Transfers of police officers
-
విశాఖ: ఖాకీకో కహానీ.. ఎస్ఐ, ఇద్దరు హెచ్‌సీ, కానిస్టేబుల్‌పై చర్యలు?
దొండపర్తి(విశాఖ దక్షిణ): ఈ ఖాకీలు ఒక్కొక్కరిది ఒక్కో కహాని. ఒక్కొక్కరు ఒక్కో ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఉన్నతాధికారుల వేటుకు గురయ్యారు. నగర పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ మంగళవారం ఒక ఎస్ఐ, ఇద్దరు హెచ్‌సీ, ఒక కానిస్టేబుల్‌పై బదిలీ వేటు వేయడం పోలీస్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. విధుల్లో అలసత్వం సెటిల్మెంట్ల వ్యవహారాలకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా చర్యలకు ఉపక్రమించడంతో మిగిలిన వారందరూ ఉలిక్కి పడ్డారు. కేసుల విషయంలో ఉన్నత స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారికి మెమో జారీ చేయడం, బదిలీ, సస్పెన్షన్ వేటు వేస్తుండడంతో అందరిలోను గుబులు రేగుతోంది. తాజాగా నాలుగు పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన బదిలీలు అడ్మిని్రస్టేటివ్ గ్రౌండ్స్‌లో అయినట్లు చూపిస్తున్నప్పటికీ ఆరోపణలు కారణంగానే వారిపై బదిలీ వేటు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీఆర్‌కు దువ్వాడ ఎస్ఐ దువ్వాడ లా అండ్ ఆర్డర్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.రాధాకృష్ణ వీఆర్‌కు అటాచ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన కారణాలతో బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. ఎస్ఐపై వచ్చిన ఆరోపణలు కారణంగానే వేటు పడినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఒక 304ఏ కేసులో ఒకరి నుంచి లంచం డిమాండ్ చేసిన విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతోనే ఆయనను వీఆర్‌కు అటాచ్ చేసినట్లు పోలీస్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏఆర్‌కు ఇద్దరు హెచ్‌సీలు.. ఒక పీసీ పద్మనాభం పోలీస్‌స్టేషన్ లా అండ్ ఆర్డర్ హెడ్‌కానిస్టేబుల్ టి.కాంతారావు, దువ్వాడ లా అండ్ ఆర్డర్ హెడ్‌కానిస్టేబుల్ ఎం.సూరిబాబుతో పాటు పెందుర్తి లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్ ఆర్.సంతోకుమార్లను సీపీ శ్రీకాంత్ సిటీ ఏఆర్‌కు అటాచ్ చేశారు. అయితే విధులలో నిర్లక్ష్యం, సెటిల్మెంట్లు, కేసుల నమోదులో తేడాలు వంటి కారణాలపై వీరిని బదిలీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నెలలో కూడా కేసుల నమోదులో తప్పుడు లెక్కలు చూపించిన 8 మంది కానిస్టేబుళ్లకు డీసీపీ సుమిత్ సునీల్‌గరుడ్ మెమోలు జారీ చేశారు. తాజాగా జరిగిన అటాచ్మెంట్లతో నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించే వారిని ఉపేక్షించేది లేదని సీపీ మరోసారి హెచ్చరికలు జారీ చేసినట్లయింది. -
వారిపై రాచకొండ సీపీ శాఖ పరమైన చర్యలు
సాక్షి, యాదాద్రి: విధి నిర్వహణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కొరడా ఝుళిపించారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, బీబీనగర్ హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్లను నిందితులకు సహకరించారని.. భూ వివాదాలు, వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆలేరు ఎస్ఐ జె.వెంకట్‌రెడ్డిని పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే వివిధ కారణాలు, సాధారణ బదిలీల్లో పలువురికి శుక్రవారం స్థానచలనం కలిగింది. పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారని.. పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో ఇద్దరు పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, బీబీనగర్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ కరుణాకర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్న పేలుడు పదార్థాల కేసులో నిందితుల పేర్లు మార్చేందుకు, మరో నిందితుడు సోమ రామకృష్ణకు ముందస్తు బెయిల్ రావడానికి సహకరించేందుకు యత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి మండలం కూనూరు వద్ద ఈ నెల 18న రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న జిలిటిన్‌స్టిక్స్, డిటోనేటర్లు, అమోనియం నైట్రేట్లను ఎస్ఓటీ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీస్‌లు పట్టుకున్నారు. ట్రాన్స్‌పోర్టుకు చెందిన వాహనం, బొలేరో వాహనంలో వీటిని తరలిస్తున్నారు. ఆలేరుకు చెందిన రాంపల్లి విక్రం, బొందుగులకు చెందిన రాంగోపాల్‌రెడ్డి, భువనగిరికి చెందిన సోమ రామకృష్ణలతోపాటు మరో ఆరుగురిని కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న పేలుడు పదార్థాల వాహనాలతోపాటు నిందితులను ఎస్ఓటీ పోలీసులు భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డికి అప్పగించారు. అనంతరం వాహనాల్లోని సామగ్రిని సీఐ పరిశీలించగా జిలిటిన్‌స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు తేలింది. లారీలో పేలుడు సామగ్రిని తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరిని సీఐ అదుపులోకి తీసుకున్నారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయాల్సి ఉండగా.. సీఐ అంతకు ముందే లారీ పట్టుబడ్డ విషయం ట్రాన్స్‌ఫోర్టు యాజమానికి ఓహెడ్ కానిస్టేబుల్ ద్వారా చేర వేశారు. దీంతో సంబంధిత ముగ్గురు ఓనర్లు సీఐతో బేరసారాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో కేసులో యాజమాన్యానికి సహకరించేందుకు సీఐ నిబంధనలకు విరుద్ధంగా భువనగిరి స్టేషన్లో కాకుండా పరిధి దాటి తనకు అనుకూలంగా ఉన్న బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్ఓటీ అధికారి ఫిర్యాదుతో.. పెద్ద ఎత్తున పట్టుబడ్డ పేలుడు పదార్థాల కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా, వారికి సహకరిస్తున్నారని ఎస్ఓటీ అధికారి.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ విచారణకు ఆదేశించారు. భువనగిరిలో కేసు నమోదు చేయాల్సి ఉండగా బీబీనగర్‌లో ఎందుకు పెట్టారనే కోణంలో దర్యాప్తు చేపట్టగా పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమోనియం నైట్రేట్ సరఫరా చేస్తున్న సోమ రామకృష్ణతోపాటు మరికొందరు నిందితుల పేర్లు కేసులో లేకుండా తప్పించాడన్న కోణంలో ఒక వైపు, నాన్‌బెయిలబుల్ కేసులో రామకృష్ణను అరెస్ట్ చేయాల్సి ఉండగా ముందస్తు బెయిల్ తీసుకొమ్మని నిందితునికి సీఐ సలహా ఇచ్చి అరెస్ట్ చేయకుండా జాప్యం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఇంటిలిజెన్స్ విచారణలో సైతం ముందస్తు బెయిల్ కోసం సీఐ సహకరిస్తున్నాడన్న విషయం విచారణ అధికారులు గుర్తించి సీపీకి నివేదిక ఇవ్వడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. కాగా ఏడాది క్రితం సీఐగా ఇక్కడికి వచ్చిన సురేందర్‌రెడ్డి గతంలో భువనగిరి రూరల్ ఎస్ఐగా పని చేస్తూ వివాదాల నేపధ్యంతో బదిలీపై వెళ్లారు. మరోవైపు సురేందర్‌రెడ్డికి హెడ్‌కానిస్టేబుల్ కరుణాకర్ సన్నిహితుడిగా ఉన్నాడు. దఫేదార్‌గా కరుణాకర్ చేసిన వసూళ్లపై ఫిర్యాదు అందడంతో సీపీకి అటాచ్ చేయగా 6నెలల క్రితం ఇదే స్టేషన్లో విధుల్లో చేరాడు. కాగా ఇదే సంవత్సరం మార్చి 10న అప్పటి భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డి, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నలు సిట్ పరి«ధిలో ఉన్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ చెందిన భూముల రిజిస్ట్రేషన్ కేసు నీరుగార్చారని అటాచ్ చేయడం పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆలేరు ఎస్ఐపై.. భూ వివాదాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆలేరు ఎస్ఐ జె.వెంకట్‌రెడ్డిపై కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాచకొండ సీపీ స్పందిస్తూ శుక్రవారం ఆయనను పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు పోలీసు అధికారుల బదిలీ శుక్రవారం జిల్లాలో పలువురు పోలీసులు బదిలీ అయ్యారు. యాదగిరిగుట్ట పట్టణ ఇన్స్పెక్టర్ నర్సింహారావు బదిలీ కాగా ఇ క్కడికి మహబూబ్‌నగర్ జిల్లానుంచి పాండురంగారెడ్డి వచ్చారు. ఆత్మకూర్(ఎం) ఎస్ఐ తుర్కపల్లికి, తుర్కపల్లి ఎస్ఐ వెంకటయ్య ఆత్మకూర్(ఎం)కు, యాదగిరిగుట్ట ఎస్ఐ రమేశ్‌ను ఆలేరుకు బదిలీ చేశారు. నిందితులకు సహకరించారనే చర్యలు పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారనే సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశాం. జిలెటిన్ స్టిక్, డిటోనేటర్లు, అమోనియం అక్రమ రవాణాలో నిందితులకు ముందస్తు బెయిల్‌కు సహకరించారు. ఈ కేసులో విచారణ జరుగుతోంది. –నారాయణరెడ్డి, డీసీపీ -
ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు..
‘మంచి’ పోలీసుస్టేషన్ అనుకున్న ఠాణాలో ఒక ఇన్స్పెక్టర్ చేరాక ఎన్నిరోజులు ఉంటారనేది గ్యారంటీ లేకుండా పోయింది. కష్టంగా ఏడాది దాటిందంటే... ఎవరు ఆ సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళనతో పనిచేయాల్సిన పరిస్థితి! అన్నింటినీ అధిగమించి రెండేళ్లు దాటితే చాలు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో మరెవరో అధికారి ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. సాక్షి, వరంగల్: బిగ్‌బాస్ సీజన్–3... అంటే ప్రస్తుతం తెలియని వారుండరు... సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక లెక్క.. శని, ఆదివారాల్లో మరో లెక్క! ఆ రెండు రోజుల్లో ఎలిమినేషన్ రౌండ్.. కనక ఎవరు మిగులుతారు, ఎవరు బయటకు వస్తారనేది బుల్లి తెర వీక్షకులను సస్పెన్స్‌లో ముంచెత్తుతోంది. ఇదంతా ఇక్కడెందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం పోలీసుశాఖలో బదిలీల పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ‘మంచి’ పోలీసుస్టేషన్ అనుకున్న ఠాణాలో ఒక ఇన్స్పెక్టర్ పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఎన్నిరోజులు ఉంటారనేది గ్యారంటీ లేకుండా పోయింది. కష్టంగా ఏడాది దాటిందంటే... ఎవరు ఆ సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళనతో పనిచేయాల్సిన పరిస్థితి! అన్నింటినీ అధిగమించి రెండేళ్లు దాటితే చాలు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో మరెవరో అధికారి ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుండడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిభకు పట్టం కట్టాల్సిన పోలీసు శాఖలో పైరవీలదే పై చేయిగా మారిందన్న చర్చ అధికారుల నడుమ సాగుతోంది. ప్రతిభ ఉన్నా సిఫారసు లేనిదే సీటు దక్కదనే భావనతో చాలామంది పొలీసు అధికారులు కాంప్రమైజ్ అవుతూ ‘నలుగురు నడిచిన దారి’లోనే వెళ్లక తప్పడం లేదంటున్నారు. ఆశ నిరాశ.. కోరుకున్న చోట కొలువు దక్కించుకునేందుకు పలువురు పోలీసు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ‘మంచి ఠాణా’ అనుకునే పోలీసుస్టేషన్లో ఎస్హెచ్ఓ సీటు కోసం ప్రయత్నాలు చేయని వారు లేరు. కానీ కొందరే ఆ ప్రయత్నాల్లో సక్సెస్ కాగా.. మిగతా వారికి నిరాశ ఎదురవుతోంది. శానససభ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పలువురు అధికారుల బదిలీ జరిగింది. ఇలా రెండు విడతల్లో సుమారు 14 మంది పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. కమలాపూర్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఇతర జిల్లాల్లో పని చేసినప్పుడు వివాదస్పదం కాగా, కేయూసీ సీఐ రాఘవేందర్రావు భూవివాదంలో సస్పెండ్ అయ్యారు. వీరిద్దరి స్థానాల్లో రవిరాజ్, డేవిడ్‌రాజ్‌ను నియమించడం వెనుక ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. అలాగే, హన్మకొండ, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ల బదిలీ కూడా జరిగింది. తాజాగా మంగళవారం 10 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో కీలకమైన మట్టెవాడ, ఇంతెజార్గంజ్, మిల్స్‌కాలనీ, మామునూరు, హసన్‌పర్తి తదితర పోస్టులు భర్తీ కాగా.. ఈ స్థానాల్లో ఇప్పటికే ఉన్న కొందరు వేకెన్సీ రిజర్వు(వీఆర్)లోకి వెళ్లారు. ఈ బదిలీల్లోనూ ప్రజాప్రతినిధుల లేఖలు కీలకంగా పని చేశాయన్న ప్రచారం పోలీసుశాఖలో జరుగుతోంది. ఏసీపీల పోటాపోటీ వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కీలకమైన ఏసీపీ పోస్టుల కోసం కూడా ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఎన్నికల కోడ్‌లో భాగంగా వచ్చిన కొందరు అధికారులు తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. మరికొందరు ఏసీపీలు ఏఎస్పీలుగా పదోన్నతి పొందగా వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వీటి కోసం ఏసీపీ/డీఎస్పీలుగా పని చేస్తున్న కొందరితో పాటు ఇటీవలే సీఐ నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన వారు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ఏసీపీలు నర్సయ్య, శ్రీధర్, నర్సింగరావులు ఎన్నికల కోడ్‌లో భాగంగా నియమితులు కాగా.. వారు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కోసం ఖమ్మం ఎస్బీలో పని చేస్తున్న అధికారితో పాటు కొత్తగూడెంలో ఏసీపీగా ఉన్న ఒకరు, ఏసీబీలో పని చేస్తున్న ఇంకో అధికారి పోటీ పడుతున్నట్లు తెలిసింది. హన్మకొండ స్థానం కోసం ఇక్కడే ఇన్స్పెక్టర్లుగా పని చేసి కొద్దినెలల తేడాతో పదోన్నతి పొందిన ఇద్దరు అ«ధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. గతంలో ధర్మసాగర్, ఆత్మకూరులో సీఐగా పని చేసి.. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పని చేస్తున్న ఏసీపీ కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలిసింది. పరకాల, నర్సంపేట ఏసీపీలు సుదీంధ్ర, సునీతమోహన్కు ఏఎస్పీలుగా పదోన్నతి రాగా ప్రస్తుతం ఈ రెండు స్థానాలతో పాటు కాజీపేట ఏసీపీ పోస్టింగ్‌కు కూడా తీవ్ర పోటీ నెలకొంది. అయితే వరంగల్, హన్మకొండ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వారు.. అక్కడ సాధ్యం కాని పక్షంలో ఈ మూడింటిలోనైనా ఓ స్థానం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. నాలుగు కీలక స్థానాల కోసం.. వరంగల్, హన్మకొండ, కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని మరో నాలుగు కీలక పోలీసుస్టేషన్లలో ఎస్హెచ్ఓ స్థానాల కోసం పోటాపోటీగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సీఐలుగా రెండేళ్ల సర్వీస్ దాటిన రెండు ఠాణాలతో పాటు ఖాళీగా హన్మకొండ స్థానం కోసం రోజురోజుకు పోటీ పెరుగుతుంది. కాజీపేట ఎస్హెచ్ఓగా వచ్చేందుకు గతంలో సుబేదారి, స్టేషన్ఘన్పూర్ల్లో పని చేసి ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న ఓ సీఐ జోరుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న ఇద్దరు సీఐలతో పాటు కమలాపూర్‌లో సీఐగా పని చేసిన ఒకరు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. సుబేదారి ఠాణా కోసం కాజీపేట సీఐగా పని చేసిన ఒకరు, వీఆర్‌లో ఉన్న ఓ సీఐ, షీ టీమ్స్‌లో మరో సీఐ లైన్లో ఉన్నట్లు తెలిసింది. హన్మకొండ సీఐ బోనాల కిషన్‌కు ఏసీపీగా పదోన్నతి రాగా.. ఆయన స్థానంలో గతంలో మిల్స్‌కాలనీ సీఐగా పని చేసి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఒకరితో పాటు, ఇటీవల హసన్‌పర్తి సీఐగా పని చేసిన మరొకరు పోటీ పడుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పరకాల అధికారికి కూడా స్థానచలనం తప్పదన్న ప్రచారంతో అక్కడ కూడా దస్తీ వేసే పనిలో పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ ఐపీఎస్‌లకు కీలక బాధ్యతలు
38 మంది పోలీసు అధికారుల బదిలీలు ఏపీకి వెళ్లే 14 మంది ఐపీఎస్‌లను డీజీపీకి రిపోర్టు చేయాలని ఆదేశం హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను ఆదివారం పెద్దఎత్తున బదిలీ చేసింది. అంతేకాక రాష్ట్రానికి ఖరారైన ఐపీఎస్ అధికారులకు కీలకమైన శాంతిభద్రతల బాధ్యతలను అప్పగించింది. మొత్తం 38 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆంధ్రాకు వెళ్లనున్న 14 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లను ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఉమ్మడిరాష్ట్రంలో సివిల్ సర్వీసు అధికారులను కేటాయించే ప్రక్రియ దాదాపుగా తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐదు శాతం మినహా రెండు రాష్ట్రాలకు ఐపీఎస్ అధికారుల కేటాయింపులు పూర్తయినట్టు తెలిసింది. దీనిపై గెజిట్ నోటిపికేషన్ రావడానికి మరికొంత సమయం పడుతుందని కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలిసింది. వచ్చే నెల ఐదవ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండడంతో రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్ అధికారులను శాంతిభద్రతల పోస్టులలో నియమించడం అత్యవసరమని సీఎం కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏ అధికారిని ఎక్కడ నియమించాలనే విషయమై డీజీపీ కసరత్తు జరిపి సర్కార్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఎస్పీ నుంచి ఐజీ స్థాయి అధికారుల బదిలీల ప్రతిపాదనలు పరిశీలించిన సీఎం కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఏపీకి వెళ్లనున్న కొందరు ఐపీఎస్‌లను తుది ఉత్తర్వులు వచ్చేంత వరకైనా ఇక్కడే కొనసాగించేందుకు అంగీకరించలేదని సమాచారం. ఎలాగూ వారు కొద్ది రోజుల్లో ఏపీకి వెళ్లాల్సినవారేనని తేల్చిన ప్రభుత్వం వారిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్‌లకే అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. దీంట్లో భాగంగానే ఐజీ నవీన్‌చంద్, సందీప్ శాండిల్య, డీఐజీ బి.మల్లారెడ్డి తదితరలకు అదన పు బాధ్యతలను అప్పగించింది. అసెంబ్లీ సమావేశాల వేళ శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఈ బదిలీలు చేసినట్టు తెలిసింది.