సాక్షి, యాదాద్రి: విధి నిర్వహణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కొరడా ఝుళిపించారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, బీబీనగర్ హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్‌లను నిందితులకు సహకరించారని.. భూ వివాదాలు, వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆలేరు ఎస్‌ఐ జె.వెంకట్‌రెడ్డిని పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే వివిధ కారణాలు, సాధారణ బదిలీల్లో పలువురికి శుక్రవారం స్థానచలనం కలిగింది.
పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారని..
పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో ఇద్దరు పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, బీబీనగర్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ కరుణాకర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్న పేలుడు పదార్థాల కేసులో నిందితుల పేర్లు మార్చేందుకు, మరో నిందితుడు సోమ రామకృష్ణకు ముందస్తు బెయిల్ రావడానికి సహకరించేందుకు యత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరిపై చర్యలు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి మండలం కూనూరు వద్ద ఈ నెల 18న రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న జిలిటిన్‌స్టిక్స్, డిటోనేటర్లు, అమోనియం నైట్రేట్‌లను ఎస్‌ఓటీ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీస్‌లు పట్టుకున్నారు. ట్రాన్స్‌పోర్టుకు చెందిన వాహనం, బొలేరో వాహనంలో వీటిని తరలిస్తున్నారు. ఆలేరుకు చెందిన రాంపల్లి విక్రం, బొందుగులకు చెందిన రాంగోపాల్‌రెడ్డి, భువనగిరికి చెందిన సోమ రామకృష్ణలతోపాటు మరో ఆరుగురిని కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న పేలుడు పదార్థాల వాహనాలతోపాటు నిందితులను ఎస్‌ఓటీ పోలీసులు భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డికి అప్పగించారు. అనంతరం వాహనాల్లోని సామగ్రిని సీఐ పరిశీలించగా జిలిటిన్‌స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు తేలింది. లారీలో పేలుడు సామగ్రిని తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరిని సీఐ అదుపులోకి తీసుకున్నారు.
బీబీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయాల్సి ఉండగా.. సీఐ అంతకు ముందే లారీ పట్టుబడ్డ విషయం ట్రాన్స్‌ఫోర్టు యాజమానికి ఓహెడ్ కానిస్టేబుల్ ద్వారా చేర వేశారు. దీంతో సంబంధిత ముగ్గురు ఓనర్లు సీఐతో బేరసారాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో కేసులో యాజమాన్యానికి సహకరించేందుకు సీఐ నిబంధనలకు విరుద్ధంగా భువనగిరి స్టేషన్‌లో కాకుండా పరిధి దాటి తనకు అనుకూలంగా ఉన్న బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఎస్‌ఓటీ అధికారి ఫిర్యాదుతో..
పెద్ద ఎత్తున పట్టుబడ్డ పేలుడు పదార్థాల కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా, వారికి సహకరిస్తున్నారని ఎస్‌ఓటీ అధికారి.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ విచారణకు ఆదేశించారు. భువనగిరిలో కేసు నమోదు చేయాల్సి ఉండగా బీబీనగర్‌లో ఎందుకు పెట్టారనే కోణంలో దర్యాప్తు చేపట్టగా పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమోనియం నైట్రేట్ సరఫరా చేస్తున్న సోమ రామకృష్ణతోపాటు మరికొందరు నిందితుల పేర్లు కేసులో లేకుండా తప్పించాడన్న కోణంలో ఒక వైపు, నాన్‌బెయిలబుల్ కేసులో రామకృష్ణను అరెస్ట్ చేయాల్సి ఉండగా ముందస్తు బెయిల్ తీసుకొమ్మని నిందితునికి సీఐ సలహా ఇచ్చి అరెస్ట్ చేయకుండా జాప్యం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఇంటిలిజెన్స్ విచారణలో సైతం ముందస్తు బెయిల్ కోసం సీఐ సహకరిస్తున్నాడన్న విషయం విచారణ అధికారులు గుర్తించి సీపీకి నివేదిక ఇవ్వడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. కాగా ఏడాది క్రితం సీఐగా ఇక్కడికి వచ్చిన సురేందర్‌రెడ్డి గతంలో భువనగిరి రూరల్ ఎస్‌ఐగా పని చేస్తూ వివాదాల నేపధ్యంతో బదిలీపై వెళ్లారు. మరోవైపు సురేందర్‌రెడ్డికి హెడ్‌కానిస్టేబుల్ కరుణాకర్ సన్నిహితుడిగా ఉన్నాడు. దఫేదార్‌గా కరుణాకర్ చేసిన వసూళ్లపై ఫిర్యాదు అందడంతో సీపీకి అటాచ్ చేయగా 6నెలల క్రితం ఇదే స్టేషన్‌లో విధుల్లో చేరాడు. కాగా ఇదే సంవత్సరం మార్చి 10న అప్పటి భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డి, భువనగిరి పట్టణ ఇన్స్‌పెక్టర్ వెంకన్నలు సిట్ పరి«ధిలో ఉన్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ చెందిన భూముల రిజిస్ట్రేషన్ కేసు నీరుగార్చారని అటాచ్ చేయడం పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఆలేరు ఎస్‌ఐపై..
భూ వివాదాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆలేరు ఎస్‌ఐ జె.వెంకట్‌రెడ్డిపై కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాచకొండ సీపీ స్పందిస్తూ శుక్రవారం ఆయనను పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పలువురు పోలీసు అధికారుల బదిలీ
శుక్రవారం జిల్లాలో పలువురు పోలీసులు బదిలీ అయ్యారు. యాదగిరిగుట్ట పట్టణ ఇన్స్‌పెక్టర్ నర్సింహారావు బదిలీ కాగా ఇ క్కడికి మహబూబ్‌నగర్ జిల్లానుంచి పాండురంగారెడ్డి వచ్చారు. ఆత్మకూర్(ఎం) ఎస్‌ఐ తుర్కపల్లికి, తుర్కపల్లి ఎస్‌ఐ వెంకటయ్య ఆత్మకూర్(ఎం)కు, యాదగిరిగుట్ట ఎస్‌ఐ రమేశ్‌ను ఆలేరుకు బదిలీ చేశారు.
నిందితులకు సహకరించారనే చర్యలు
పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారనే సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశాం. జిలెటిన్ స్టిక్, డిటోనేటర్లు, అమోనియం అక్రమ రవాణాలో నిందితులకు ముందస్తు బెయిల్‌కు సహకరించారు. ఈ కేసులో విచారణ జరుగుతోంది.
–నారాయణరెడ్డి, డీసీపీ
Comments
Please login to add a commentAdd a comment