విలీనానికి ఎస్బీఐ బోర్డు ఓకే!! | SBI approves merger with associate banks; 8 things you should know | Sakshi
Sakshi News home page

విలీనానికి ఎస్బీఐ బోర్డు ఓకే!!

Published Fri, Aug 19 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

విలీనానికి ఎస్బీఐ బోర్డు ఓకే!!

విలీనానికి ఎస్బీఐ బోర్డు ఓకే!!

6 బ్యాంకుల విలీనానికి పచ్చజెండా 
4 బ్యాంకుల షేర్ల బదిలీ నిష్పత్తికీ ఓకే

న్యూఢిల్లీ: మెగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు పడింది. భారతీయ మహిళా బ్యాంక్‌తో పాటు ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకోడానికి సంబంధించిన ప్రతిపాదనకు గురువారం ఎస్‌బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ (ఎస్‌బీటీ) ఉన్నాయి. ఇవి లిస్టెడ్ బ్యాంకులు.

ఇక వీటితోపాటు అన్‌లిస్టెడ్ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్‌బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్  (ఎస్‌బీహెచ్) విలీన ప్రతిపాదనకూ ఆమోదముద్ర పడింది. నాలుగు బ్యాంకులకు సంబంధించి షేర్ల బదిలీ (స్వాప్) నిష్పత్తికి కూడా బోర్డు ఆమోదముద్ర వేసింది. బీఎంబీఎల్‌తోపాటు ఐదు అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనానికి గత నెలల్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇది బ్యాంకులకు పరస్పర ప్రయోజనం కలిగించే అంశమని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. కాగా విలీన ప్రతిపాదన వల్ల ఉద్యోగుల ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగబోదని ఎస్‌బీఐ స్పష్టం చేస్తోంది.

 షేర్ల బదిలీ నిష్పత్తి ఇలా...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ ప్రతి 10 షేర్లకూ ఎస్‌బీఐ తన 28 షేర్లను కేటాయిస్తుంది.

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ విషయంలో ప్రతి 10 షేర్లకూ తన 22 షేర్లను ఎస్‌బీఐ ఇస్తుంది.

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ ప్రతి షేర్లకూ ఎస్‌బీఐ 22 షేర్లు లభిస్తాయి.

 ఇక మహిళా బ్యాంక్ విషయంలో ప్రతి 100 కోట్ల ఈక్విటీషేర్లకు ఎస్‌బీఐ 4,42,31,510 షేర్లను ఇస్తుంది.

 షేర్లు రయ్...
విలీన వార్తల నేపథ్యంలో... గురువారం నాడు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీలో ఎస్‌బీబీజే షేర్ 3 శాతం ఎగసి, రూ.674కు చేరింది. ఎస్‌బీఎం షేర్ ధర 3 శాతం పెరిగి రూ.624కు ఎగసింది. ఎస్‌బీటీ షేర్ 4% ఎగసి రూ.508గా నమోదయ్యింది. ఇక ఎస్‌బీఐ షేర్ ధర ఒకశాతం ఎగసి రూ.249కి చేరింది.

విలీనానంతర స్థితి ఇది...
భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్దదైన ఈ విలీన ప్రక్రియ వల్ల ఎస్‌బీఐ బ్యాంక్ అసెట్ బుక్ విలువ రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది.

22,500 బ్రాంచీలు, 58,000 ఏటీఎం నెట్‌వర్క్‌తో కస్టమర్ల సంఖ్య 50 కోట్లకు పెరుగుతుంది.

ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్‌బీఐ అవతరిస్తుంది.

అతిపెద్ద భారత ప్రైవేటు దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌తో పోల్చితే అసెట్ బేస్ ఐదు రెట్లు పెరుగుతుంది.

36 దేశాల్లో 191 విదేశీ కార్యాలయాలుసహా ప్రస్తుతం  ఎస్‌బీఐ  16,500 బ్రాంచీలను కలిగి ఉంది. 2008లో ఎస్‌బీఐలో మొదటిసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనమైంది. అటు తర్వాత రెండేళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనం జరిగింది.

 తెలంగాణ అభ్యంతరం!
ఎస్‌బీఐలో ఎస్‌బీహెచ్ విలీనానికి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. తెలంగాణ బ్యాంకుగా ఎస్‌బీహెచ్‌కు ప్రత్యేక గుర్తింపు కొనసాగాలన్నది తమ ఉద్దేశమన్నారు. 1956కు ముందు నుంచే ఈ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ (ఎస్‌బీటీ) విలీనాన్ని వ్యతిరేకిస్తూ... కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానం తరహాలోనే తెలంగాణ అసెంబ్లీ కూడా తీర్మానం చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, దీనిపై ఇంకా తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడాల్సి ఉందన్నారు.

సెప్టెంబర్ 2న సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు...
మోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలు, కార్మిక సంస్కరణలకు నిరసనగా సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని బ్యాంకు ఉద్యోగులు నిర్ణయించారు. ఫలితంగా సుమారు 5 లక్షల బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు విఘాతం కలగనుంది. ‘మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లను ప్రైవేటీకరించేందుకు, అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మొండి బకాయిల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తోంది.

వీటికి నిరసనగా కార్మిక సంఘాలు తలపెట్టిన సెప్టెంబర్ 2నాటి దేశవ్యాప్త సమ్మెలో మేము కూడా పాలుపంచుకోనున్నాం’ అని అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం గురువారం ఇక్కడ తెలిపారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్యూఏ తదితర కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్టు ఈ ఏడాది మార్చి 30నే ప్రకటించాయి. అయితే, భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement