transfer of shares
-
రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు
సాక్షి, అమరావతి: ‘రామోజీరావు పచ్చి మోసం చేశారు. తొలుత మమ్మల్ని ఓ గదిలో నిర్బంధించి, తుపాకీతో బెదిరించి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్లు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నించారు. ప్రాణా లు దక్కించుకొనేందుకు ఆయనిచ్చిన ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టి బయట పడ్డాం. షేర్లు మాత్రం బదిలీ చేయలేదు. ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలతో మాకున్న 288 షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు బదలాయించుకున్నారు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి చెప్పారు. తమ షేర్లను బదిలీ చేసి రామోజీ మోసానికి పాల్పడ్డారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీఐడీని, న్యాయస్థానాన్ని కోరారు. యూరి రెడ్డి మంగళవారం తన న్యాయవాది శివరామిరెడ్డితో కలిసి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రామోజీరావు ఏ విధంగా తమ షేర్లను అక్రమంగా బదలాయించుకున్నదీ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తుపాకితో బెదిరించి.. మా తండ్రి జీజే రెడ్డి చనిపోయిన తరువాత మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా అన్నయ్య మార్టిన్ రెడ్డి, నేను మా వాటా షేర్ల కోసం ఎన్నో ఏళ్లు రామోజీరావును సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి 2016లో హైదరాబాద్‌లో ఆయన్ని కలిశాము. మాకు డివిడెండ్ కింద చెక్ ఇచ్చారు. ఆ తరువాత మా షేర్లపై సర్టిఫికెట్ అడిగితే ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. మమ్మల్ని లోపల ఉంచి తలుపులు వేసేశారు. చాలాసేపటి తరువాత రామోజీరావు వచ్చి ఖాళీ స్టాంపు పేపర్లు ముందు పెట్టారు. వాటిపై సంతకాలు చేయమన్నారు. మేము నిరాకరించడంతో మా తలలకు తుపాకి గురి పెట్టి ‘సంతకాలు పెడతారా లేదా.. మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరు ఇక్కడ’ అని బెదిరించారు. అది ఆయన సామ్రాజ్యం. అంతా ఆయన మనుషులే. మా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు. ఆ సమయంలో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. ఆయనకు ఎదురు చెబితే ప్రాణాలు దక్కవన్నది అర్థమైంది. కేవలం ప్రాణాలు కాపాడుకొనేందుకే ఆ ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు చేసి బయటకు వచ్చాం. షేర్ల బదిలీకి మేము అంగీకరించలేదు. షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేయలేదు. రామోజీరావు మాకు ఇచ్చిన చెక్‌ను కూడా నగదుగా మార్చుకోలేదు. చట్ట ప్రకారం ఇది చెల్లదు కంపెనీల చట్టం ప్రకారం ఏదైనా షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి కావాలంటే మూడు అంశాలు తప్పనిసరి. ప్రతిపాదన (ఆఫర్), ఆమోదం (యాక్సెప్టెన్సీ), ప్రతిఫలం బదిలీ (కన్సిడరేషన్) తప్పనిసరి. మా షేర్ల బదిలీ విషయంలో ఆ మూడూ జరగలేదు. షేర్లు బదిలీ చేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. అందువల్ల ప్రతిపాదనే లేదు. రామోజీరావు కోరినా మేము ఆమోదించలేదు. అందువల్ల యాక్సెప్టెన్సీ లేదు. మా షేర్ల బదిలీకి ప్రతిఫలంగా మాకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలమూ దక్కలేదు. కాబట్టి మేము షేర్లు విక్రయించామన్న రామోజీరావు వాదన చెల్లదు. ఆయన వాదన పూర్తిగా అబద్ధం, మోసపూరితం. చేతి అప్పు అంటూ బుకాయింపు మా తండ్రికి చేతి అప్పుగా ఇచ్చిన దానికి ప్రతిఫలంగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి నిధిని సమకూర్చారని రామోజీరావు ముందుగా బుకాయించారు. చేతి అప్పు తీర్చాలి అంటే నగదు ఇస్తారు గానీ కంపెనీలో పెట్టుబడి పెడతారా అని మేము ప్రశ్నిస్తే రామోజీరావు సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం షేర్లు బదిలీ చేయాలని మమ్మల్ని తుపాకీతో బెదిరించారు. ఫోర్జరీ సంతకాలతో షేర్ల బదిలీ.. ఆర్వోసీకి ఫిర్యాదు మేము సమ్మతించకపోయినా, చెక్‌ను నగదుగా మార్చుకోకపోయినా మా వాటా 288 షేర్లను రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారని 2017లో గుర్తించాం. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి వెళ్లి సంబంధిత పత్రాలను పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. పలు పత్రాల్లో మా సంతకాలను ఫోర్జరీ చేశారు. దీనిపై అప్పట్లోనే ఆర్వోసీకి ఫిర్యాదు చేశాను. సీఐడీ దర్యాప్తుతో ధైర్యం వచ్చి.. రామోజీరావు తుపాకీతో బెదిరించారని కొందరికి మా ఆవేదన చెప్పుకున్నా అప్పట్లో ఫలితం లేకపోయింది. దాంతో ఫిర్యాదు చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఆయన రాజకీయ పరపతి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వ్యవస్థలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్ము అక్రమ పెట్టుబడులకు మళ్లించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ రామోజీ, ఇతరులపై కేసు నమోదు చేసింది. సోదాలు నిర్వహిస్తోంది. దాంతో మాకు ధైర్యం వచ్చింది. అందుకే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని సీఐడీకి కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశాము. సీఐడీ అధికారులు నాలుగైదు నెలలపాటు మా ఫిర్యాదును పరిశీలించారు. ఆధారాలు తెమ్మన్నారు. మేము ఇచ్చిన ఆధారాలను పరిశీలించారు. మా ఫిర్యాదు సరైనదే అని నిర్ధారించుకున్న తరువాతే కేసు నమోదు చేశారు. మూలధన నిధి ఏపీ నుంచే వచ్చింది కాబట్టి.. మా తండ్రి జీజే రెడ్డి కృష్ణా జిల్లాలోని తన వ్యవసాయ భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్నే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టారు. అంటే మూలధన నిధిని ఏపీ నుంచే సమీకరించారు. ఆ పెట్టుబడితోనే మా పేరిట 288 షేర్లు వచ్చాయి. ఆ షేర్లనే రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారు. అందుకే ఈ కేసు ఏపీకి సంబంధించినదని న్యాయ నిపుణులు చెప్పారు. దాంతోనే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశాం. మాకు జరిగిన అన్యాయంపై సీఐడీని సంప్రదించాం. సీఐడీ, న్యాయస్థానం మా ఆవేదనను గుర్తించి న్యాయం చేస్తాయని విశ్వసిస్తున్నాం. శైలజ పేరిట అప్పుడు 100 షేర్లే.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ పేరిట 2017 వరకు 100 షేర్లే ఉన్నాయి. జీజే రెడ్డి పేరిట మాత్రం 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి షేర్లను అక్రమంగా బదిలీ చేసిన తరువాత ప్రస్తుతం శైలజ కిరణ్ పేరిట 388 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి తప్ప మిగిలిన షేర్ హోల్డర్లంతా రామోజీ కుటుంబ సభ్యులే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఆరుగురు షేర్ హోల్డర్లే ఉన్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఏనాడూ పబ్లిక్ ఇష్యూ జారీ చేయలేదు. ఉన్న ఆరుగురు షేర్ హోల్డర్లలో అయిదుగురు రామోజీరావు కుటుంబ సభ్యులే. జీజే రెడ్డి ఒక్కరే బయట వ్యక్తి. ఆయన పేరిట ఉన్న షేర్లను కూడా అక్రమంగా శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. ఆ అక్రమ వ్యవహారానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని ఇతర షేర్ హోల్డర్లు.. అంటే రామోజీ కుటుంబ సభ్యులు సహకరించారు. రామోజీరావు పెద్ద గూడుపుఠాణికి పాల్పడ్డారు. -
సొంతంగా షేర్ల బదిలీ
బ్రోకర్ దగ్గర షేర్లు విక్రయిస్తే, ఆటోమేటిగ్గా అవి డీమ్యాట్ ఖాతా నుంచి డెబిట్ అవుతాయి. ఇందుకు ఖాతాను ప్రారంభించే సమయంలోనే అనుమతి (పవర్ ఆఫ్ అటార్నీ) తీసుకునే విధానం అమల్లో ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో బ్రోకర్ దగ్గర ఖాతా ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌లో షేర్లను విక్రయించుకోవడం లేదంటే కుటుంబ సభ్యులకు బహుమతిగా షేర్లను బదిలీ చేయాల్సి రావచ్చు. మరి అటువంటప్పుడు స్వయంగా ఎవరికి వారు ఆ బదిలీ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. దీని గురించి ఎక్కువ మందికి దాదాపుగా తెలియదు. ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడానికి ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్గాలున్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయో అవగాహన కల్పించే ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం ఇది... ఇదంతా డిజిటల్ యుగం. దాదాపు బ్యాంకు సేవలు, బ్రోకింగ్ సేవలను ఆన్లైన్లోనే చేసుకుంటున్నాం. అయినా కానీ, రెండు డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్లను బదిలీ చేసేందుకు ఇప్పటికీ ఆఫ్‌లైన్ విధానాన్నే ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. నూతనతరం బ్రోకర్లు (డిపాజిటరీ పార్టిసిపెంట్) అయిన జెరోదా, ఏంజెల్ వన్ తదితర కొన్ని సంస్థలు ఆన్లైన్లోనే షేర్లను సులభంగా బదిలీ చేసుకునే సేవలను అందిస్తున్నాయి. ఆన్లైన్లో షేర్ల బదిలీని రెండు విధాలుగా చేపట్టొచ్చు. డీమ్యాట్ ఖాతా ద్వారా లేదంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) ఈజీఎస్ట్ కోసం నమోదు చేసుకుని ఆన్లైన్లో షేర్లను బదిలీ చేసుకోవచ్చు. ఈజీఎస్ట్అనేది సెక్యూరిటీల సమాచారం తెలుసుకునేందుకు, లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఉద్దేశించినది. అలాగని అన్ని బ్రోకరేజీ సంస్థలు ఆన్లైన్లో బదిలీ సేవలను అందించడం లేదు. చాలా డీపీలు, బ్యాంకులకు సంబంధించిన బ్రోకింగ్ విభాగాల్లో ఖాతా ఉన్న వారు ఆఫ్‌లైన్ (భౌతిక రూపంలో) విధానంలో చేసుకోవాల్సి వస్తుంది. ఆఫ్‌లైన్ మార్గం.. ఆఫ్‌లైన్‌లో అయితే ఫిజికల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్) బుక్లెట్ ఉండాలి. షేర్లను బదిలీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బుక్‌లెట్‌లోని ఓ స్లిప్పై బదిలీ చేయాలనుకుంటున్న కంపెనీ, ఐఎస్ఐఎన్ నంబర్, ఎన్ని షేర్లు తదితర వివరాలు నమోదు చేయాలి. ఏ డీపీ పరిధిలోని క్లయింట్‌కు బదిలీ చేయాలనుకుంటున్నారో, ఆ వివరాలు కూడా ఇవ్వాలి. అంటే క్లయింట్ ఐడీ, డీపీ ఐడీ వివరాలు నమోదు చేయాలి. ఐఎస్ఐఎన్ అన్నది ప్రతీ కంపెనీకి కేటాయించే ఓ యూనిక్ నంబర్. గూగుల్‌లో సెర్చ్ చేసినా ఈ నంబర్ తెలుస్తుంది. షేర్లను స్వీకరించే క్లయింట్ సీఎంఆర్ కాపీ జత చేయాలి. డీఐఎస్ అన్నది బ్యాంక్ చెక్ మాదిరిగా పనిచేస్తుంది. ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు నగదు బదిలీకి చెక్ ఉపయోగపడినట్టే.. డీఐఎస్ అన్నది ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేసే సాధనం. ఆఫ్‌లైన్‌లో ఇలా షేర్ల బదిలీకి కొన్ని రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో, కొందరు బ్రోకర్ల వద్ద ఇందుకు నెల వరకు సమయం తీసుకోవచ్చు. బ్రోకర్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ నుంచి లేదంటే బ్రోకర్‌కు ఈ మెయిల్ రూపంలో, బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి డీఐఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు సంబంధించిన డీమ్యాట్ ఖాతా కలిగి ఉన్న వారు నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే బ్యాంకు శాఖకు వెళ్లి దీనికి దరఖాస్తు సమర్పించొచ్చు. రిజిస్టర్డ్ చిరునామాకు డీఐఎస్ బుక్లెట్ వస్తుంది. లేదా బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి తీసుకోవచ్చు. బదిలీ చేయాలనుకున్నప్పుడు డీఐఎస్ స్లిప్‌లో అన్ని వివరాలు నమోదు చేసి, సీఎంఆర్ కాపీ జతచేసి బ్రోకర్ ఆఫీసులో సమర్పించాలి. లేదంటే కార్యాలయానికి పంపించాలి. బ్యాంకులు అయితే కేవలం కొన్ని శాఖల్లోనే ఈ సేవలు లభిస్తాయి. ఆన్లైన్లో షేర్ల బదిలీ ఆన్లైన్లో షేర్ల బదిలీకి రెండు విధానాలున్నాయి. ఒకటి డీమ్యాట్ ఖాతా ద్వారా చేసుకోవచ్చు. అలాగే, సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా బదిలీ చేసుకోవచ్చు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సేవను అందిస్తున్నాయి. కానీ, భద్రత రీత్యా ఈ ప్రక్రియ కొంత ఆన్లైన్, కొంత ఆఫ్‌లైన్‌తో కూడుకుని ఉంటుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ అన్నది కనీసం ఒక అకౌంట్ హోల్డర్ వ్యక్తిగతంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆమోదం పొందితే, ఏ డీమ్యాట్ ఖాతాకు అయినా ఆన్లైన్లోనే షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే గరిష్టంగా ఐదు ఖాతాల వరకు ఆన్లైన్లో, అది కూడా నిర్ణీత విలువ మేరకే బదిలీకి అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సీడీఎస్‌ఎల్‌లో అకౌంట్ ఉండి, బదిలీ చేయాలనుకుంటున్న ఖాతా కూడా సీడీఎస్ఎల్ పరిధిలోనే ఉన్నట్టయితే బదిలీ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది. ఇందుకోసం సీడీఎస్ఎల్ ఈజీఎస్ట్ వద్ద ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే, ఎన్ఎస్డీఎల్ పరిధిలోనే రెండు ఖాతాల మధ్య బదిలీకి ఎన్ఎస్డీఎల్ స్పీడ్–ఈ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సీడీఎస్ఎల్ పరిధిలో జాయింట్ అకౌంట్ ఉంటే, ఖాతాను నిర్వహించే వ్యక్తికి అనుకూలంగా మిగిలిన జాయింట్ అకౌంట్ హోల్డర్స్ నుంచి డిక్లరేషన్‌తో భౌతికంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ముగిసి, బ్రోకర్ నుంచి అమోదం లభించిన తర్వాత సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ పరిధిలో ఏ ఖాతాకు అయినా షేర్లను బదిలీ చేసుకోవడం సాధ్యపడుతుంది. సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ పరిధిలోని రెండు ఖాతాల మధ్య ఆన్లైన్లో షేర్ల బదిలీ చాలా సులభం. కాకపోతే సీడీఎస్ఎల్ – ఎన్ఎస్డీఎల్ పరిధిలోని ఖాతాల మధ్య బదిలీ చేసుకోవాలంటే ఓటీపీ వంటి అదనపు భద్రతా రక్షణలు అమల్లో ఉన్నాయి. మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అదనపు సమయం కూడా తీసుకుంటుంది. సొంత ఖాతాల మధ్య.. తన పేరిటే మరో ఖాతాకు షేర్లను బదిలీ చేయాలనుకుంటే అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్. అంటే ఒక డీపీ వద్ద డీమ్యాట్ ఖాతాను మూసేసి, మరో డీపి వద్ద ఖాతా ప్రారంభించడం. అలాంటప్పుడు క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్ విధానం అనుసరించాలి. ముందుగా మరో బ్రోకర్ వద్ద ఖాతాను తెరవాలి. అప్పుడు మూసి వేయాలని అనుకుంటున్న బ్రోకర్‌కు దరఖాస్తు ఇవ్వాలి. దాంతో అందులో ఉన్న అన్ని సెక్యూరిటీలను అదే క్లయింట్ వేరొక ఖాతాకు బదిలీ చేసిన తర్వాత, క్లోజ్ చేస్తారు. ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఒక బ్రోకర్ సేవలు నచ్చనప్పుడు, న్యూఏజ్ బ్రోకర్‌కు మారిపోవాలని అనుకున్నప్పుడు ఈ మార్గాన్ని అనుసరించొచ్చు. ఈ ప్రక్రియను భౌతికంగా చేసుకోవాల్సిందే. మరో విధానం పాక్షిక బదిలీ. అంటే అప్పటికే ఉన్న ఒక డీమ్యాట్ ఖాతాను కొనసాగిస్తూ, అందులోని షేర్లను మరో సొంత ఖాతాకు బదిలీ చేసుకోవడం ఈ విధానంలో ముఖ్యాంశం. వ్యయాలు, పన్నులు ఒక డీమ్యాట్ ఖాతాను మూసివేస్తూ, అందులోని షేర్లను అదే వ్యక్తికి సంబంధించి వేరొక డీపీ పరిధిలోని ఖాతాకు బదిలీ చేసేట్టు అయితే ఎలాంటి చార్జీల్లేవు. ఖాతా మూసివేయకుండా, వాటిని వేరొక ఖాతాకు బదిలీ చేసేట్టు అయితే షేర్ల విలువలో నిర్ణీత శాతం లేదంటే రూ.15–25 (స్క్రిప్ వారీ) ఫ్లాట్ చార్జీ పడుతుంది. ఒకవేళ ఆఫ్ మార్కెట్ విక్రయం ద్వారా బదిలీ చేస్తున్నట్టు అయితే స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాల్సి రావచ్చు. ఇలా షేర్లను బదిలీ చేస్తున్న వారు ధరసహా పలు వివరాలను నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మూలధన లాభాల పన్నును చెల్లించేందుకు ఈ వివరాలు ప్రామాణికం అవుతాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆఫ్ మార్కెట్ (స్టాక్ ఎక్సే్ఛంజ్లతో సంబంధం లేకుండా) లావాదేవీలపై ఏదైనా పన్ను వివాదం తలెత్తినప్పుడు ఈ రికార్డులు అవసరంపడతాయి. ఒక వ్యక్తి ఒక డీపీ పరిధిలోని ఖాతా నుంచి వేరొక డీపీ పరిధిలోని ఖాతాకు షేర్లను బదిలీ చేసుకున్నప్పుడు కొందరు బ్రోకర్లు ఈ వివరాలను రికార్డు చేస్తున్నారు. అటువంటప్పుడు దీర్ఘకాల మూలధన లాభం, స్వల్పకాల మూలధన లాభం పన్ను వివరాలు సులభంగా పొందొచ్చు. కొందరు బ్రోకర్ల పరిధిలో ఈ వివరాలు నమోదవడంలేదు. కనుక ఎంత కాలం పాటు సదరు సెక్యూరిటీని కలిగి ఉన్నామనే వివరాల కోసం పాత ఖాతాకు సంబంధించి (కొనసా గిస్తున్నా లేదా మూసివేస్తున్నా కానీ) అకౌంట్ స్టేట్మెంట్ జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. జెరోదా వంటి కొందరు బ్రోకర్లు ఆఫ్‌లైన్‌లో బదిలీ ద్వారా డీమ్యాట్ ఖాతాలోకి కొత్తగా సెక్యూరిటీలు వచ్చి చేరినప్పుడు.. మాన్యువల్‌గా వాటిని కొనుగోలు చేసిన తేదీ, ధర వివరాలు నమోదు చేసే ఆప్షన్ ఇస్తున్నాయి. ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి షేర్లను బదిలీ చేస్తున్నట్టు అయితే ఆ లావాదేవీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకే కుటుంబం పరిధిలోని వేరొక సభ్యుడికి బదిలీ చేస్తే పన్ను లేదు. వేర్వేరు కుటుంబాల వారి మధ్య బదిలీ (ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలకు మించినప్పుడు) గిఫ్ట్ ట్యాక్స్ పడుతుంది. సీడీఎస్ఎల్ పరిధిలో ఆన్లైన్ బదిలీకి... ► సీడీఎస్ఎల్ పరిధిలో డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు సీడీఎస్ఎల్ ఈజీఎస్ట్ పేజీకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. ► డీపీ ఐడీ, క్లయింట్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ కొట్టాలి. ► అప్పుడు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని అక్కడ ఇవ్వాలి. ► యూజర్ నేమ్, టైప్ ఆఫ్ అకౌంట్ సెలక్ట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ► ట్రస్టెడ్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలి. ► ట్రస్టెడ్ అకౌంట్ కింద 4 సీడీఎస్ఎల్ ఖాతాల వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చు. ► అకౌంట్ ఆఫ్ చాయిస్ కింద సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్ ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ బదిలీ విధానం ► బ్రోకర్ నుంచి డీఐఎస్ బుక్లెట్ తీసుకోవాలి. ► బదిలీ చేయాలనుకుంటే డీఐఎస్ స్లిప్పై అన్ని వివరాలు నమోదు చేయాలి. ► మీ నుంచి షేర్లను పొందే డీమ్యాట్ ఖాతాకు సంబంధించి క్లయింట్ మాస్టర్ రిపోర్ట్ (సీఎంఆర్) కాపీని తెప్పించుకోవాలి. ► అప్పుడు డీఐఎస్ స్లిప్‌తోపాటు, సీఎంఆర్ కాపీని బ్రోకర్‌కు సమర్పించాలి. ► బ్రోకర్ అన్ని వివరాలను వెరిఫై చేసి బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తారు. ► ఏ విధానంలో అయినా షేర్లు మీ ఖాతా నుంచి బదిలీ, జమ అయిన సమయంలో సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. -
‘సైఫ్’ పిటిషన్‌పై 24న ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 వాటాల బదలాయింపు వ్యవహారంలో ‘సైఫ్ మారిషస్ కంపెనీ లిమిటెడ్’దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు అనుమతిపై ఈనెల 24న ఉత్తర్వులు ఇస్తామని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ–హైదరాబాద్) పేర్కొంది. ట్రిబ్యునల్ సభ్యుడు అనంత పద్మనాభ స్వామి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. తమతో చేసుకున్న ఒప్పందం మేరకు టీవీ 9 వాటాల బదలాయింపు జరగలేదని, ఈ విషయంలో ఎన్సీఎల్టీ ఆదేశాలను ‘ఐ విజన్ మీడియా’ ధిక్కరించిందని గతంలోనే సైఫ్ మారిషస్ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. ఐ విజన్ మీడియాపై ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొంది. ఆ తర్వాత పరిణామాల్లో సైఫ్ పెట్టిన పెట్టుబడిని వెనక్కి ఇచ్చేసేందుకు ఏబీసీఎల్ శ్రీనిరాజు అంగీకరించారు. ఈ మేరకు ఐ విజన్, సైఫ్ మారిషస్ కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది. దీంతో తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని ఎన్సీఎల్టీని సైఫ్ మారిషస్ కోరింది. దీనిపై విచారణ జరుగుతుండగానే.. టీవీ9లో తాను వాటాదారుడినని చెప్పుకుంటున్న సినీనటుడు శివాజీ అభ్యంతరం తెలిపారు. ఈ పరిస్థితుల్లో సైఫ్ మారిషస్ పిటిషన్ శుక్రవారం ఎన్సీఎల్టీ ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణకు శివాజీ తరపు న్యాయవాదులు ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో ఉపసంహరణ పిటిషన్‌పై ఈ నెల 24న తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని ట్రిబ్యునల్ సభ్యుడు అనంతపద్మనాభ స్వామి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. -
విలీనానికి ఎస్బీఐ బోర్డు ఓకే!!
• 6 బ్యాంకుల విలీనానికి పచ్చజెండా • 4 బ్యాంకుల షేర్ల బదిలీ నిష్పత్తికీ ఓకే న్యూఢిల్లీ: మెగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు పడింది. భారతీయ మహిళా బ్యాంక్‌తో పాటు ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకోడానికి సంబంధించిన ప్రతిపాదనకు గురువారం ఎస్బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీటీ) ఉన్నాయి. ఇవి లిస్టెడ్ బ్యాంకులు. ఇక వీటితోపాటు అన్‌లిస్టెడ్ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) విలీన ప్రతిపాదనకూ ఆమోదముద్ర పడింది. నాలుగు బ్యాంకులకు సంబంధించి షేర్ల బదిలీ (స్వాప్) నిష్పత్తికి కూడా బోర్డు ఆమోదముద్ర వేసింది. బీఎంబీఎల్తోపాటు ఐదు అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో విలీనానికి గత నెలల్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇది బ్యాంకులకు పరస్పర ప్రయోజనం కలిగించే అంశమని ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. కాగా విలీన ప్రతిపాదన వల్ల ఉద్యోగుల ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగబోదని ఎస్బీఐ స్పష్టం చేస్తోంది. షేర్ల బదిలీ నిష్పత్తి ఇలా... ⇔ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ ప్రతి 10 షేర్లకూ ఎస్బీఐ తన 28 షేర్లను కేటాయిస్తుంది. ⇔ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ విషయంలో ప్రతి 10 షేర్లకూ తన 22 షేర్లను ఎస్బీఐ ఇస్తుంది. ⇔ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ ప్రతి షేర్లకూ ఎస్బీఐ 22 షేర్లు లభిస్తాయి. ⇔ ఇక మహిళా బ్యాంక్ విషయంలో ప్రతి 100 కోట్ల ఈక్విటీషేర్లకు ఎస్బీఐ 4,42,31,510 షేర్లను ఇస్తుంది. షేర్లు రయ్... విలీన వార్తల నేపథ్యంలో... గురువారం నాడు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీలో ఎస్‌బీబీజే షేర్ 3 శాతం ఎగసి, రూ.674కు చేరింది. ఎస్బీఎం షేర్ ధర 3 శాతం పెరిగి రూ.624కు ఎగసింది. ఎస్బీటీ షేర్ 4% ఎగసి రూ.508గా నమోదయ్యింది. ఇక ఎస్బీఐ షేర్ ధర ఒకశాతం ఎగసి రూ.249కి చేరింది. విలీనానంతర స్థితి ఇది... ⇔ భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్దదైన ఈ విలీన ప్రక్రియ వల్ల ఎస్బీఐ బ్యాంక్ అసెట్ బుక్ విలువ రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది. ⇔ 22,500 బ్రాంచీలు, 58,000 ఏటీఎం నెట్‌వర్క్‌తో కస్టమర్ల సంఖ్య 50 కోట్లకు పెరుగుతుంది. ⇔ ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్బీఐ అవతరిస్తుంది. ⇔ అతిపెద్ద భారత ప్రైవేటు దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌తో పోల్చితే అసెట్ బేస్ ఐదు రెట్లు పెరుగుతుంది. ⇔ 36 దేశాల్లో 191 విదేశీ కార్యాలయాలుసహా ప్రస్తుతం ఎస్బీఐ 16,500 బ్రాంచీలను కలిగి ఉంది. 2008లో ఎస్బీఐలో మొదటిసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనమైంది. అటు తర్వాత రెండేళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనం జరిగింది. తెలంగాణ అభ్యంతరం! ఎస్బీఐలో ఎస్బీహెచ్ విలీనానికి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. తెలంగాణ బ్యాంకుగా ఎస్‌బీహెచ్‌కు ప్రత్యేక గుర్తింపు కొనసాగాలన్నది తమ ఉద్దేశమన్నారు. 1956కు ముందు నుంచే ఈ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీటీ) విలీనాన్ని వ్యతిరేకిస్తూ... కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానం తరహాలోనే తెలంగాణ అసెంబ్లీ కూడా తీర్మానం చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, దీనిపై ఇంకా తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడాల్సి ఉందన్నారు. సెప్టెంబర్ 2న సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు... మోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలు, కార్మిక సంస్కరణలకు నిరసనగా సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని బ్యాంకు ఉద్యోగులు నిర్ణయించారు. ఫలితంగా సుమారు 5 లక్షల బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు విఘాతం కలగనుంది. ‘మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లను ప్రైవేటీకరించేందుకు, అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మొండి బకాయిల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తోంది. వీటికి నిరసనగా కార్మిక సంఘాలు తలపెట్టిన సెప్టెంబర్ 2నాటి దేశవ్యాప్త సమ్మెలో మేము కూడా పాలుపంచుకోనున్నాం’ అని అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం గురువారం ఇక్కడ తెలిపారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్యూఏ తదితర కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్టు ఈ ఏడాది మార్చి 30నే ప్రకటించాయి. అయితే, భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించింది.