సాక్షి, హైదరాబాద్: టీవీ9 వాటాల బదలాయింపు వ్యవహారంలో ‘సైఫ్ మారిషస్ కంపెనీ లిమిటెడ్’దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు అనుమతిపై ఈనెల 24న ఉత్తర్వులు ఇస్తామని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ–హైదరాబాద్) పేర్కొంది. ట్రిబ్యునల్ సభ్యుడు అనంత పద్మనాభ స్వామి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. తమతో చేసుకున్న ఒప్పందం మేరకు టీవీ 9 వాటాల బదలాయింపు జరగలేదని, ఈ విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను ‘ఐ విజన్ మీడియా’ ధిక్కరించిందని గతంలోనే సైఫ్ మారిషస్ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. ఐ విజన్ మీడియాపై ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొంది.
ఆ తర్వాత పరిణామాల్లో సైఫ్ పెట్టిన పెట్టుబడిని వెనక్కి ఇచ్చేసేందుకు ఏబీసీఎల్ శ్రీనిరాజు అంగీకరించారు. ఈ మేరకు ఐ విజన్, సైఫ్ మారిషస్ కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది. దీంతో తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని ఎన్‌సీఎల్‌టీని సైఫ్ మారిషస్ కోరింది. దీనిపై విచారణ జరుగుతుండగానే.. టీవీ9లో తాను వాటాదారుడినని చెప్పుకుంటున్న సినీనటుడు శివాజీ అభ్యంతరం తెలిపారు. ఈ పరిస్థితుల్లో సైఫ్ మారిషస్ పిటిషన్ శుక్రవారం ఎన్‌సీఎల్‌టీ ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణకు శివాజీ తరపు న్యాయవాదులు ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో ఉపసంహరణ పిటిషన్‌పై ఈ నెల 24న తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని ట్రిబ్యునల్ సభ్యుడు అనంతపద్మనాభ స్వామి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment