ర, ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్