Trans Co.
-
Telangana: డిస్కంలు ఇక ‘గల్లీ’ స్థాయికి!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమీప భవిష్యత్తులో గల్లీ లకు మాత్రమే పరిమితం కానున్నాయి. 11 కేవీ లైన్లు, రోడ్డు పక్కన దిమ్మెలపై ఉండే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీలు), వీటి నుంచి వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే లోటెన్షన్(ఎల్టీ) లైన్లు మాత్రమే వీటి నిర్వహణలో ఉండ నున్నాయి. డిస్కంల యాజమాన్యంలోని కీలకమైన 33 కేవీ వ్యవస్థను గంప గుత్తగా విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)కు అప్పగించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతో 33 కేవీ సరఫరా లైన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు ట్రాన్స్‌కోకు బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే డిస్కంల అజమాయిషీ కింద ఒక్క సబ్‌స్టేషన్ కూడా ఉండదు. నష్టాల తగ్గింపు, విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంపుదల, సరైన వ్యూహ రచన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పేర్కొంది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణకు ముమ్మర కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 33 కేవీ భారం తప్పించడానికే.. ప్రతిపాదిత విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2021ను చట్టసభలు ఆమోదిస్తే విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కంలకు పోటీగా ప్రైవేటు ఫ్రాంచైజీలు, ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీల ఆగమనానికి మార్గం సుగమనం కానుంది. 33 కేవీ వ్యవస్థను ట్రాన్స్‌కోకు అప్పగించిన తర్వాత విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ సాంకేతికంగా సరళీకృతం కానుంది. కొత్తగా వ్యాపారంలోకి దిగే ప్రైవేటు ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలకు ఇలా సులభంగా ఉండేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. డిస్కంల 11 కేవీ వ్యవస్థను మాత్రమే అద్దెకు తీసుకోవడం ద్వారా ప్రైవేటు ఆపరేటర్లు తమ వినియోగదారులకు నేరుగా విద్యుత్ సరఫరా చేసి బిల్లులు వసూలు చేసుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుందని నిపుణులు పేర్కొంటున్నారు. దశల వారీ అప్పగింతకు చర్యలు తీసుకోండి డిస్కంల 33 కేవీ వ్యవస్థ ఆస్తులను దశల వారీగా ట్రాన్స్‌కోకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఈ నెల 1న రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో సూచించింది. తొలి దశలో 33 కేవీ వ్యవస్థకు సంబంధించిన ఇంక్రిమెంటల్ అసెట్స్‌తో పాటు ఓవర్ లోడెడ్ అసెట్స్‌ను ట్రాన్స్‌కోకు అప్పగించాలని కోరింది. 33 కేవీ వ్యవస్థ నవీకరణ, ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌కోకు ఆర్థిక సహాయం చేయాలని తెలిపింది. లేనిపక్షంలో పవర్ గ్రిడ్‌తో ట్రాన్స్‌కో జాయింట్ వెంచర్‌ను నెలకొల్పడం ద్వారా 50:50 వాటా పెట్టుబడితో నవీకరణ, ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. నష్టాలను సాకుగా చూపుతూ.. ప్రస్తుతం ట్రాన్స్‌కో యాజమాన్యం పరిధిలో 400 కేవీ 220 కేవీ, 132/110 కేవీ, 66 కేవీ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. దీని నిర్వహణలో ఉన్న 66 కేవీ–220 కేవీ స్థాయి వ్యవస్థల్లో కేవలం 1.72–2.39 శాతం నష్టాలు మాత్రమే ఉండగా, డిస్కంల నిర్వహణలో ఉన్న సబ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ (33 కేవీ వ్యవస్థ)లో భారీగా 4.8 శాతం నష్టాలున్నట్టు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీ నేతృత్వంలోని ఓ కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో డిస్కంల చేతిలో ఉన్న 33 కేవీ వ్యవస్థను ట్రాన్స్‌కోకు అప్పగించాలని ఈ కమిటీ చేసిన సిఫారసులను గత నెల 16న కేంద్రం ఆమోదించింది. ఒక్క శాతం నష్టాన్ని తగ్గించుకున్నా ఏటా రాష్ట్రాలకు రూ.4,495 కోట్ల నష్టాలు తగ్గిపోతాయని ఈ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రంలో ట్రాన్స్‌కోకు బదిలీ కానున్న డిస్కంల ఆస్తులు.. ఆస్తులు టీఎస్ఎన్పీడీసీఎల్ టీఎస్ఎస్పీడీసీఎల్ 33 కేవీ లైన్లు (కి.మీలో) 10,993 13,458 33/11 సబ్స్టేషన్లు 1,405 1,622 డిస్కంలకు మిగలనున్న ఆస్తులు.. ఆస్తులు టీఎస్ఎన్పీడీసీఎల్ టీఎస్ఎస్పీడీసీఎల్ 11 కేవీ లైన్లు (కి.మీలో) 87,260 91,997 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 2,95,000 4,35,453 -
‘కాళేశ్వరా’నికి చౌకగా కరెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి 1,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3 లోపు తక్కువ ధరతో విక్రయించేందుకు జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం గోవాలో ఎన్టీపీసీ నిర్వహించిన దక్షిణాది ప్రాంత వినియోగదారుల సమావేశానికి ప్రభాకర్‌రావు హాజరై ఆ సంస్థ సీఎండీ గురుదీప్ సింగ్‌తో చర్చలు జరిపా రు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం వచ్చే ఏడాది విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అదనపు విద్యుత్ సరఫరా చేయాలని ఈ సమావేశంలో గురుదీప్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన యూనిట్‌కు రూ.3 లోపే ధరతో 1,500 మెగావాట్ల సౌర విద్యు త్ విక్రయించేందుకు అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో భారీగా జరుగుతున్న పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపుతుండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదనను తగ్గించేందుకు బ్యాకింగ్ డౌన్ చేయాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితులతో సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ల మధ్య పెద్దగా బేధం లేకుండా పోయిందని ఈ సమావేశంలో సీఎండీ అభిప్రాయపడ్డారన్నారు. -
విద్యుత్ గ్రీవెన్స్‌కు భారీగా అర్జీలు
నల్లగొండ జిల్లా మోత్కూరులో సోమవారం ట్రాన్స్‌కో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల సదస్సుకు భారీగా వినతులు వచ్చాయి. వినియోగదారులు తమ సమస్యల పరిష్కారానికి క్యూకట్టారు. మొదలైన రెండు గంటల్లోనే అధికారులకు 30 మంది వరకూ దరఖాస్తులు అందజేశారు. ఎస్సీ భిక్షపతి, గ్రీవెన్స్ సెల్ సీజీఎం హరగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ట్రాన్స్‌కో x మున్సిపాలిటీ
* సంగారెడ్డిలో ముదిరిన వివాదం * బకాయి చెల్లించలేదని మున్సిపాలిటీకి కరెంటు కట్ * ట్రాన్స్‌కో పన్నుల బకాయిపై లెక్కతీస్తున్న మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డిలో ట్రాన్స్ కో, మున్సిపాల్టీల మధ్య వార్ నడుస్తోంది. మున్సిపాలిటీ బకాయిలు పెరిగిపోయాయని ట్రాన్స్‌కో అధికారులు కార్యాలయానికి కరెంటు సరఫరాను నిలిపివేశారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు అసలు ట్రాన్స్‌కో ఆస్తి బకాయి ఎంత ఉందో లెక్కలు తీసే పనిలో ఉన్నారు. ఎవరి లెక్కలు వారివి మున్సిపాల్టీ ట్రాన్స్‌కోకు రూ.5.65 లక్షల బకాయిగా ఉండడంతో వారం రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులు సరఫరాను నిలిపివేశారు. దీంతో వారం రోజులుగా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. జనన, మరణ ధువపత్రాలతో పాటు ప్రభుత్వం కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు ఏకంగా మున్సిపల్ పాలక వర్గ సమావేశం నిర్వహించి ట్రాన్స్‌కో ఆస్తి పన్ను బకాయిపై లెక్క తీయాలని తీర్మాణం చేశారు. ఆమేరకు మున్సిపాలిటీ అధికారులు ట్రాన్స్‌కో కార్యాలయం భవనంతో పాటు అతిథిగృహం, పట్టణంలో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు, ఎన్ని విద్యుత్ స్తంభాలు మున్సిపల్ స్థలంలో ఉన్నాయన్న దానిపై మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ గయాసోద్దీన్ సిబ్బందితో కలిసి లెక్కలు వేస్తున్నారు. ట్రాన్స్ కో ఎస్ఈ కార్యాలయంతో పాటు డీఈ , ట్రాన్స్‌కో సమావేశ మందిరానికి సంబంధించి ఇంతవరకు ఆస్తి పన్ను చెల్లించలేదని తేలినట్లు తెలిసింది. కొత్తగా నిర్మించిన మూడు భవనాలకు సైతం మున్సిపాల్టీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. మొత్తంగా ట్రాన్స్‌కో మున్సిపాలిటీకి దాదాపు 9.కోట్ల మేర బకాయిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ట్రాన్స్‌కోకు నోటీసులు పంపేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. రూ.3 లక్షలు చెల్లిస్తామన్నా వినలేదు ట్రాన్స్‌కోకు మున్సిపాలిటీ బకాయి ఉన్న మాట వాస్తవమే. అందువల్లే బిల్లులతో సంబంధం లేకుండా ప్రతినెలా ట్రాన్స్‌కోకు రూ. 3 లక్షలు చెల్లిస్తామన్నా ట్రాన్స్‌కో అధికారులు ఒప్పుకోలేదు. వాస్తవానికి ట్రాన్స్‌కో రూ.5.65 లక్షల బకాయిగా చూపిస్తున్నప్పటికీ, మున్సిపాలిటీ మాత్రం రూ.3 కోట్లు మాత్రమే బకాయిగా ఉంది. ఈ బకాయి అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసి తగు చర్యలు తీసుకుంటాం. -గయాసోద్దీన్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, సంగారెడ్డి -
చిమ్మచీకటి
పల్లెలు, పట్టణాల్లో కరెంట్ కట్ * భారీగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు * చెల్లించాల్సిందేనంటున్న ట్రాన్స్‌కో * ఆర్థిక పరిస్థితి సరిగా లేదంటున్న పంచాయతీలు * తాగునీటికీ తప్పని తిప్పలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేత వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లావ్యాప్తంగా 671 గ్రామ పంచాయతీలు సుమారు రూ.50 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయనే కారణంతో ఐదు రోజుల క్రితం జిల్లా పంచాయతీ కార్యాలయం సహా అన్ని పంచాయతీలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలకు ప్రాణవాయువుగా ఉన్న తాగునీటి సరఫరాకు సైతం ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రతను కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి దృష్టికి జిల్లాలోని సర్పంచులు తీసుకెళ్లడంతో ఆయన చొరవ తీసుకున్నారు. గ్రామ పంచాయతీలు మంచినీటిని సరఫరా చేసే మోటార్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వీధిదీపాలకు కావాల్సిన విద్యుత్‌ను మాత్రం పునరుద్ధరించలేదు. పూర్తి బకాయిలతో బిల్లులు చెల్లిస్తే తప్ప తాము చేసేదేమీ లేదని ట్రాన్స్‌కో అధికారులు కరాఖండిగా చెబుతున్నారు. ఈ క్రమంలో సర్పంచులు కలెక్టర్ ఇలంబరితిని మంగళవారం కలిశారు. గ్రామ పంచాయతీల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా ట్రాన్స్‌కో అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని విన్నవించారు. సర్పంచులుగా తాము పగ్గాలు చేపట్టి 15 నెలలు మాత్రమే అయ్యిందని, ప్రభుత్వం నుంచి టీఎఫ్సీ నిధులు అరకొరగా ఒక్కసారి మాత్రమే వచ్చాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవి తప్ప పంచాయతీల నిర్వహణకు మరే రకమైన నిధులు లేని పరిస్థితి ఉందని తెలిపారు. ఇప్పటికే తాగునీటి సరఫరా, పంచాయతీ కార్యాలయాల నిర్వహణ తదితర ఖర్చులను అతి కష్టంగా భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తాము పూర్తి బకాయిలను చెల్లించలేమని సర్పంచుల సంఘం కలెక్టర్‌కు విన్నవించింది. నిధుల్లేక కష్టాలు గతంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన టీఎఫ్సీ నిధులను ప్రభుత్వమే విద్యుత్ బకాయిల కింద నేరుగా ట్రాన్స్‌కోకు జమ చేసింది. దీంతో గ్రామ పంచాయతీలపై విద్యుత్‌భారం పడకుండా కొంతకాలం నెట్టుకువచ్చారు. అయితే మూడు, నాలుగేళ్లుగా విద్యుత్ బకాయిలపై ట్రాన్స్‌కో ఒత్తిడి చేయకపోవడం, పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో విద్యుత్ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. గత పాలక వర్గాల హయాంలోని విద్యుత్ బిల్లులను కట్టడానికి అనేక మంది సర్పంచులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చిన్న గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అధికార వర్గాలే ఉటంకిస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో స్వయం పాలన ఉన్నప్పుడే నిధుల సమీకరణ సైతం గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికి పన్ను వేయడం ద్వారా నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. అయితే జిల్లావ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు రూ.18 కోట్లు ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉండగా, రూ. 5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు మించి వసూలు కాకపోవడంతో పంచాయతీల నిర్వహణపై ఇటు అధికారులు, ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ఇవేవీ తమ పరిధిలోని అంశాలు కానట్టు బకాయిల కోసం ట్రాన్స్‌కో కొరడా ఝుళిపించడంతో పరిస్థితి అయోమయంగా మారింది. సర్పంచుల విజ్ఞప్తి మేరకు స్పందించిన కలెక్టర్ ఆయా గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని తనకు నివేదిక రూపంలో ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌ను ఆదేశించారు. ఆయా గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకుని విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని, అసలే ఆర్థిక పరిస్థితి బాగాలేని పంచాయతీలు కొన్ని నెలల విద్యుత్ బిల్లులు చెల్లించి, మిగతావి చెల్లించేందుకు కొంత సమయం వెసులుబాటును ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ట్రాన్స్‌కో అధికారులకు కలెక్టర్ సూచించినట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌కో, పంచాయతీల మధ్య ఏర్పడిన ఈ విద్యుత్ బిల్లుల చెల్లింపు ఆగాధం గ్రామీణ ప్రాంతాల్లో అంధకారానికి దారితీస్తోంది. రాత్రి 7 దాటితే చాలు అనేక గ్రామాల్లో వీధి దీపాలు లేక చిమ్మచీకట్లు కమ్ముకుని చిట్టడువులను తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పంచాయతీ జిల్లా కార్యాలయానికి సైతం అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సుమారు రూ.లక్షకు పైగా బకాయి ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ కార్యాలయ భవనం తొలుత ఖానాపురం హవేలి గ్రామ పంచాయతీ కార్యాలయంగా ఉండేది. నగరపాలక సంస్థ ఆవిర్భావం అనంతరం అందులో విలీనం కావడంతో మున్సిపల్ డివిజన్ కార్యాలయంగా కొద్దికాలం పనిచేసింది. ఆ సమయంలో విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం ఇప్పుడు డీపీఓ కార్యాలయానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. కార్పొరేషన్, గ్రామ పంచాయతీల మధ్య నలుగుతున్న ఈ బిల్లుల పంచాయిని ఏ విధంగా పరిష్కరించాలో అధికారులకు ఒక పట్టాన అర్థం కావడం లేదు. రెండు రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి బకాయిలకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తే తప్ప విద్యుత్ సరఫరా ఇవ్వలేమని ట్రాన్స్‌కో తేల్చి చెప్పింది. దీంతో పంచాయతీ పాలకవర్గాలు బిల్లులను చెల్లించడానికి తమ వద్ద నిల్వ ఉన్న నిధులు, ఇంకా కావాల్సిన నిధులను సేకరించే పనిలో పడ్డాయి. -
మళ్లీ పెరిగిన విద్యుత్ కోతలు
చెన్నూర్ : నిన్న మొన్నటి వరకు మండల కేంద్రాల్లో రోజుకు 4 గంటల విద్యుత్ కోతలు ఉంటే మళ్లీ శనివారం నుంచి 6 గంటల విద్యుత్ కోతలు ఉంటాయని ట్రాన్స్ కో అధికారులు ప్రకటించారు. దీంతో వర్షాకాలంలో కూడా ప్రజలకు విద్యుత్ వెతలు తప్పడంలేదు. దీంతో ఇటు చిన్న వ్యాపారులు, అటు రైతులు, మరోవైపు గృహ వినియోగదారులు కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. వ్యాపారాలపై పిడుగు ఇదివరకు మండల కేంద్రాల్లో ఉదయం 6 నుం చి 8 వరకు సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు కరెంటు కోతలు విధించారు. ఈ సమయాల్లో కోత విధించడంతో చిన్న వ్యాపారులకు కొంత వెసులుబాటు లభించింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తుండడంతో వెల్డింగ్ షాపులు, జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్, పిండి గిర్ని, టైర్ పంక్చర్ టైలరింగ్, కార్పెంటర్లు, సర్వీసింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న చిన్న వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. షాపులు తెరిచే సమయంలో కరెంటు కోతలు ఉంటే తాము పనులు ఎలా చేసుకునేదని వ్యాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరని నష్టం కరెంటు కోతలు ప్రారంభం నుంచి ప్రజలు, రై తులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కరెంటు ఉంటే రూ.300ల నుంచి రూ. 400ల వరకు గిట్టుబాటు అయ్యేది. రెండు నెలల ట్రాన్స్‌కో విధిస్తున్న కరెంటు కోత ల మూలంగా రోజుకు రూ.200 గిట్టుబాటు కావడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. మ ళ్లీ మరో రెండు గంటలు పెంచితే షాపుల అద్దె లు కట్టేందుకు కూడా తమ సంపాదన సరిపోదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడలేదని ఇష్ట్యారాజ్యంగా కరెంటు సరఫరా నిలిపివేయడంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.