ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు.. | Transfers Of Police Officers In Warangal Police Commissionerate | Sakshi
Sakshi News home page

పోలీసు బదిలీలు...   

Published Thu, Oct 3 2019 9:57 AM | Last Updated on Thu, Oct 3 2019 11:56 AM

Transfers Of Police Officers In Warangal Police Commissionerate - Sakshi

‘మంచి’ పోలీసుస్టేషన్‌ అనుకున్న ఠాణాలో ఒక ఇన్‌స్పెక్టర్‌ చేరాక ఎన్నిరోజులు ఉంటారనేది గ్యారంటీ లేకుండా పోయింది. కష్టంగా ఏడాది దాటిందంటే... ఎవరు ఆ సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళనతో పనిచేయాల్సిన పరిస్థితి! అన్నింటినీ అధిగమించి రెండేళ్లు దాటితే చాలు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో మరెవరో అధికారి ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. 

సాక్షి, వరంగల్‌:  బిగ్‌బాస్‌ సీజన్‌–3... అంటే ప్రస్తుతం తెలియని వారుండరు... సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక లెక్క.. శని, ఆదివారాల్లో మరో లెక్క! ఆ రెండు రోజుల్లో ఎలిమినేషన్‌ రౌండ్‌.. కనక ఎవరు మిగులుతారు, ఎవరు బయటకు వస్తారనేది బుల్లి తెర వీక్షకులను సస్పెన్స్‌లో ముంచెత్తుతోంది. ఇదంతా ఇక్కడెందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం పోలీసుశాఖలో బదిలీల పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ‘మంచి’ పోలీసుస్టేషన్‌ అనుకున్న ఠాణాలో ఒక ఇన్‌స్పెక్టర్‌ పోస్టింగ్‌ తీసుకున్న తర్వాత ఎన్నిరోజులు ఉంటారనేది గ్యారంటీ లేకుండా పోయింది.

కష్టంగా ఏడాది దాటిందంటే... ఎవరు ఆ సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళనతో పనిచేయాల్సిన పరిస్థితి! అన్నింటినీ అధిగమించి రెండేళ్లు దాటితే చాలు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో మరెవరో అధికారి ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుండడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిభకు పట్టం కట్టాల్సిన పోలీసు శాఖలో పైరవీలదే పై చేయిగా మారిందన్న చర్చ అధికారుల నడుమ సాగుతోంది. ప్రతిభ ఉన్నా సిఫారసు లేనిదే సీటు దక్కదనే భావనతో చాలామంది పొలీసు అధికారులు కాంప్రమైజ్‌ అవుతూ ‘నలుగురు నడిచిన దారి’లోనే వెళ్లక తప్పడం లేదంటున్నారు.



ఆశ నిరాశ..
కోరుకున్న చోట కొలువు దక్కించుకునేందుకు పలువురు పోలీసు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ‘మంచి ఠాణా’ అనుకునే పోలీసుస్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ సీటు కోసం ప్రయత్నాలు చేయని వారు లేరు. కానీ కొందరే ఆ ప్రయత్నాల్లో సక్సెస్‌ కాగా.. మిగతా వారికి నిరాశ ఎదురవుతోంది. శానససభ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పలువురు అధికారుల బదిలీ జరిగింది. ఇలా రెండు విడతల్లో సుమారు 14 మంది పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. కమలాపూర్‌ సీఐ బాలాజీ వరప్రసాద్‌ ఇతర జిల్లాల్లో పని చేసినప్పుడు వివాదస్పదం కాగా, కేయూసీ సీఐ రాఘవేందర్‌రావు భూవివాదంలో సస్పెండ్‌ అయ్యారు. వీరిద్దరి స్థానాల్లో రవిరాజ్, డేవిడ్‌రాజ్‌ను నియమించడం వెనుక ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. అలాగే, హన్మకొండ, ధర్మసాగర్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీ కూడా జరిగింది. తాజాగా మంగళవారం 10 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో కీలకమైన మట్టెవాడ, ఇంతెజార్‌గంజ్, మిల్స్‌కాలనీ, మామునూరు, హసన్‌పర్తి తదితర పోస్టులు భర్తీ కాగా.. ఈ స్థానాల్లో ఇప్పటికే ఉన్న కొందరు వేకెన్సీ రిజర్వు(వీఆర్‌)లోకి వెళ్లారు. ఈ బదిలీల్లోనూ ప్రజాప్రతినిధుల లేఖలు కీలకంగా పని చేశాయన్న ప్రచారం పోలీసుశాఖలో జరుగుతోంది.

ఏసీపీల పోటాపోటీ
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని కీలకమైన ఏసీపీ పోస్టుల కోసం కూడా ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఎన్నికల కోడ్‌లో భాగంగా వచ్చిన కొందరు అధికారులు తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. మరికొందరు ఏసీపీలు ఏఎస్పీలుగా పదోన్నతి పొందగా వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వీటి కోసం ఏసీపీ/డీఎస్‌పీలుగా పని చేస్తున్న కొందరితో పాటు ఇటీవలే సీఐ నుంచి డీఎస్‌పీలుగా పదోన్నతి పొందిన వారు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ఏసీపీలు నర్సయ్య, శ్రీధర్, నర్సింగరావులు ఎన్నికల కోడ్‌లో భాగంగా నియమితులు కాగా.. వారు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌ కోసం ఖమ్మం ఎస్‌బీలో పని చేస్తున్న అధికారితో పాటు కొత్తగూడెంలో ఏసీపీగా ఉన్న ఒకరు, ఏసీబీలో పని చేస్తున్న ఇంకో అధికారి పోటీ పడుతున్నట్లు తెలిసింది. హన్మకొండ స్థానం కోసం ఇక్కడే ఇన్‌స్పెక్టర్లుగా పని చేసి కొద్దినెలల తేడాతో పదోన్నతి పొందిన ఇద్దరు అ«ధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. గతంలో ధర్మసాగర్, ఆత్మకూరులో సీఐగా పని చేసి.. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పని చేస్తున్న ఏసీపీ కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలిసింది. పరకాల, నర్సంపేట ఏసీపీలు సుదీంధ్ర, సునీతమోహన్‌కు ఏఎస్పీలుగా పదోన్నతి రాగా ప్రస్తుతం ఈ రెండు స్థానాలతో పాటు కాజీపేట ఏసీపీ పోస్టింగ్‌కు కూడా తీవ్ర పోటీ నెలకొంది. అయితే వరంగల్, హన్మకొండ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వారు.. అక్కడ సాధ్యం కాని పక్షంలో ఈ మూడింటిలోనైనా ఓ స్థానం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది.

నాలుగు కీలక స్థానాల కోసం..
వరంగల్, హన్మకొండ, కాజీపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని మరో నాలుగు కీలక పోలీసుస్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓ స్థానాల కోసం పోటాపోటీగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సీఐలుగా రెండేళ్ల సర్వీస్‌ దాటిన రెండు ఠాణాలతో పాటు ఖాళీగా హన్మకొండ స్థానం కోసం రోజురోజుకు పోటీ పెరుగుతుంది. కాజీపేట ఎస్‌హెచ్‌ఓగా వచ్చేందుకు గతంలో సుబేదారి, స్టేషన్‌ఘన్‌పూర్‌ల్లో పని చేసి ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న ఓ సీఐ జోరుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న ఇద్దరు సీఐలతో పాటు కమలాపూర్‌లో సీఐగా పని చేసిన ఒకరు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. సుబేదారి ఠాణా కోసం కాజీపేట సీఐగా పని చేసిన ఒకరు, వీఆర్‌లో ఉన్న ఓ సీఐ, షీ టీమ్స్‌లో మరో సీఐ లైన్‌లో ఉన్నట్లు తెలిసింది. హన్మకొండ సీఐ బోనాల కిషన్‌కు ఏసీపీగా పదోన్నతి రాగా.. ఆయన స్థానంలో గతంలో మిల్స్‌కాలనీ సీఐగా పని చేసి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఒకరితో పాటు, ఇటీవల హసన్‌పర్తి సీఐగా పని చేసిన మరొకరు పోటీ పడుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పరకాల అధికారికి కూడా స్థానచలనం తప్పదన్న ప్రచారంతో అక్కడ కూడా దస్తీ వేసే పనిలో పలువురు ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement