గెలుపుపై ఎవరి ధీమా వారిదే!
సాక్షి, న్యూఢిల్లీ: ట్రాన్స్ యమునా ప్రాంతం రూపురేఖలు కామన్వెల్త్ క్రీడల తరువాత మారిపోతే ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో మారిపోయాయి. కామన్వెల్త్ క్రీడల నిర్వహణ, ముఖ్యమంత్రి తనయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం వల్ల గడచిన పదేళ్లలో ఈ నియోజకవర్గం అనూహ్యంగా అభివృద్ధి చెందింది.
ఈ అభివృద్ధినే సిట్టింగ్ ఎంపీ సందీప్ దీక్షిత్ తన ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశంగా చేసుకున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ ప్రచారం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడవలసిందే.
2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఇప్పుడు ఓటర్లు కాంగ్రెస్ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ విషయం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనే తేటతెల్లమయింది.
మురికివాడలు, పునరావాస కాలనీల ఓటర్లు కాంగ్రెస్‌ను వదిలి ఆప్‌కు ఓటు వేయడం వల్లనే ఆప్ ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిలో గెలిచింది. ఇప్పుడా పార్టీ ముస్లిం, దళిత ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడింది. ఇక్కడున్న రెండు రిజర్వుడ్ సీట్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కే దక్కాయి. 49 రోజుల పాలన తరువాత ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజల భ్రమలు తొలగిపోయాయని, ఈసారి కూడా గెలుపు కాంగ్రెస్ దేనని సందీప్ దీక్షిత్ అంటున్నారు.
వాస్తవానికి మాత్రం పరిస్థితి భిన్నంగా కనబడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి గాంధీజీ మనవడు రాజ్‌మోహన్ గాంధీని బరిలోకి దింపింది. మిగతా రెండు పార్టీల కన్నా ముందుగా ఆప్ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో ప్రచారంలో ఆయనే ముందున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఐదు నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆప్ కార్యకర్తలు చెబుతున్నారు.
బీజేపీ అభ్యర్థి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో అనుబంధం ఉన్న మహేశ్‌గిరి తూర్పుఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. అట్టడుగు స్థాయిలో తాను మూడేళ్లుగా పనిచేస్తున్నానని, విజయం తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభావంపైనే మహేశ్‌గిరి గెలుపు ఆధారపడి ఉందన్నది వాస్తవం.
ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు జరిగిన 12 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు సార్లు గెలిచినప్పటికీ తూర్పు ఢిల్లీని ప్రధానంగా బీజేపీ నియోజకవర్గంగా పేర్కొంటారు. బీజేపీ కంచుకోటగా చెప్పుకునే ఈ నియోజకవర్గం ఈసారి కమల నాథుల వశమతుందో లేదో చూడాలి.