బదిలీలు మా ఇష్టప్రకారమే జరగాలి
మాకు కనీస సమాచారం ఇవ్వకుండానే బదిలీలు చేస్తారా?
* ముఖ్యమంత్రిపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు
* ఏడుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారుల బదిలీ ఉత్తర్వుల వ్యవహారంలో టీడీపీ నేతల పంతమే నెగ్గింది. కొందరి బదిలీలను నిలిపివేసేలా ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బదిలీ ఉత్తర్వులను నిలిపివేస్తూ ప్రభుత్వం 24 గంటల్లోనే మరో జీవో జారీ చేసింది.
ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉన్న ఉపముఖ్యమంత్రి చేసిన బదిలీలను ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు అడ్డుకోవడం గమనార్హం. ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేవి తమ సొంత వ్యవహారమైనట్లు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. అంతా తమ ఇష్టప్రకారమే జరగాలని పట్టుబడుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా వారికి వంతపాడుతున్నారు. ఈ విషయంలో ఆయన తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త లోకేశ్ జోక్యం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా బదిలీల వ్యవహారం వల్ల సీఎం, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మధ్య దూరం మరింత పెరిగిపోయినట్లు తెలుస్తోంది.
నేను చేసిన సూచనలు పాటించరా!
22 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను కేఈ అనుమతితో బదిలీ చేస్తూ మంగళవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నటు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. 24 గంటలు గడవక ముందే పాత ఉత్తర్వులను తుంగలో తొక్కడం సంచలనం సృష్టిస్తోంది. తమను సంప్రదించకుండానే అధికారులను బదిలీ చేశారంటూ డిప్యూటీ సీఎం మంత్రి కేఈ కృష్ణమూర్తిపై మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికిఫిర్యాదు చేశారు.
విశాఖపట్నం ఆర్డీవో నియామకం విషయంలో వివాదం చెలరేగినప్పుడు తాను చేసిన సూచనలకు విరుద్ధంగా ఇప్పుడు ఎలా బదిలీలు చేస్తారంటూ డిప్యూటీ సీఎం కేఈపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు ఏడుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జేసీ శర్మ ఆదేశాలు జారీ చేశారు.
బదిలీ ఉత్తర్వులు నిలిపివేత
కృష్ణా జిల్లాలో జాయింట్ కలెక్టర్-2గా పనిచేస్తున్న ఒ.శేషయ్యను అదే జిల్లాలో డీఆర్వోగా, విశాఖపట్నం ఆర్డీవో ఎస్.వెంకటేశ్వర్లును అదే జిల్లా డీఆర్వోగా నియమిస్తూ, వైఎస్సార్ జిల్లాలో జాయింట్ కలెక్టర్-2గా సి.చంద్రశేఖరర్రెడ్డిని కొనసాగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తూర్పుగోదావరి జిల్లా డీఆర్వోగా పనిచేస్తోన్న బి.యాదగిరి, నంద్యాల ఆర్డీవోగా పనిచేస్తోన్న సి.సుధాకర్‌రెడ్డిలను హైదరాబాద్‌లో ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సెలవులో ఉన్న ఎం.వెంకటేశ్వర్లును తూర్పుగోదావరి జిల్లా డీఆర్వోగా, తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించిన తిప్పే నాయక్‌ను నంద్యాల ఆర్డీవోగా నియమించింది. కానీ బుధవారం వీరి బదిలీ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.