ఢిల్లీ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపు రావడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. ఆదివారం ఉదయం ఢిల్లీ రైల్వే స్టేషన్లో రైళ్లను ఆపివేసి బాంబ్ స్క్వాడ్ జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఢిల్లీ-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును బాంబుతో పేల్చివేస్తామని ముంబై ఏటీఎస్ అధికారులకు ఈమెయిల్ వచ్చింది. వారు వెంటనే రైల్వే బోర్డును అప్రమత్తం చేశారు. దీంతో ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన, సమీపంలో వస్తున్న రైళ్లను ఎక్కడిక్కడ ఆపివేశారు. ఘజియాబాద్ వద్ద లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఆపివేసి తనిఖీలు చేశారు. శనివారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రవాదులు దాడి చేసిన మరుసటి రోజు బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భద్రత సిబ్బంది క్షుణ్నంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు. అనంతరం రైళ్లు బయల్దేరాయి.