పోలీస్ కమిషనరేట్‌లో ’బదిలీ’ల ఫీవర్
పోలీస్ కమిషనరేట్‌లో ’బదిలీ’ల ఫీవర్
Published Fri, Oct 28 2016 3:20 PM | Last Updated on Sat, Aug 11 2018 8:18 PM
పలువురు అధికారులకు స్థాన చలనం
కొత్త సర్కిళ్లకు పోస్టింగ్‌లు తప్పని సరి
రెండు రోజులో సీఐల బదిలీలు ఖాయం
వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ’బదిలీ’ల ఫీవర్ నెలకొంది. కమిషనరేట్‌లో ఏ విభాగంలో చూసినా...ఏ అధికారి మాట్లాడినా బదిలీల ముచ్చటే జోరుగా సాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పలు పోస్టింగ్‌లు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా సర్కిళ్లు పెరిగాయి. కమిషనరేట్‌లో జనగామ జిల్లాను చేర్చడంతో ఆ జిల్లా పరిధిలో ఏసీపీ, సీఐ పోస్టులు పెంచకతప్పలేదు. కొత్త జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు భద్రత కల్పించేందుకు ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులను తాత్కాలికంగా కేటాయించారు. ఈ కేటాయింపులపై ఆ విభాగంలోని ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఐల బదిలీలు జరుగుతాయని పోలీస్ కమిషనర్ కార్యాలయ అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా విధులు నిర్వర్తించిన ఇన్స్ స్పెక్టర్లను తప్పనిసరిగా బదిలీ చేసే అవకాశాలున్నాయి. కమిషనరేట్ ఏర్పడిన సమయంలో జరిగిన బదిలీల పోస్టింగుల్లో పూర్తిగా రాజకీయం చోటు చేసుకుంది. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలతో పోలీసులు కలసి మెలసి ఉండాలని సీఎం కేసీఆర్ భావించి ప్రజాప్రతినిధులు సూచనల మేరకే పోస్టింగ్‌లు ఇవ్వాలని పోలీస్ బాస్‌లకు అదేశాలు ఇచ్చారు. ఈ ప్రయోగం పూర్తిగా వికటించినట్లు తెలుస్తోంది. భద్రత మాట పక్కనబెడితే పోలీస్ పాలన మొత్తం అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంత మంది ఇన్స్ స్పెక్టర్లను బదిలీ చేయాలని కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చినా కమిషనర్ పట్టించుకోక పోవడంతో ఈసారి బదిలీల్లో రాజకీయ ప్రమేయం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలో ఎస్‌ఐలుగా పనిచేసి కమిషనరేట్ పరిధిలోనే ప్రస్తుతం పనిచేస్తున్న సీఐలు నగరంలోని ప్రముఖ పోలీస్ సర్కిళ్ల్లపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీస్ సర్కిళ్లపై కన్నేసిన ఇన్స్ స్పెక్టర్లు తమ గాఢ్‌ఫాదర్లతో బెర్త్‌లను ఖాయం చేయించుకున్నారని తెలుస్తోంది.
ట్రాఫిక్‌కు దిక్కులేదు...
కమిషనరేట్ ట్రాఫిల్ ఏసీపీగా పనిచేసిన వెంకటేశ్వర్‌రావు పదవీ విరమణ పొందిన తర్వాత విభాగం దిక్కులేకుండా పోయింది. క్రైం ఏసీపీ ఈశ్వర్‌రావుకు ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేక పోతున్నారు. దీనికి తోడుగా హన్మకొండ ట్రాఫిక్ సీఐ డీఐజీకి అటాచ్డ్ కావడంతో మరింత అధ్వాన్నంగా తయారైంది. ఏసీపీ వెంకటేశ్వర్‌రావు ఆగస్టు 31న పదవీవిరమణ పొందారు. ఈ పోస్టింగ్‌కు రాజకీయ నేతల నుంచి సిఫారసులు పొందినా కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వని కారణంగా పోస్టింగ్ ఖాళీ అయి రెండు నెలలు పూర్తయినా కొత్త ఏసీపీ రాని పరిస్థితులు నెలకొన్నాయి. కమిషనరేట్ స్థాయి పెరిగి మూడు జిల్లాల్లో పర్యవేక్షణ చేయాల్సి ఉన్నందున ఒక డీసీపీతో పాటు మరో రెండు ఏసీపీ పోస్టులు ట్రాఫిక్‌లో ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఈపోస్టింగ్‌లు పూర్తి స్థాయిలో భర్తీ చేయాలంటే ఇన్స్ స్పెక్టర్లకు పదోన్నతులు రావాల్సిందే..ప్రస్తుతం ఏసీపీ పోస్టుతో పాటు హన్మకొండ ట్రాఫిక్ సీఐ పోస్టును రెండు రోజుల్లో భర్తీ చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.
కొత్త సర్కిళ్లకు పోస్టింగ్‌లు....
జిల్లాల పునర్వీభజనల నేపథ్యంలో కొత్తగా కమిషనరేట్ పరిధిలో ఆరు సర్కిళ్లు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి సీఐలను నియమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీటితో పాటు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లో ఖాళీ సర్కిళ్లలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో సీఐల బదిలీలు ఖాయంగా తెలుస్తోంది. సీఐల బదిలీల పోస్టింగ్‌లకు పలువురు ప్రజాప్రతినిధులు సిఫారసు చేసినట్లు తెలిసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసు ఉన్నతాధికారులు సామర్థ్యం ఉన్న అధికారులకే పోస్టింగ్ ఇచ్చేందుకు ఆచీతూచి అడుగేస్తున్నట్లు తెలిసింది. నగర పరిధిలోని అన్ని స్టేషన్ల సీఐల బదిలీలు జరిగినా ఆశ్చర్య పడనవసరం లేదు. బదిలీల్లో భాగంగా నగరంలోని ఏసీపీలు కూడా స్థాన చలనం జరిగే అవకాశాలు లేకపోలేదు. సీఐల బదిలీలు రెండు రోజుల్లో జరుగుతాయని విశ్వసనీయంగా తెలిసింది.
Advertisement
Advertisement