ఖద్దరు చుట్టూ ఖాకీ చక్కర్లు
గుంటూరు క్రైం : శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ ప్రజలకు సేవలు అందించాల్సిన కొందరు పోలీసు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ బదిలీల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా జీరో ట్రాన్స్‌ఫర్లు చేస్తామని ఇటీవల వెల్లడించడంతో అన్ని శాఖల అధికారులు బదిలీల కోసం ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు.
పోలీసు అధికారులు వారు కోరుకున్న ప్రాంతాల్లో అవకాశం కల్పించాలని ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల వద్ద ఉంటున్న ద్వితీయ శ్రేణి నాయకులు కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పించేందుకు లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని, ముందుగా సగం పోస్టింగ్ వేసిన తరువాత సగం చెల్లించాలని చెబుతున్నట్లు సమాచారం. దీంతో కొందరు అధికారులు ఎక్కువ ఆదాయం ఉన్న పోలీసుస్టేషన్‌లను ఎంచుకుని డబ్బు చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
సీఐ పోస్టుకు రూ.16 లక్షలు..
ఆదాయం ఉన్న పోలీసుస్టేషన్‌లో సీఐ పోస్టు కోసం రూ.16 లక్షలు చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. పోలీస్ స్టేషన్ స్థితిని బట్టి సీఐ బదిలీ కోసం రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు బేరాలు కొనసాగిస్తున్నట్లు పోలీసు శాఖలో చర్చించుకుంటున్నారు. ఎస్‌ఐ పోస్టింగ్ కోసం రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని ప్రచారం ఉంది.
ఇప్పటికే పలువురు సీఐ,ఎస్‌ఐలు ఆయా నగదు ఇచ్చేందుకు బేరాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. ఈనెలాఖరు, వచ్చే నెల మొదటి వారంలో సీఐ, ఎస్‌ఐల బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలుగా ఎవరిని నియమించాలనేది టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు జాబితాలు పంపినట్లు సమాచారం.