అసలు పనిపై నిర్లక్ష్యం
అంతా ప్రత్యేక పనుల్లోనే నిమగ్నం
నేరాల నియంత్రణపై అశ్రద్ధ
ఇంకా దొరకని గొలుసు దొంగలు
ఖాళీగానే క్రైం ఏసీపీ పోస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఫ్రెండ్లీ పోలీసు నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలనేది లక్ష్యం. కొందరు అధికారులు మాత్రం నేరాల నియంత్రణలోనూ దీన్నే అనుసరిస్తున్నారు. ఫలితంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు ఆగడం లేదు. అనుభవజ్ఞులైన అధికారులు ఎక్కువ మంది ఉన్నా కొన్ని కేసులను ఛేదించడం లేదు. వరంగల్ నగరంలో ఒకే రోజు రెండు చోట్ల చైన్ స్నాచింగ్(గొలుసు దొంగతనాలు) జరిగి రెండు వారాలు గడుస్తున్నా దొంగలను ఇప్పటికీ పట్టుకోలేదు. నగర ప్రజలను ఎక్కువగా ఆందోళనకు గురిచేసే చైన్ స్నాచింగ్‌ల నియంత్రణ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పోలీసుల విధుల్లో కీలకమైన నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పర్యవేక్షణ తగ్గడం వల్లే ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీస్ కమిషనరేట్‌లోని అధికారులు, సిబ్బంది అంతా ఇప్పుడు ప్రత్యేకమైన పనుల్లో నిమగ్నమయ్యారని ఆ శాఖలోనే చర్చించుకుంటున్నారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ సెకండ్ గేమ్స్, స్పోర్ట్స్ –2017 కార్యక్రమం మార్చి 3 నుంచి 7 వరకు వరంగల్‌లో జరగనుంది. ఏసీసీ స్థాయి నుంచి ఎస్సైల వరకు అందరు ఈ స్పోర్ట్స్ నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నగరంలోని వ్యాపారవేత్తలను, ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నారని పోలీసు శాఖలోనే చర్చ జరుగుతోంది. పోలీసు శాఖ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ ఏర్పాట్లకు పోలీసులు తమను సంప్రదిస్తుండడం ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కలిగిస్తోంది. స్పోర్ట్స్ కార్యక్రమానికి సహకరించాలని పోలీసులు పదేపదే తమను అడుగుతుండడంతో ప్రజాప్రతినిధులకు ఎటూ పాలుపోవడంలేదు.
దొంగలు దొరకలేదు...
ప్రజలు సురక్షితంగా జీవనం సాగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అర్బన్ పోలీస్ జిల్లాను కమిషనేట్‌గా మార్చింది. పోలీసు విధులలో నేరాల నియంత్రణ కీలకమైనది. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో మాత్రం విభిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరి 23న నగరంలో రెండో చోట్ల చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళ మెడలోని 4 తులాల బంగారాన్ని, సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మరో మహిళ మెడలోని 3 తులాల బంగారాన్ని దొంగలు కొన్ని గంటల వ్యవధిలోనే ఎత్తుకెళ్లారు. చాలా రోజుల తర్వాత నగరంలో చైన్ స్నాచింగ్ జరగడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆందోళనకు గురయ్యారు. వరంగల్ మహానగరంలో దొంగతనాలు తగ్గాయని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ... వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు. నగరంలో ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. దొంగతనాల నియంత్రణ కోసం పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా వాహనాలు సమకూర్చింది. పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు ఈ విధులను పక్కనబెడుతున్నారు. వాహనాలను ఏదో ఒక చోట నిలిపి కాలక్షేపం చేస్తున్నారు. చైన్ స్నాచింగ్ దొంగలను గుర్తించినట్లు పోలీసులు అంటున్నప్పటికీ వారు ఇంకా దొరకలేదు. ఈ సంఘటన కమిషనరేట్ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారుతోంది. నేరాల నియంత్రణలో కీలకమైన సెంట్రల్ క్రైం స్టేషన్ విభాగానికే అధికారిలేని పరిస్థితి ఉంది. సీసీఎస్ ఏసీపీగా వచ్చిన అధికారిణి మూడు రోజులకే దీర్ఘకాలపు సెలవుపై వెళ్లడంతో పోస్టు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. దీంతో నేరాలు, దొంగతనాల నియంత్రణపై ప్రభావం పడుతోంది.