warangal urban district
-
మాట్లాడే అవకాశం ఇవ్వరా?
సాక్షిప్రతినిధి, వరంగల్/కమలాపూర్: తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభలో ఓ మహిళా ఎంపీపీ ఆందోళన చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో శనివారం జరిగింది. కమలాపూర్ మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు రూ.29.51 లక్షల విలువ గల వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనకందిన సమాచారం మేరకు స్థానిక ఎంపీపీ రాణి సభ మధ్యలో వచ్చారు. మంత్రి ప్రసంగం అనంతరం మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని, తనకు జరిగిన అన్యాయం చెప్పుకుంటానని కోరారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం మంత్రి మాట్లాడిన తర్వాత ఎవరూ మాట్లాడటానికి ఉండదని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో సభా వేదికపైనే తనకు మాట్లాడే అవకాశం ఎందుకివ్వరంటూ నిలదీశారు. వెంటనే ఆమెను వేదికపై నుంచి కిందకు పంపించేశారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. శనిగరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నిగ్గుల వేణు వాట్సాప్, ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని, శనివారం తమ ఇంటి ముందు బైక్ ఆపి ఈలలు వేస్తూ, సైగలు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలతో తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహిళలతో కలసి హుజూరాబాద్– పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. -
వరంగల్ జిల్లాల పేర్ల మార్పుపై గెజిట్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లను మార్చడానికి ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్‌గా మార్పు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. 30 రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలను సంబంధిత కలెక్టర్లకు లిఖిత పూర్వకంగా అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆర్ఎంపీ తెలిసీ తెలియని వైద్యం, యువకుడు మృతి
కమలాపూర్: అనుమతి లేకుండా ఓ ఆర్ఎంపీ చేసిన వైద్యానికి యువకుడు బలయ్యాడు. కరోనా పాజిటివ్ అని తెలిసి కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసిన వైద్యం ఆ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లికి చెందిన ఓ యువకుడు (20) సుమారు 10 రోజులు జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతూ గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. దీంతో ఆ ఆర్ఎంపీ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి యువకుడిని తరలించగా అక్కడ కరోనా పాజిటివ్ అని తేలడంతో రెండు రోజుల పాటు చికిత్స చేశారు. ఆ తర్వాత యువకుడు మళ్లీ గ్రామానికి రాగా, కరోనా విషయాన్ని దాచిన ఆర్ఎంపీ మరో మూడు రోజులు వైద్యం చేశాడు. ఇంతలోనే యువకుడి పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళితే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఆ తర్వాత యువకుడిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరి్పంచగా అక్కడ చికిత్స పొందుతూ గత నెల 27న ఆ యువకుడు మృతి చెందాడు. కరోనా పాజిటివ్ అని తేలాక కూడా ఎవరికీ చెప్పకుండా వైద్యం చేసిన ఆర్ఎంపీ వైద్యుడు, వరంగల్‌లో వైద్యం అందించిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు గత నెల 31న జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు. (చదవండి: పిందెలు తెంపారని.. పేడ తినిపించారు! ) -
దీపను డొంకన పడేశాడు
డొంకలాంటి ఈ ప్రాంతంలో మూడేళ్ల కుమారుడితో ఇంటి సామాను ముందు కూర్చున్న ఈమె పేరు దీప. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఓంకార్‌తో 2013లో వివాహమైంది. కొన్నాళ్లు.. కట్నంగా ఇచ్చిన భూమి తన పేరున రాసివ్వలేదని.. మరికొన్నాళ్లు అనుమానంతోనూ వేధించేవాడు. ఒకసారి ఈ వేధింపులపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం దీప రెండు నెలల గర్భిణి. ఈ క్రమంలో ఈ నెల 3న ఓంకార్ తాగొచ్చి కత్తితో బెదిరించాడు. సర్దిచెప్పడానికి వచ్చిన ఆమె తండ్రి, సోదరుడిపై చెప్పుతో దాడిచేశాడు. అంతేగాకుండా శనివారం ఇంట్లోని సామానంతా కట్నంగా రాసిచ్చిన భూమిలో పడేసి వెళ్లిపోయాడని, అందుకే అక్కడే కూర్చుని న్యాయం కోసం ఆందోళనకు దిగినట్టు దీప వివరించింది. కాగా, పోలీసులు దంపతులిద్దరినీ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.(చదవండి: తనిఖీలు చేస్తున్నారని భార్యను వదిలేసి భర్త పరార్) – కమలాపూర్ -
వరంగల్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, వరంగల్ అర్బన్: జిల్లాలోని హన్మకొండ చౌరస్తాలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చౌరస్తాలోని ఓ పూలదుకాణంలో మంటలు అంటుకొని దాదాపు ఆరు పూలదుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని.. పూల దుకాణాలకు పక్కనున్న ఏటీయం సెంటర్, వ్యాపార సముదాయలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే లోపు మంటలపై నీటిని పోస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దగ్ధమైన దుకాణాల విలువ, మంటలు చెలరేగడానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. -
ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు..
‘మంచి’ పోలీసుస్టేషన్ అనుకున్న ఠాణాలో ఒక ఇన్స్పెక్టర్ చేరాక ఎన్నిరోజులు ఉంటారనేది గ్యారంటీ లేకుండా పోయింది. కష్టంగా ఏడాది దాటిందంటే... ఎవరు ఆ సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళనతో పనిచేయాల్సిన పరిస్థితి! అన్నింటినీ అధిగమించి రెండేళ్లు దాటితే చాలు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో మరెవరో అధికారి ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. సాక్షి, వరంగల్: బిగ్‌బాస్ సీజన్–3... అంటే ప్రస్తుతం తెలియని వారుండరు... సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక లెక్క.. శని, ఆదివారాల్లో మరో లెక్క! ఆ రెండు రోజుల్లో ఎలిమినేషన్ రౌండ్.. కనక ఎవరు మిగులుతారు, ఎవరు బయటకు వస్తారనేది బుల్లి తెర వీక్షకులను సస్పెన్స్‌లో ముంచెత్తుతోంది. ఇదంతా ఇక్కడెందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం పోలీసుశాఖలో బదిలీల పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ‘మంచి’ పోలీసుస్టేషన్ అనుకున్న ఠాణాలో ఒక ఇన్స్పెక్టర్ పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఎన్నిరోజులు ఉంటారనేది గ్యారంటీ లేకుండా పోయింది. కష్టంగా ఏడాది దాటిందంటే... ఎవరు ఆ సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళనతో పనిచేయాల్సిన పరిస్థితి! అన్నింటినీ అధిగమించి రెండేళ్లు దాటితే చాలు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో మరెవరో అధికారి ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుండడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిభకు పట్టం కట్టాల్సిన పోలీసు శాఖలో పైరవీలదే పై చేయిగా మారిందన్న చర్చ అధికారుల నడుమ సాగుతోంది. ప్రతిభ ఉన్నా సిఫారసు లేనిదే సీటు దక్కదనే భావనతో చాలామంది పొలీసు అధికారులు కాంప్రమైజ్ అవుతూ ‘నలుగురు నడిచిన దారి’లోనే వెళ్లక తప్పడం లేదంటున్నారు. ఆశ నిరాశ.. కోరుకున్న చోట కొలువు దక్కించుకునేందుకు పలువురు పోలీసు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ‘మంచి ఠాణా’ అనుకునే పోలీసుస్టేషన్లో ఎస్హెచ్ఓ సీటు కోసం ప్రయత్నాలు చేయని వారు లేరు. కానీ కొందరే ఆ ప్రయత్నాల్లో సక్సెస్ కాగా.. మిగతా వారికి నిరాశ ఎదురవుతోంది. శానససభ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పలువురు అధికారుల బదిలీ జరిగింది. ఇలా రెండు విడతల్లో సుమారు 14 మంది పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. కమలాపూర్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఇతర జిల్లాల్లో పని చేసినప్పుడు వివాదస్పదం కాగా, కేయూసీ సీఐ రాఘవేందర్రావు భూవివాదంలో సస్పెండ్ అయ్యారు. వీరిద్దరి స్థానాల్లో రవిరాజ్, డేవిడ్‌రాజ్‌ను నియమించడం వెనుక ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. అలాగే, హన్మకొండ, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ల బదిలీ కూడా జరిగింది. తాజాగా మంగళవారం 10 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో కీలకమైన మట్టెవాడ, ఇంతెజార్గంజ్, మిల్స్‌కాలనీ, మామునూరు, హసన్‌పర్తి తదితర పోస్టులు భర్తీ కాగా.. ఈ స్థానాల్లో ఇప్పటికే ఉన్న కొందరు వేకెన్సీ రిజర్వు(వీఆర్)లోకి వెళ్లారు. ఈ బదిలీల్లోనూ ప్రజాప్రతినిధుల లేఖలు కీలకంగా పని చేశాయన్న ప్రచారం పోలీసుశాఖలో జరుగుతోంది. ఏసీపీల పోటాపోటీ వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కీలకమైన ఏసీపీ పోస్టుల కోసం కూడా ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఎన్నికల కోడ్‌లో భాగంగా వచ్చిన కొందరు అధికారులు తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. మరికొందరు ఏసీపీలు ఏఎస్పీలుగా పదోన్నతి పొందగా వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వీటి కోసం ఏసీపీ/డీఎస్పీలుగా పని చేస్తున్న కొందరితో పాటు ఇటీవలే సీఐ నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన వారు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ఏసీపీలు నర్సయ్య, శ్రీధర్, నర్సింగరావులు ఎన్నికల కోడ్‌లో భాగంగా నియమితులు కాగా.. వారు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కోసం ఖమ్మం ఎస్బీలో పని చేస్తున్న అధికారితో పాటు కొత్తగూడెంలో ఏసీపీగా ఉన్న ఒకరు, ఏసీబీలో పని చేస్తున్న ఇంకో అధికారి పోటీ పడుతున్నట్లు తెలిసింది. హన్మకొండ స్థానం కోసం ఇక్కడే ఇన్స్పెక్టర్లుగా పని చేసి కొద్దినెలల తేడాతో పదోన్నతి పొందిన ఇద్దరు అ«ధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. గతంలో ధర్మసాగర్, ఆత్మకూరులో సీఐగా పని చేసి.. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పని చేస్తున్న ఏసీపీ కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలిసింది. పరకాల, నర్సంపేట ఏసీపీలు సుదీంధ్ర, సునీతమోహన్కు ఏఎస్పీలుగా పదోన్నతి రాగా ప్రస్తుతం ఈ రెండు స్థానాలతో పాటు కాజీపేట ఏసీపీ పోస్టింగ్‌కు కూడా తీవ్ర పోటీ నెలకొంది. అయితే వరంగల్, హన్మకొండ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వారు.. అక్కడ సాధ్యం కాని పక్షంలో ఈ మూడింటిలోనైనా ఓ స్థానం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. నాలుగు కీలక స్థానాల కోసం.. వరంగల్, హన్మకొండ, కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని మరో నాలుగు కీలక పోలీసుస్టేషన్లలో ఎస్హెచ్ఓ స్థానాల కోసం పోటాపోటీగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సీఐలుగా రెండేళ్ల సర్వీస్ దాటిన రెండు ఠాణాలతో పాటు ఖాళీగా హన్మకొండ స్థానం కోసం రోజురోజుకు పోటీ పెరుగుతుంది. కాజీపేట ఎస్హెచ్ఓగా వచ్చేందుకు గతంలో సుబేదారి, స్టేషన్ఘన్పూర్ల్లో పని చేసి ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న ఓ సీఐ జోరుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న ఇద్దరు సీఐలతో పాటు కమలాపూర్‌లో సీఐగా పని చేసిన ఒకరు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. సుబేదారి ఠాణా కోసం కాజీపేట సీఐగా పని చేసిన ఒకరు, వీఆర్‌లో ఉన్న ఓ సీఐ, షీ టీమ్స్‌లో మరో సీఐ లైన్లో ఉన్నట్లు తెలిసింది. హన్మకొండ సీఐ బోనాల కిషన్‌కు ఏసీపీగా పదోన్నతి రాగా.. ఆయన స్థానంలో గతంలో మిల్స్‌కాలనీ సీఐగా పని చేసి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఒకరితో పాటు, ఇటీవల హసన్‌పర్తి సీఐగా పని చేసిన మరొకరు పోటీ పడుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పరకాల అధికారికి కూడా స్థానచలనం తప్పదన్న ప్రచారంతో అక్కడ కూడా దస్తీ వేసే పనిలో పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. -
వరంగల్ స్టేషన్: గాంధీజీ నడియాడిన నేల
సాక్షి, వరంగల్: అది మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నడియాడిన నేల. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేసిన జాతిపిత గాంధీ వచ్చిన ఆ స్థలంలో స్వాతంత్య్రం వచ్చాక స్థానికులు బాపూజీ యూత్ అసోసియేషన్ పేరిట భవనాన్ని నిర్మించారు. వ్యాయమశాలగా అప్పట్లో యువకులు ఉపయోగించుకోగా.. ఇప్పుడు యూత్ భవనంగా పలు కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమం సాగుతున్న సమయంలో గాంధీజీ మద్రాస్ నుంచి రైలులో వార్థాకు వెళ్తున్నారు. ఎలాగైనా గాంధీజీని వరంగల్ రైల్వేస్టేషన్లో ఆపి.. బహిరంగ సభలో మాట్లాడించాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమరయోధుడు భండారు చంద్రమౌళీశ్వర్ రావు అభ్యర్థన మేరకు గాంధీజీ 1946 ఫిబ్రవరి 5న వరంగల్ రైల్వే స్టేషన్లో ఆగారు. ప్రస్తుతం బాపూజీ యూత్ భవనం నిర్మించిన స్థలానికి వచ్చి మాట్లాడాక ఆజంజాహి మిల్లు గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత స్వాతంత్య్రం రావడంతో స్టేషన్ రోడ్డులోని స్థలంలో గూడూరు చెన్న స్వామి, తాళ్ల గురుపాదం, నర్సింగరావు, ముత్యాలు తదితరులు బాపూజీ యూత్ పేరిట భవనాన్ని నిర్మించి బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరడంతో పదిహేనేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, కార్పొరేటర్ జారతి రమేష్ నిధులు కేటాయించగా రెండంతస్తుల భవనం నిర్మాణమైంది. ఈ మేరకు యూత్‌లో సుమారు 20 మంది వరకు సభ్యులు ఉండగా ఏటా గాంధీ జయంతి, వర్ధంతి స్వాతంత్య్ర దినోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తాం మా కాలనీ పెద్దలు బాపూజీ పేరిట భవనాన్ని నిర్మించారు. బాల్యదశలో ఇక్కడ వ్యాయామం చేసేవాళ్లం. కొన్ని దశాబ్దాలుగా గాంధీ జయంతి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్నాం. వినాయక ప్రతిమను ప్రతిష్ఠిస్తున్నాం. వివిధ కార్యక్రమాలకు భవనం ఎంతగానో ఉపయోగపడుతోంది. – గూడూరు సత్యానంద్, బాపూజీ యూత్ సభ్యుడు -
వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. సంపర్క్ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. సాక్షి, న్యూశాయంపేట: దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన సంపర్క్ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా హన్మకొండ రాంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సంపర్క్ అభియాన్, జనజాగరణ సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలో వచ్చిన వందరోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజామోదం లభించిందని చెప్పారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఇందులో వేరే దేశం జోక్యాన్ని సహించేది లేదన్నారు. కశ్మీర్‌తో పాటు, దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ రాబోయే రోజుల్లో అధికారంలో వస్తుందని, రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలచుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని, కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం కేంద్రమంత్రికి మెమోరండం సమర్పించింది. సంపర్క్ అభియాన్ భాగంగా కాకతీయ మాజీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ వంగాల గోపాల్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, ప్రముఖ కవి రచయిత ప్రొఫెసర్ రామాచంద్రమౌళిలను కలుసుకున్నారు. సభలో రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ అర్బన్, రూరల్‌జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు డాక్టర్ విజయలక్ష్మి, రావుల కిషన్, మల్లాది తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలి చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాలో ఉన్న నిరుద్యోగుల కోసం భారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి కేంద్ర మంత్రిని కోరారు. గతంలో ఉన్న ఆజంజాహి మిల్లు మూత పడడంతో వేలాది మందికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఆసియాలోనే పెద్ద మార్కెట్ ఉన్న వరంగల్‌లో స్పైసెస్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని, ఉన్న స్పైసెస్ బోర్డును తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సాధుల దామోదర్, తోట నర్సింహరావు, కొత్త కిషోర్‌కుమార్, సారయ్య, గౌరిశెట్టి శ్రీనివాస్, రాజు, దేశబత్తుల రమేష్, పోతుకుమారస్వామి, బిజెపీ నాయకులు రావు పద్మారెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు, వన్నాల శ్రీరాములు, వంగాల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనకు మద్దతుగా నిలవాలి వరంగల్: దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ పాలనకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. వరంగల్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సోమవారం వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అర్టికల్ 371ను రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాలపై ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సంపర్క్ అభియాన్, జనజాగరణ్ కార్యక్రమాలు నిర్విహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా వరంగల్ పట్టణంలో మేధావులను, కవులను, వ్యాపార, వాణిజ్య వర్గాలను కలుసుకున్నామని చెప్పారు. -
వరంగల్ అర్బన్ సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ కాట ఆమ్రపాలి ఫోన్: 9704560800 పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు ఫోన్: 9491089100 ఇతర ముఖ్య అధికారులు: జేసీ: డి.దయానంద్ (9849904285) డీఆర్వో: కె.శోభ (9704560803) ఆర్డీవో: వెంకట మాధవరావు (7680906650) డీఈవో: కె.సత్యనారాయణ డీఎంహెచ్‌వో: సాంబశివరావు (9849902514) ఐసీడీఎస్ అధికారి: శైలజ (9440814433) మండలాలు: 11 వరంగల్, ఖిలావరంగల్, హన్మకొండ, కాజీపేట, హసన్‌పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ రెవెన్యూ డివిజన్లు 1 (వరంగల్ అర్బన్) కార్పొరేషన్ 1: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ పంచాయతీలు: 45 భారీ పరిశ్రమలు: లేవు ప్రాజెక్టులు: ఎస్సారెస్పీ కాలువ, దేవాదుల పైప్‌లైను ఎంపీలు: పసునూరి దయాకర్(వరంగల్), బి.వినోద్‌కుమార్(కరీంనగర్) ఎమ్మెల్యేలు: దాస్యం వినయ్‌భాస్కర్(వరంగల్ పశ్చిమ), కొండా సురేఖ(వరంగల్ తూర్పు), అరూరి రమేశ్(వర్ధన్నపేట), వి.సతీశ్‌కుమార్ (హుస్నాబాద్), టి.రాజయ్య(స్టేçÙన్‌ఘన్‌పూర్), ఈటల రాజేందర్(హుజూరాబాద్) పర్యాటకం: కాకతీయుల కోట(ఖిలా వరంగల్), వెయ్యి స్తంభాల గుడి(రుద్రేశ్వర ఆలయం), భద్రకాళి ఆలయం, మల్లికార్జున ఆలయం(ఐనవోలు) జాతీయ రహదారులు: 163 (హైదరాబాద్–భూపాలపట్నం) రైల్వే లైన్లు: ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే కాజీపేట జంక్షన్, విజయవాడ–కాజీపేట–హైదరాబాద్, విజయవాడ–కాజీపేట–ఢిల్లీ లైన్లు హైదరాబాద్ నుంచి దూరం: 135 కి .మీ. ఖనిజాలు: రాతి గుట్టలు