Warangal Police Commissionerate
-
పుష్పారెడ్డికి నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైమ్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీగా, ట్రాపిక్, అడ్మిన్ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేస్తున్న కర్రి పుష్పారెడ్డికి శుక్రవారం ప్రభుత్వం నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించింది. 2012 గ్రూప్–1 బ్యాచ్‌కి చెందిన పుష్పారెడ్డి 2014 నుంచి హైదరాబాద్ సీఐడీ, సైబర్ క్రైమ్ డీఎస్పీగా, 2018లో కల్వకుర్తి డీఎస్పీగా, 2019 నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైమ్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు. 2020లో సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేశారు. ఈ మేరకు పుష్పారెడ్డికి సీపీ రంగనాథ్‌తోపాటు పలువురు పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. -
వరుస సస్పెన్షన్లు.. తర్వాత ఎవరు?!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆరు నెలల కాలంలో శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిపై తీసుకున్న చర్చలు చర్చనీయాంశంగా మారాయి. పోలీసు కమిషనర్‌గా పి.ప్రమోద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించాక శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. భూసెటిల్మెంట్లు, దందాల్లో జోక్యం చేసుకుంటున్న కొందరు అధికారులపై ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ అనంతరం అనివార్యమని తేలిన పలువురిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే పలువురు సీఐలు, ఎస్ఐలపై సస్పెన్షన్, బదిలీల వేటు వేస్తుండగా, ఓ డీసీపీ, ఏసీపీల బదిలీ జరిగింది. అయితే, ఆ తర్వాత వరుసలో ఎవరనే చర్చ పోలీసువర్గాల్లో సాగుతోంది. కేయూసీ ఇన్స్పెక్టర్పై వేటు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్న అధికారులపై వరుస చర్యలు పోలీసుశాఖలో హాట్‌టాపిక్‌గా మారగా, సోమవారం మరొకరిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేయడం గమనార్హం. కాకతీయ యూనివర్సిటీ పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ డేవిడ్ రాజును ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ ప్రమోద్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ముగ్గురు ఎస్హెచ్ఓలు, నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఆరుగురు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్ల సస్పెన్షన్ వేటు పడింది. అలాగే, ముగ్గురిని క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేశారు. హన్మకొండ ఏసీపీ కార్యాలయంలో పరిధిలో హన్మకొండ, సుబేదారి, కాజీపేట ఏసీపీ కార్యాలయం పరిధిలో కమలాపూర్ ఎస్హెచ్ఓ సస్పెండైన వారిలో ఉండగా, వరంగల్, కాజీపేట కార్యాలయాల పరిధిలో మామూనూరు, ధర్మసాగర్ ఎస్హెచ్ఓలను వీఆర్‌కు అటాచ్డ్ అయ్యారు. తాజాగా హన్మకొండ ఏసీపీ కార్యాలయంలో పరిధిలోని కేయూ పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ డేవిడ్ రాజును హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.(చదవండి: సొంత శాఖలో అక్రమార్కులపై పోలీసు కథాస్త్రం!) కేయూసీలో ఘటనపై ఆరా కాకతీయ యూనివర్సిటీలో ఆదివారం చోటుచేసుకున్న గొడవ అటు ప్రజాప్రతినిధులు, ఇటు పోలీసు ఉన్నతాధికారుల్లో చర్చకు దారి తీసినట్లు సమాచారం. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ వినయ్‌భాస్కర్ కాన్వాయిని ఏబీవీపీ సభ్యులు అడ్డుకోవడం.. ఆ తర్వాత ఉద్రిక్తతకు దారితీసిన పరిణామాలను సీరియస్‌గా తీసుకున్నట్లు చెబున్నారు. ఈ సందర్భంగా పరిస్థితిని ముందుగా అంచనా వేయడంలో నిఘావర్గాలు కూడా వైఫల్యం చెందాయనే చర్చ సాగుతోంది. ఇదే విషయమై ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేయూ ఘటనపై హైదరాబాద్ నుంచి సైతం కీలక నేతలు, పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయగా, ఇది చినికిచినికి గాలివానగా మారిందని తెలుస్తోంది. -
పోలీసుల అదుపులో ఇద్దరు న్యూడెమోక్రసీ నేతలు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీకి చెందిన ఇద్దరు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కమిటీ సభ్యుడు, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సోమ భాస్కర్ అలియాస్ సూర్యం, జిల్లా కమిటీ సభ్యుడు బూర్క ప్రతాప్ అలియాస్ శ్యాంలను సోమవారం అర్ధరాత్రి వరంగల్ రూరల్ జిల్లా అసరవెల్లి, మేడిపల్లి గ్రామాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిసింది. సూర్యం దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన వ్యక్తి కాగా, శ్యాం కొత్తగూడ మండలం గంజేడు వాసి. సూర్యం సుమారు రెండు దశాబ్దాలుగా వామపక్ష ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల న్యూడెమోక్రసీ పార్టీలో, పార్టీ నాయకులకు దళాల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇద్దరు కీలక నేతలు పోలీసుల అదుపులోకి చేరడం చర్చనీయాంశంగా మారింది. సూర్యం, శ్యాంలను అసరవెల్లి, మేడిపల్లి సరిహద్దులో ఓ ఇంట్లో సేద తీరుతుండగా పోలీసులు అరెస్టు చేశారని ఆ పార్టీ నాయకులు చెబుతుండగా.. వారిద్దరు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారన్న ప్రచారం ఉంది. అయితే ఈ విషయమై పోలీసులు మాత్రం మంగళవారం సాయంత్రం వరకు ్ర«ధుృవీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలు పోలీసులకు చిక్కారా..? లేక లొంగిపోయారా..? అన్న చర్చ జరుగుతోంది. సూర్యం, శ్యాంను కోర్టులో హాజరుపర్చాలి సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సూర్యం, శ్యాంలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపర్చాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వీరిద్దరిని రహస్యంగా ఉంచటం అనేక అనుమానాలు కలిగిస్తుందని తెలిపారు. -
ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు..
‘మంచి’ పోలీసుస్టేషన్ అనుకున్న ఠాణాలో ఒక ఇన్స్పెక్టర్ చేరాక ఎన్నిరోజులు ఉంటారనేది గ్యారంటీ లేకుండా పోయింది. కష్టంగా ఏడాది దాటిందంటే... ఎవరు ఆ సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళనతో పనిచేయాల్సిన పరిస్థితి! అన్నింటినీ అధిగమించి రెండేళ్లు దాటితే చాలు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో మరెవరో అధికారి ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. సాక్షి, వరంగల్: బిగ్‌బాస్ సీజన్–3... అంటే ప్రస్తుతం తెలియని వారుండరు... సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక లెక్క.. శని, ఆదివారాల్లో మరో లెక్క! ఆ రెండు రోజుల్లో ఎలిమినేషన్ రౌండ్.. కనక ఎవరు మిగులుతారు, ఎవరు బయటకు వస్తారనేది బుల్లి తెర వీక్షకులను సస్పెన్స్‌లో ముంచెత్తుతోంది. ఇదంతా ఇక్కడెందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం పోలీసుశాఖలో బదిలీల పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ‘మంచి’ పోలీసుస్టేషన్ అనుకున్న ఠాణాలో ఒక ఇన్స్పెక్టర్ పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఎన్నిరోజులు ఉంటారనేది గ్యారంటీ లేకుండా పోయింది. కష్టంగా ఏడాది దాటిందంటే... ఎవరు ఆ సీటుకు ఎసరు పెడతారోనన్న ఆందోళనతో పనిచేయాల్సిన పరిస్థితి! అన్నింటినీ అధిగమించి రెండేళ్లు దాటితే చాలు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో మరెవరో అధికారి ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుండడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిభకు పట్టం కట్టాల్సిన పోలీసు శాఖలో పైరవీలదే పై చేయిగా మారిందన్న చర్చ అధికారుల నడుమ సాగుతోంది. ప్రతిభ ఉన్నా సిఫారసు లేనిదే సీటు దక్కదనే భావనతో చాలామంది పొలీసు అధికారులు కాంప్రమైజ్ అవుతూ ‘నలుగురు నడిచిన దారి’లోనే వెళ్లక తప్పడం లేదంటున్నారు. ఆశ నిరాశ.. కోరుకున్న చోట కొలువు దక్కించుకునేందుకు పలువురు పోలీసు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ‘మంచి ఠాణా’ అనుకునే పోలీసుస్టేషన్లో ఎస్హెచ్ఓ సీటు కోసం ప్రయత్నాలు చేయని వారు లేరు. కానీ కొందరే ఆ ప్రయత్నాల్లో సక్సెస్ కాగా.. మిగతా వారికి నిరాశ ఎదురవుతోంది. శానససభ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పలువురు అధికారుల బదిలీ జరిగింది. ఇలా రెండు విడతల్లో సుమారు 14 మంది పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. కమలాపూర్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఇతర జిల్లాల్లో పని చేసినప్పుడు వివాదస్పదం కాగా, కేయూసీ సీఐ రాఘవేందర్రావు భూవివాదంలో సస్పెండ్ అయ్యారు. వీరిద్దరి స్థానాల్లో రవిరాజ్, డేవిడ్‌రాజ్‌ను నియమించడం వెనుక ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. అలాగే, హన్మకొండ, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ల బదిలీ కూడా జరిగింది. తాజాగా మంగళవారం 10 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో కీలకమైన మట్టెవాడ, ఇంతెజార్గంజ్, మిల్స్‌కాలనీ, మామునూరు, హసన్‌పర్తి తదితర పోస్టులు భర్తీ కాగా.. ఈ స్థానాల్లో ఇప్పటికే ఉన్న కొందరు వేకెన్సీ రిజర్వు(వీఆర్)లోకి వెళ్లారు. ఈ బదిలీల్లోనూ ప్రజాప్రతినిధుల లేఖలు కీలకంగా పని చేశాయన్న ప్రచారం పోలీసుశాఖలో జరుగుతోంది. ఏసీపీల పోటాపోటీ వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కీలకమైన ఏసీపీ పోస్టుల కోసం కూడా ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఎన్నికల కోడ్‌లో భాగంగా వచ్చిన కొందరు అధికారులు తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. మరికొందరు ఏసీపీలు ఏఎస్పీలుగా పదోన్నతి పొందగా వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వీటి కోసం ఏసీపీ/డీఎస్పీలుగా పని చేస్తున్న కొందరితో పాటు ఇటీవలే సీఐ నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన వారు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ఏసీపీలు నర్సయ్య, శ్రీధర్, నర్సింగరావులు ఎన్నికల కోడ్‌లో భాగంగా నియమితులు కాగా.. వారు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ కోసం ఖమ్మం ఎస్బీలో పని చేస్తున్న అధికారితో పాటు కొత్తగూడెంలో ఏసీపీగా ఉన్న ఒకరు, ఏసీబీలో పని చేస్తున్న ఇంకో అధికారి పోటీ పడుతున్నట్లు తెలిసింది. హన్మకొండ స్థానం కోసం ఇక్కడే ఇన్స్పెక్టర్లుగా పని చేసి కొద్దినెలల తేడాతో పదోన్నతి పొందిన ఇద్దరు అ«ధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. గతంలో ధర్మసాగర్, ఆత్మకూరులో సీఐగా పని చేసి.. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పని చేస్తున్న ఏసీపీ కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలిసింది. పరకాల, నర్సంపేట ఏసీపీలు సుదీంధ్ర, సునీతమోహన్కు ఏఎస్పీలుగా పదోన్నతి రాగా ప్రస్తుతం ఈ రెండు స్థానాలతో పాటు కాజీపేట ఏసీపీ పోస్టింగ్‌కు కూడా తీవ్ర పోటీ నెలకొంది. అయితే వరంగల్, హన్మకొండ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వారు.. అక్కడ సాధ్యం కాని పక్షంలో ఈ మూడింటిలోనైనా ఓ స్థానం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. నాలుగు కీలక స్థానాల కోసం.. వరంగల్, హన్మకొండ, కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని మరో నాలుగు కీలక పోలీసుస్టేషన్లలో ఎస్హెచ్ఓ స్థానాల కోసం పోటాపోటీగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సీఐలుగా రెండేళ్ల సర్వీస్ దాటిన రెండు ఠాణాలతో పాటు ఖాళీగా హన్మకొండ స్థానం కోసం రోజురోజుకు పోటీ పెరుగుతుంది. కాజీపేట ఎస్హెచ్ఓగా వచ్చేందుకు గతంలో సుబేదారి, స్టేషన్ఘన్పూర్ల్లో పని చేసి ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న ఓ సీఐ జోరుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న ఇద్దరు సీఐలతో పాటు కమలాపూర్‌లో సీఐగా పని చేసిన ఒకరు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. సుబేదారి ఠాణా కోసం కాజీపేట సీఐగా పని చేసిన ఒకరు, వీఆర్‌లో ఉన్న ఓ సీఐ, షీ టీమ్స్‌లో మరో సీఐ లైన్లో ఉన్నట్లు తెలిసింది. హన్మకొండ సీఐ బోనాల కిషన్‌కు ఏసీపీగా పదోన్నతి రాగా.. ఆయన స్థానంలో గతంలో మిల్స్‌కాలనీ సీఐగా పని చేసి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఒకరితో పాటు, ఇటీవల హసన్‌పర్తి సీఐగా పని చేసిన మరొకరు పోటీ పడుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పరకాల అధికారికి కూడా స్థానచలనం తప్పదన్న ప్రచారంతో అక్కడ కూడా దస్తీ వేసే పనిలో పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
సాక్షి, వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. కమిషనరేట్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. అంతర్రాష్ట్ర పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.5 లక్షల విలువైన 135 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి అభరణాలు, నాలుగు సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాష్త్రం వీదిషా జిల్లా, గులాంగంజ్ మండలం వన్ గ్రామానికి చెందిన పెంటియ పార్థీ, రాజేష్ మెంగియా అలియాస్ రాజుతో పాటు మరో బాల నేరుస్తుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇక రాజేంద్రసింగ్, చంగిరాంలు పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు. ముగ్గురు నిందితులు ఒకే కులానికి చెందినవారని, ఎలాంటి వృత్తి లేకపోవడంతో దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారని ఆయన తెలిపారు. వీరితో పాటు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులతో కలిసి ఎనిమిదేళ్లుగా మధ్యప్రదేశ్, మహారాష్త్ర, నాగపూర్ ప్రాంతాలలో బెలూన్లు అమ్ముకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఇక దొంగలించిన డబ్బులతో జల్సాలకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో... పరారీలో ఉన్న నిందితులు రాజేంద్రసింగ్మోంగియా, చంగిరాంలతో కలిసి ఈ యేడాది మే, జూన్‌లో మట్టెవాడ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. గౌతమినగర్‌లో 30 గ్రాముల బంగారం, శ్రీనివాసకాలనీలో 400 గ్రాముల బంగారం అభరణాలు చోరీ అయినట్లు ఆయన పేర్కొన్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవిరాజా, మట్టెవాడ ఇన్స్పెక్టర్ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద డబ్బు ఖర్చు కావడం, మళ్లీ డబ్బు అవసరం ఉండి చోరీ సోత్తును కొనుగోలు చేసే వ్యాపారి నారాయణ సోనికి అప్పగించేందుకు వరంగల్ బులియన్ మారెట్‌కు రాగా సమాచారం తెలిసిన ఇన్స్పెక్టర్లు రవిరాజ్, జీవన్‌రెడ్డిలు ఆధ్వర్యాన అరెస్టు చేసినట్లు సీపీ చెప్పారు. అధికారులకు అభినందనలు నిందితులను అరెస్టు చేయడంతో పాటు చోరీ సొమ్మును రికవరీ చేయడంలో ప్రతిభ కనపరిచిన ఉద్యోగులను సీపీ అభినందించారు. ఈ మేరకు సీసీఎస్ ఏసీపీ బాబురావు, వరంగల్ ఏసీపీ నర్సయ్య, ఇన్స్పెక్టర్లు రవిరాజ్, జీవన్‌రెడ్డి, ఎల్.రమేష్‌కుమార్, మట్టెవాడ ఎస్సై వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఏఎస్సై వీరస్వామి, హె డ్ కానిస్టేబుళ్లు, ఇనాయత్ఆలీ, జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, విజయ్‌కాంత్, మీర్ మహమ్మద్ అలీ, ఐటీ కోర్ అనాలాటికల్ అసిస్టెంట్ సల్మాన్ కానిస్టేబుల్ శ్రవణ్‌ను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. -
అసలు పనిపై నిర్లక్ష్యం
అంతా ప్రత్యేక పనుల్లోనే నిమగ్నం నేరాల నియంత్రణపై అశ్రద్ధ ఇంకా దొరకని గొలుసు దొంగలు ఖాళీగానే క్రైం ఏసీపీ పోస్టు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఫ్రెండ్లీ పోలీసు నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలనేది లక్ష్యం. కొందరు అధికారులు మాత్రం నేరాల నియంత్రణలోనూ దీన్నే అనుసరిస్తున్నారు. ఫలితంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు ఆగడం లేదు. అనుభవజ్ఞులైన అధికారులు ఎక్కువ మంది ఉన్నా కొన్ని కేసులను ఛేదించడం లేదు. వరంగల్ నగరంలో ఒకే రోజు రెండు చోట్ల చైన్ స్నాచింగ్(గొలుసు దొంగతనాలు) జరిగి రెండు వారాలు గడుస్తున్నా దొంగలను ఇప్పటికీ పట్టుకోలేదు. నగర ప్రజలను ఎక్కువగా ఆందోళనకు గురిచేసే చైన్ స్నాచింగ్‌ల నియంత్రణ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పోలీసుల విధుల్లో కీలకమైన నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పర్యవేక్షణ తగ్గడం వల్లే ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీస్ కమిషనరేట్‌లోని అధికారులు, సిబ్బంది అంతా ఇప్పుడు ప్రత్యేకమైన పనుల్లో నిమగ్నమయ్యారని ఆ శాఖలోనే చర్చించుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ పోలీస్ సెకండ్ గేమ్స్, స్పోర్ట్స్ –2017 కార్యక్రమం మార్చి 3 నుంచి 7 వరకు వరంగల్‌లో జరగనుంది. ఏసీసీ స్థాయి నుంచి ఎస్సైల వరకు అందరు ఈ స్పోర్ట్స్ నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నగరంలోని వ్యాపారవేత్తలను, ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నారని పోలీసు శాఖలోనే చర్చ జరుగుతోంది. పోలీసు శాఖ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ ఏర్పాట్లకు పోలీసులు తమను సంప్రదిస్తుండడం ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కలిగిస్తోంది. స్పోర్ట్స్ కార్యక్రమానికి సహకరించాలని పోలీసులు పదేపదే తమను అడుగుతుండడంతో ప్రజాప్రతినిధులకు ఎటూ పాలుపోవడంలేదు. దొంగలు దొరకలేదు... ప్రజలు సురక్షితంగా జీవనం సాగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అర్బన్ పోలీస్ జిల్లాను కమిషనేట్గా మార్చింది. పోలీసు విధులలో నేరాల నియంత్రణ కీలకమైనది. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో మాత్రం విభిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరి 23న నగరంలో రెండో చోట్ల చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళ మెడలోని 4 తులాల బంగారాన్ని, సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మరో మహిళ మెడలోని 3 తులాల బంగారాన్ని దొంగలు కొన్ని గంటల వ్యవధిలోనే ఎత్తుకెళ్లారు. చాలా రోజుల తర్వాత నగరంలో చైన్ స్నాచింగ్ జరగడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆందోళనకు గురయ్యారు. వరంగల్ మహానగరంలో దొంగతనాలు తగ్గాయని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ... వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు. నగరంలో ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. దొంగతనాల నియంత్రణ కోసం పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా వాహనాలు సమకూర్చింది. పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు ఈ విధులను పక్కనబెడుతున్నారు. వాహనాలను ఏదో ఒక చోట నిలిపి కాలక్షేపం చేస్తున్నారు. చైన్ స్నాచింగ్ దొంగలను గుర్తించినట్లు పోలీసులు అంటున్నప్పటికీ వారు ఇంకా దొరకలేదు. ఈ సంఘటన కమిషనరేట్ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారుతోంది. నేరాల నియంత్రణలో కీలకమైన సెంట్రల్ క్రైం స్టేషన్ విభాగానికే అధికారిలేని పరిస్థితి ఉంది. సీసీఎస్ ఏసీపీగా వచ్చిన అధికారిణి మూడు రోజులకే దీర్ఘకాలపు సెలవుపై వెళ్లడంతో పోస్టు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. దీంతో నేరాలు, దొంగతనాల నియంత్రణపై ప్రభావం పడుతోంది. -
పోలీస్ కమిషనరేట్‌లో ’బదిలీ’ల ఫీవర్
పలువురు అధికారులకు స్థాన చలనం కొత్త సర్కిళ్లకు పోస్టింగ్‌లు తప్పని సరి రెండు రోజులో సీఐల బదిలీలు ఖాయం వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ’బదిలీ’ల ఫీవర్ నెలకొంది. కమిషనరేట్‌లో ఏ విభాగంలో చూసినా...ఏ అధికారి మాట్లాడినా బదిలీల ముచ్చటే జోరుగా సాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పలు పోస్టింగ్‌లు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా సర్కిళ్లు పెరిగాయి. కమిషనరేట్‌లో జనగామ జిల్లాను చేర్చడంతో ఆ జిల్లా పరిధిలో ఏసీపీ, సీఐ పోస్టులు పెంచకతప్పలేదు. కొత్త జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు భద్రత కల్పించేందుకు ఆర్మ్డ్ రిజర్వు పోలీసులను తాత్కాలికంగా కేటాయించారు. ఈ కేటాయింపులపై ఆ విభాగంలోని ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఐల బదిలీలు జరుగుతాయని పోలీస్ కమిషనర్ కార్యాలయ అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా విధులు నిర్వర్తించిన ఇన్స్ స్పెక్టర్లను తప్పనిసరిగా బదిలీ చేసే అవకాశాలున్నాయి. కమిషనరేట్ ఏర్పడిన సమయంలో జరిగిన బదిలీల పోస్టింగుల్లో పూర్తిగా రాజకీయం చోటు చేసుకుంది. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలతో పోలీసులు కలసి మెలసి ఉండాలని సీఎం కేసీఆర్ భావించి ప్రజాప్రతినిధులు సూచనల మేరకే పోస్టింగ్‌లు ఇవ్వాలని పోలీస్ బాస్‌లకు అదేశాలు ఇచ్చారు. ఈ ప్రయోగం పూర్తిగా వికటించినట్లు తెలుస్తోంది. భద్రత మాట పక్కనబెడితే పోలీస్ పాలన మొత్తం అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంత మంది ఇన్స్ స్పెక్టర్లను బదిలీ చేయాలని కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చినా కమిషనర్ పట్టించుకోక పోవడంతో ఈసారి బదిలీల్లో రాజకీయ ప్రమేయం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలో ఎస్ఐలుగా పనిచేసి కమిషనరేట్ పరిధిలోనే ప్రస్తుతం పనిచేస్తున్న సీఐలు నగరంలోని ప్రముఖ పోలీస్ సర్కిళ్ల్లపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీస్ సర్కిళ్లపై కన్నేసిన ఇన్స్ స్పెక్టర్లు తమ గాఢ్ఫాదర్లతో బెర్త్‌లను ఖాయం చేయించుకున్నారని తెలుస్తోంది. ట్రాఫిక్‌కు దిక్కులేదు... కమిషనరేట్ ట్రాఫిల్ ఏసీపీగా పనిచేసిన వెంకటేశ్వర్రావు పదవీ విరమణ పొందిన తర్వాత విభాగం దిక్కులేకుండా పోయింది. క్రైం ఏసీపీ ఈశ్వర్రావుకు ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేక పోతున్నారు. దీనికి తోడుగా హన్మకొండ ట్రాఫిక్ సీఐ డీఐజీకి అటాచ్డ్ కావడంతో మరింత అధ్వాన్నంగా తయారైంది. ఏసీపీ వెంకటేశ్వర్రావు ఆగస్టు 31న పదవీవిరమణ పొందారు. ఈ పోస్టింగ్‌కు రాజకీయ నేతల నుంచి సిఫారసులు పొందినా కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వని కారణంగా పోస్టింగ్ ఖాళీ అయి రెండు నెలలు పూర్తయినా కొత్త ఏసీపీ రాని పరిస్థితులు నెలకొన్నాయి. కమిషనరేట్ స్థాయి పెరిగి మూడు జిల్లాల్లో పర్యవేక్షణ చేయాల్సి ఉన్నందున ఒక డీసీపీతో పాటు మరో రెండు ఏసీపీ పోస్టులు ట్రాఫిక్‌లో ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఈపోస్టింగ్లు పూర్తి స్థాయిలో భర్తీ చేయాలంటే ఇన్స్ స్పెక్టర్లకు పదోన్నతులు రావాల్సిందే..ప్రస్తుతం ఏసీపీ పోస్టుతో పాటు హన్మకొండ ట్రాఫిక్ సీఐ పోస్టును రెండు రోజుల్లో భర్తీ చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. కొత్త సర్కిళ్లకు పోస్టింగ్‌లు.... జిల్లాల పునర్వీభజనల నేపథ్యంలో కొత్తగా కమిషనరేట్ పరిధిలో ఆరు సర్కిళ్లు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి సీఐలను నియమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీటితో పాటు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లో ఖాళీ సర్కిళ్లలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో సీఐల బదిలీలు ఖాయంగా తెలుస్తోంది. సీఐల బదిలీల పోస్టింగ్‌లకు పలువురు ప్రజాప్రతినిధులు సిఫారసు చేసినట్లు తెలిసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసు ఉన్నతాధికారులు సామర్థ్యం ఉన్న అధికారులకే పోస్టింగ్ ఇచ్చేందుకు ఆచీతూచి అడుగేస్తున్నట్లు తెలిసింది. నగర పరిధిలోని అన్ని స్టేషన్ల సీఐల బదిలీలు జరిగినా ఆశ్చర్య పడనవసరం లేదు. బదిలీల్లో భాగంగా నగరంలోని ఏసీపీలు కూడా స్థాన చలనం జరిగే అవకాశాలు లేకపోలేదు. సీఐల బదిలీలు రెండు రోజుల్లో జరుగుతాయని విశ్వసనీయంగా తెలిసింది. -
పోలీస్.. నో ఆప్షన్
శాఖలో విభజన గోల ఆప్షన్లు ఇచ్చి పంపించాలని వినతి రూరల్‌కు బదిలీపై పలువురి అసంతృప్తి దీర్ఘకాలిక సెలవు పెట్టేందుకు కొందరి సమాయత్తం టీఎస్ఎస్పీ వారిని జిల్లాలకు కేటాయిస్తే పరిష్కారం వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్మ్డ్ పోలీసుల విభజన ప్రతీ సారి గందరగోళానికి దారి తీస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా జిల్లాల్లో నేతలు, కార్యాలయాల్లో బందోబస్తు కోసం ఆర్మ్డ్ పోలీసులను బదిలీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2012లో రూరల్, అర్బన్ పోలీసు విభాగాలు ఏర్పాటు కావడంతో ఎలాంటి ఆప్షన్లు లేకుండానే సిబ్బందిని విభజించారు. దీనిపై ఏఆర్ విభాగం పోలీసులు కోర్టును ఆశ్రయించడం, పోలీసు ఉన్నతాధికారులకు పలుమార్లు మొర పెట్టుకోవడంతో మళ్లీ రూరల్, అర్బన్ ఆర్మ్డ్ పోలీసుల ఉమ్మడి సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలకు కేటాయించారు. ఈ సందర్భంగా నా¯ŒS లోకల్ కోటా తో పాటు సుమారు 20 ఏళ్లకు పైగా అర్బన్ ప్రాంతంలో సర్వీసు పూర్తి చేసుకున్న పోలీసులను రూరల్ ప్రాంతాల కు కేటాయించారు. దశాబ్దాలుగా తాము నగరంలోని స్థిరపడిపోయి పిల్లలు ఉన్నత చదువుల్లో ఉన్నందున ప్రస్తుతం ఉన్న పోస్టింగ్ నుండి రూరల్ జిల్లాలకు పంపొద్దని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. అయితే, ప్రస్తుతం కొత్త జిల్లాల్లో పాలన సాగాలంటే తాత్కాలికంగా వెళ్లక తప్పదని చెప్పిన బాస్‌లు రెండు నెలల అనంతరం పునః పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి, మానుకోటకు కేటాయింపుతో.. కమిషనరేట్‌లోని ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న పోలీసుల బదిలీల సందర్భంగా ఆప్షన్లు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. కమిషనరేట్ పరిధిలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలు పూర్తిగా అర్బ¯ŒS ప్రాంతంగా ఉండడంతో ఇక్కడ పనిచేస్తున్న ఏఆర్ పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు అర్బ¯ŒS నుంచి సుమారు 250మందిని బదిలీ చేయడంతో గందరగోళం నెలకొన్నది. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు చెందిన పలువురు పోలీసులు ఏఆర్ విభాగంలో పనిచేస్తున్నారు. వారికి ఆప్షన్లు ఇస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. టీఎస్ఎస్పీ నుంచి వచ్చేందుకు సుముఖం... తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు(టీఎస్ఎస్పీ) బెటాలియన్లలో వివిధ జిల్లాలకు చెందిన వారు ఉద్యోగం చేస్తున్నారు. వారిలో సుమారు 300మందికి పైగా ఉమ్మడి జిల్లాలకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్ర స్తుతం నూతన జిల్లాలు ఏర్పడినందున వారు తమ సొంత జిల్లాలకు వచ్చేందుకు సముఖంగా ఉండడం వల్ల వారి ని ఏఆర్ విభాగంలోని తీసుకుంటే ఈ సమçస్య పరిష్కారమవుతుందని సంఘాల నాయకులు చెబుతున్నారు. కొత్త జిల్లాల్లో పలు ఇబ్బందులు... కొత్త జిల్లాలకు కేటాయించిన ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాకు కేటాయించిన ఏఆర్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు పెట్టేందుకు సమాయత్తవుతున్నట్లు సమాచారం. ఈనెల 13వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఏఆర్ పోలీసులు తమ సమస్యలు ’సాక్షి’తో ఏకరవు పెట్టారు. తమకు పడుకునేందుకు సరైన వసతి లేదని, తినేందుకు ఏ హోటల్‌కు వెళ్లినా రూ.70కు తక్కువ కావడం లేదని చెప్పారు. అద్దె గదుల కోసం ఆరా తీసీ ఏడాది అద్దె ముందే అడ్వాన్సు గా ఇవ్వాలని యాజమానులు చెప్పడంతో దిక్కు తోచడం లేదని తెలిపారు. దీనికి తోడుగా ఉన్నతాధికారులు డ్యూటీ టైం అయిపోయినా ఉండాలని వేధిస్తున్నారని వాపోయారు. ఇవన్నీ తట్టుకోలేక దీర్ఘకాలికంగా సెలవులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పలువురు తెలిపారు. -
కమిషనరేట్ పరిధిలోకి జనగామ జిల్లా
సీఎం నిర్ణయంతో పెరిగిన పరిధి కొత్తగా నాలుగు ఏసీపీ కార్యాలయాలు వరంగల్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పెరిగింది. నూతనంగా ఏర్పడే జనగామ జిల్లాను కమిషనరేట్ పరిధిలో చేర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు పోలీస్‌శాఖ అధికారులు తాజాగా కసర త్తు ప్రారంభించారు. కొత్తగా ఏర్పడే వరంగల్, వరంగల్ (రూరల్), జనగామ జిల్లాలను వరంగల్ కమిషనరేట్ పరిధిలోకి తేవాలని తాజాగా నిర్ణయించారు. పరిపాలన పరంగా ఏ పోలీస్‌స్టేన్ ఏ డివిజన్ పరిధిలో ఉండాలనే విషయంపై ప్రతిపాదనలు పూర్తయ్యాయి. కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభమయ్యే దసరా రోజు నుంచి కమిషనరేట్ పరిధిలోని కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తు తం వరంగల్, హన్మకొండ, కాజీపేట, మాము నూరు, క్రైం, ట్రాఫిక్, స్పెషల్‌బ్రాంచ్, ఏఆర్ ఏసీపీ పోస్టులు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం నర్సంపేట, హుజూరాబాద్, జనగామలోని డీఎస్పీ కార్యాలయాలు ఏసీపీ ఆఫీసులుగా మారనున్నాయి. కొత్తగా కేయూసీ, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్, జనగామ ఏసీసీ పోస్టులు ఏర్పడుతున్నాయి. జిల్లాల పునర్విభజనతో కమిషనరేట్ పరిధిలోకి వస్తున్న పరకాల డీఎస్పీ పోస్టు రద్దు చేసి కేయూసీ ఏసీపీ పోస్టుగా, జనగామ డీఎస్పీ పోస్టు రద్దై ఏసీపీ పోస్టుగా మారనుంది. వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో ప్రస్తుతం 19 సాధారణ పోలీస్స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌స్టేషన్, ఒక క్రైం పోలీస్‌స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, జనగామ టౌన్, జనగామ రూరల్, లింగాల ఘన్పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట, రఘునాథపల్లి, గుండాల, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల, కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నారు. కొత్త మండలాలుగా ఏర్పడే తరిగొప్పుల, చిల్పూరు, వేలేరు, ఐనవోలు, ఇల్లంతకుంట ఏర్పడే పోలీస్స్టేషన్లు కమిషరేట్ పరిధిలోనే ఉంటాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఐదు పోలీస్స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కాను న్న జనగామ జిల్లాలలోని పోలీస్స్టేషన్లు కమిషనరేట్ పరిధిలోకి వస్తే మొత్తం 55 పోలీస్స్టేషన్ల తో కమిషనరేట్ పరిధి భారీగా పెరగనుంది. వరంగల్ : మట్టెవాడ, మిల్స్‌కాలనీ, ఇంతె జార్గంజ్, లేబర్‌కాలనీ, ఏనుమాముల హన్మకొండ : హన్మకొండ, సుబేదారి, వడ్డెపల్లి, న్యూశాయంపేట కాజీపేట : కాజీపేట, మడికొండ, ధర్మసాగర్ నర్సంపేట : నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ మామునూరు : మామునూరు, పర్వతగిరి, సంగెం, గీసుగొండ హుజూరాబాద్ : కమలాపూర్, ఇల్లంతకుంట, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి కేయూసీ : కేయూసీ, హసన్‌పర్తి, ఆరెపల్లి, ఆత్మకూరు, పరకాల, శాయంపేట వర్ధన్నపేట : వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్‌గఢ్, ఐనవోలు, పాలకుర్తి, కొడకండ్ల స్టేషన్‌ఘన్‌పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, నర్మెట, చిల్పూరు, వేలేరు జనగామ : జనగామ టౌన్, జనగామ రూరల్, లింగాలఘనపూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, తరిగొప్పుల, గుండాల -
31 కేంద్రాల్లో ఎస్సై రాత పరీక్ష
హాజరు కానున్న 21, 250 మంది ‘ఎస్సై’ అభ్యర్థులు వివరాలు వెల్లడించిన సీపీ వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 17న నిర్వహించ నున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి 31 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 21,250 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. -
మిస్డ్‌కాల్.. విచారణ మిస్!
కొంతమంది నిందితులతోనే సరి.. బయటకురాని ‘పెద్ద మనుషుల’ పేర్లు విచారణ తీరుపై ఆరోపణలు వరంగల్ : సంచలనం సృష్టించిన ‘మిస్డ్ కాల్’ కేసులో పోలీసు విచారణ ఎంతకీ ముందుకు కదలడం లేదు. అమ్మాయిలను ఎరవేసి సమాజంలోని ఉన్నతస్థాయి వారిని, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన విషయంలో వరంగల్ కమిషరేట్ పోలీసులు గతనెల 6న కొందరు నిందితులను అరెస్టు చేశారు. సమాజంలోని పలువురు పెద్దలు ఈ కేసులో ఉన్నట్లు చెప్పారు. మోసం చేసినవారుగా పేర్కొంటూ అరెస్టు చేసిన వారి వివరాలు వెల్లడించారు. మహిళలతో ఫోన్లో మాట్లాడి వారి పిలిచిన చోటికి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న వారు ఎవరనే విషయాలు పోలీసులు చెప్పడం లేదు. సాధారణంగా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్న అందరినీ నిందితులుగా భావించే పోలీసులు మిస్డ్ కాల్ కేసులో మాత్రం మహిళలను, మరికొందరిని అరెస్టు చేసి.. భాగస్వాములు అయిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో పోలీసుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. కేసును నీరుగార్చుతున్న పోలీసులు ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి ఉన్నతస్థాయి వ్యక్తులకు మహిళలతో ఫోన్లో మిస్డ్ కాల్‌తో పరిచయడం పెంచుకుని బ్లాక్ మెయిలింగ్‌కు తెరతీసిన వ్యవహారం గత నెలలో జిల్లాలో సంచలనం సృష్టించింది. పలువురు ఉన్నతస్థాయి అధికారులు, బడా వ్యాపారులు ఈ ముఠా ప్రలోభాలకు గురయ్యారు. వ్యభిచారం ముఠా వలలో చిక్కి ఏకంగా రూ.12 లక్షలు వసూలు చేశారు. ఇదే విషయంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. పరారీలో ఇద్దరు వ్యక్తులు చిక్కితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తామని పోలీసులు అప్పుడు చెప్పారు. వీరిని ఎంతకీ అరెస్టు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పరారీలో ఉన్న ఇద్దరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, ఈ విషయాన్ని బహిరంగ పర్చడం లేదని తెలుస్తోంది. మరో కీలక నిందితుడిని అరెస్టు చేస్తే వ్యభిచారం ముఠాకు భారీగా డబ్బులు ఇచ్చిన ఉన్నతాధికారులు, వ్యాపారుల వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. వీరి వివరాలు బయటికి రాకుండా ఏదో మతలబు జరిగినందునే పోలీసులు ఈ కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితులను పట్టుకోకుండా కేసును నీరుగారుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద మనుషులనేనా! మిస్డ్ కాల్ కేసులో భాగస్వామ్యం ఉన్న ‘పెద్ద మనుషుల’ను పోలీసులు బాధితులుగా చెబుతున్నారు. ఆర్టీసీ, ఎఫ్‌సీఐ, పాల డైరీలోని ఉన్నత ఉద్యోగులు, ఓ ప్రముఖ కంపెనీ షోరూం యజమాని ‘పెద్ద మనుషులలో’ ఉన్నట్లు కేసు వివరాలు వెల్లడించిన రోజున పోలీసులే స్వయంగా చెప్పారు. పెద్ద మనుషులను వ్యవహరాలను బ్లాక్మెయిల్ ముఠా వీడియో తీసిన టేపులు ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఈ విషయంలో ఉదాసీనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. మిస్డ్‌కాల్ ముఠా వ్యవహరం బహిర్గతమైన తర్వాత ఉన్నతస్థాయి వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. ముఠా సభ్యులు తమను బ్లాక్మెయిల్ చేసినట్లు వారు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఎందరో ప్రముఖులు ఉన్నా బ్లాక్‌మెయిలింగ్ ముఠా వీరినే లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణాలు ఏమిటనేది పోలీసులకు తెలిసినా.. వీరి పేర్లను వెల్లడించకపోవడానికి కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు తమ పేర్లను వెల్లడించవద్దని పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఒప్పందం విషయంలో ఆలస్యం చేసిన కారణంగానే తన పేరును పోలీసులు బయటి కి వెల్లడించారని ఎఫ్‌సీఐ ఉద్యోగి ఒకరు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. దీంతో మిగిలిన ‘పెద్దమనుషులు’ పోలీసులను సంప్రదించి మేనేజ్ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మిగిలిన పోలీసుల పేర్లు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. -
విపక్షం విజ్ఞప్తిని తొసిపుచ్చిన అధికార పక్షం
వరంగల్ : వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. అలాగే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు... ప్రభుత్వాన్ని కోరాయి. అయితే విపక్షాల కోరికను అధికార పక్షం ససేమిరా అని... పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం బిల్లుకు కూడా తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.