Trained Graduate Teacher
-
టీజీటీ నియామకాలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) నియామకాల ప్రక్రియ పూర్తయింది. టీజీటీకి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను గురుకుల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వెబ్సైట్లో పొందుపర్చింది. ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి పక్షం క్రితమే తుది జాబితా విడుదల చేయగా.. గతవారం ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో చేర్చింది. తాజాగా మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలనూ వెబ్సైట్లో ఉంచింది. ఇప్పటికే నియమితులైన అర్హుల జాబితాలను సంబంధిత సొసై టీలకు పంపింది. ఆయా సొసైటీ కార్యదర్శులు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఈనెల 10లోగా నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఇప్పటికి 960 టీజీటీ, 1,972 పీజీటీ పోస్టుల భర్తీ పూర్తయినట్లే. నెలాఖరులోగా డీఎల్, జేఎల్ భర్తీ గురుకుల కాలేజీల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ భర్తీ సైతం వేగవంతమైంది. గురుకుల నియామకాల బోర్డు ఇటీవలే 466 డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరి ధ్రువపత్రాలు పరిశీలించాక తుది జాబితా ఖరారు చేయనుంది. వారంలోగా 281 జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన వారి జాబితాను ఖరారు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. దీంతో గురుకుల నియామకాల బోర్డుకు అప్పగించిన రిక్రూట్మెంట్ బాధ్యతలు పూర్తి కానున్నాయి. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలంటే జోన్ల వ్యవస్థపై స్పష్టత రావాల్సి ఉంటుందని, పోస్టుల విభజన పూర్తయితేనే భర్తీ చేపట్టే వీలుందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
‘ఎంపికైతే ఇతర పోస్టులను వదులుకోండి’
సాక్షి, హైదరాబాద్: ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) మేథమెటిక్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు టీజీటీ ఇతర సబ్జెక్టు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా, టీఆర్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా, వాటిని వదులుకోవాలని టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి చేసింది. తద్వారా ఆయా పోస్టుల్లో ఆ తరువాత మెరిట్లో ఉండే వారిని ఎంపిక చేయవచ్చని పేర్కొంది. టీజీటీ మ్యాథ్స్ పోస్టులకు ఎంపికైన వారు తమ వెబ్‌సైట్‌లోని లింకు ద్వారా 30వ తేదీన మిగతా పోస్టులను వదులుకునేందుకు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించింది. -
31న టీచర్ పోస్టుల స్క్రీనింగ్ టెస్టు
హాజరుకానున్న 1.25 లక్షల మంది అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31వ తేదీన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లాంగ్వేజ్ (ఇంగ్లిష్) పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. టీజీటీ, పీజీటీ రెండింటికి 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వేర్వేరుగా కాకుండా ఒకటే హాల్‌టికెట్ జారీ చేస్తామని వెల్లడించింది. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తున్నామని, మెయిన్ పరీక్ష 300 మార్కులకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ పరీక్షలకు 1.25 లక్షల మంది హాజరుకానున్నట్లు తెలిపింది. ఇక పీజీటీ, టీజీటీ తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం పోస్టులకు వచ్చే నెల 14న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు వివరించింది. త్వరలోనే హాల్‌టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు 040–23120301, 040–23120302 నంబర్లలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చని వెల్లడించింది. -
డిగ్రీ, డీఎడ్ వారికి అవకాశమివ్వండి!
‘గురుకుల’ పోస్టుల భర్తీలో అభ్యర్థుల విజ్ఞప్తి ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిందేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల్లో డిగ్రీ, డీఎడ్ పూర్తి చేసినవారికి అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం 6, 7, 8 తరగతులకు బోధించే వారికి.. డిగ్రీతోపాటు రెండేళ్ల డీఎడ్ ఉంటే అవకాశం ఇవ్వవచ్చు. కానీ ‘గురుకుల’నోటిఫికేషన్లో వారికి అవకాశం ఇవ్వలేదు. తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో జారీ చేయనున్న సవరణ నోటిఫికేషన్లో అయినా డిగ్రీ–డీఎడ్ అభ్యర్థులకు అవకాశమిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. తద్వారా దాదాపు లక్ష మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర డీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రతినిధులు రామ్మోహన్‌రెడ్డి, శ్రీను నాయక్, సరస్వతి తదితరులు పేర్కొన్నారు. సాధారణ వయో పరిమితి పెంపు ఉంటుందా? గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి సాధారణ గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లకు పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. రాష్ట్రంలో యూనిఫాం పోస్టులు మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగాలకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే ప్రత్యేక సడలింపులు మినహా చాలా ఏళ్లుగా ఇదే అమలవుతోంది. ప్రభుత్వ స్కూళ్లలోని టీచర్ పోస్టులకు మాత్రం 39 ఏళ్ల సాధారణ గరిష్ట వయోపరిమితి ఉంది. ఇక మోడల్ స్కూళ్లలో టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి కూడా దీనిని వర్తింపజేసింది. అదనంగా సామాజిక వర్గాల రిజర్వేషన్‌ను అమలు చేసింది. అయితే గురుకుల టీచర్ పోస్టులకు 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీలోనూ 39 ఏళ్ల సాధారణ గరిష్ట వయోపరిమితిని కొనసాగిం చాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు న్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ కానందున.. ప్రస్తుత నోటిఫికేషన్లో వయో పరిమితి పెంచి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పదేళ్ల ప్రత్యేక సడలింపుతో.. ఉమ్మడి రాష్ట్రంలో 2011 తరువాత ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో టీచర్ పోస్టులు, ఇతర శాఖల్లో పోస్టులను భర్తీ చేయలేదు. గతేడాది మాత్రం టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్–2, ఇంజనీర్లు, ఇతర విభాగాల్లోని పలు పోస్టుల భర్తీ చేపట్టారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పెద్దగా ఉద్యోగాల భర్తీ లేనందున పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇచ్చి.. 44 ఏళ్లకు పెంచారు. తాజాగా గురుకుల పోస్టులకు కూడా దీనిని వర్తింపజేస్తోంది. అయితే టీచర్ పోస్టులకు 39 ఏళ్ల సాధారణ గరిష్ట వయోపరిమితిని కొనసాగిస్తూనే.. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక సడలింపును అమలు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. తద్వారా వేల మందికి అవకాశం కల్పించినట్లు అవుతుందని పేర్కొంటున్నారు. ఈ విçషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.