సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమీప భవిష్యత్తులో గల్లీ లకు మాత్రమే పరిమితం కానున్నాయి. 11 కేవీ లైన్లు, రోడ్డు పక్కన దిమ్మెలపై ఉండే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీలు), వీటి నుంచి వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే లోటెన్షన్(ఎల్టీ) లైన్లు మాత్రమే వీటి నిర్వహణలో ఉండ నున్నాయి. డిస్కంల యాజమాన్యంలోని కీలకమైన 33 కేవీ వ్యవస్థను గంప గుత్తగా విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)కు అప్పగించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
దీంతో 33 కేవీ సరఫరా లైన్లు, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ట్రాన్స్‌కోకు బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే డిస్కంల అజమాయిషీ కింద ఒక్క సబ్‌స్టేషన్ కూడా ఉండదు. నష్టాల తగ్గింపు, విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంపుదల, సరైన వ్యూహ రచన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పేర్కొంది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణకు ముమ్మర కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
33 కేవీ భారం తప్పించడానికే..
ప్రతిపాదిత విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2021ను చట్టసభలు ఆమోదిస్తే విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కంలకు పోటీగా ప్రైవేటు ఫ్రాంచైజీలు, ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీల ఆగమనానికి మార్గం సుగమనం కానుంది. 33 కేవీ వ్యవస్థను ట్రాన్స్‌కోకు అప్పగించిన తర్వాత విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ సాంకేతికంగా సరళీకృతం కానుంది. కొత్తగా వ్యాపారంలోకి దిగే ప్రైవేటు ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలకు ఇలా సులభంగా ఉండేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. డిస్కంల 11 కేవీ వ్యవస్థను మాత్రమే అద్దెకు తీసుకోవడం ద్వారా ప్రైవేటు ఆపరేటర్లు తమ వినియోగదారులకు నేరుగా విద్యుత్ సరఫరా చేసి బిల్లులు వసూలు చేసుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుందని నిపుణులు పేర్కొంటున్నారు.
దశల వారీ అప్పగింతకు చర్యలు తీసుకోండి
డిస్కంల 33 కేవీ వ్యవస్థ ఆస్తులను దశల వారీగా ట్రాన్స్‌కోకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఈ నెల 1న రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో సూచించింది. తొలి దశలో 33 కేవీ వ్యవస్థకు సంబంధించిన ఇంక్రిమెంటల్ అసెట్స్‌తో పాటు ఓవర్ లోడెడ్ అసెట్స్‌ను ట్రాన్స్‌కోకు అప్పగించాలని కోరింది. 33 కేవీ వ్యవస్థ నవీకరణ, ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌కోకు ఆర్థిక సహాయం చేయాలని తెలిపింది. లేనిపక్షంలో పవర్ గ్రిడ్‌తో ట్రాన్స్‌కో జాయింట్ వెంచర్‌ను నెలకొల్పడం ద్వారా 50:50 వాటా పెట్టుబడితో నవీకరణ, ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
నష్టాలను సాకుగా చూపుతూ..
ప్రస్తుతం ట్రాన్స్‌కో యాజమాన్యం పరిధిలో 400 కేవీ 220 కేవీ, 132/110 కేవీ, 66 కేవీ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. దీని నిర్వహణలో ఉన్న 66 కేవీ–220 కేవీ స్థాయి వ్యవస్థల్లో కేవలం 1.72–2.39 శాతం నష్టాలు మాత్రమే ఉండగా, డిస్కంల నిర్వహణలో ఉన్న సబ్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ (33 కేవీ వ్యవస్థ)లో భారీగా 4.8 శాతం నష్టాలున్నట్టు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీ నేతృత్వంలోని ఓ కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో డిస్కంల చేతిలో ఉన్న 33 కేవీ వ్యవస్థను ట్రాన్స్‌కోకు అప్పగించాలని ఈ కమిటీ చేసిన సిఫారసులను గత నెల 16న కేంద్రం ఆమోదించింది. ఒక్క శాతం నష్టాన్ని తగ్గించుకున్నా ఏటా రాష్ట్రాలకు రూ.4,495 కోట్ల నష్టాలు తగ్గిపోతాయని ఈ కమిటీ అభిప్రాయపడింది.
రాష్ట్రంలో ట్రాన్స్‌కోకు బదిలీ కానున్న డిస్కంల ఆస్తులు..
ఆస్తులు టీఎస్‌ఎన్పీడీసీఎల్ టీఎస్‌ఎస్పీడీసీఎల్
33 కేవీ లైన్లు (కి.మీలో) 10,993 13,458
33/11 సబ్‌స్టేషన్లు 1,405 1,622
డిస్కంలకు మిగలనున్న ఆస్తులు..
ఆస్తులు టీఎస్‌ఎన్పీడీసీఎల్ టీఎస్‌ఎస్పీడీసీఎల్
11 కేవీ లైన్లు (కి.మీలో) 87,260 91,997
డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 2,95,000 4,35,453
Telangana: డిస్కంలు ఇక ‘గల్లీ’ స్థాయికి!
Published Sat, Sep 4 2021 1:52 AM | Last Updated on Sat, Sep 4 2021 9:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment