38 మంది పోలీసు అధికారుల బదిలీలు
ఏపీకి వెళ్లే 14 మంది ఐపీఎస్‌లను డీజీపీకి రిపోర్టు చేయాలని ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను ఆదివారం పెద్దఎత్తున బదిలీ చేసింది. అంతేకాక రాష్ట్రానికి ఖరారైన ఐపీఎస్ అధికారులకు కీలకమైన శాంతిభద్రతల బాధ్యతలను అప్పగించింది. మొత్తం 38 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆంధ్రాకు వెళ్లనున్న 14 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లను ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఉమ్మడిరాష్ట్రంలో సివిల్ సర్వీసు అధికారులను కేటాయించే ప్రక్రియ దాదాపుగా తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐదు శాతం మినహా రెండు రాష్ట్రాలకు ఐపీఎస్ అధికారుల కేటాయింపులు పూర్తయినట్టు తెలిసింది. దీనిపై గెజిట్ నోటిపికేషన్ రావడానికి మరికొంత సమయం పడుతుందని కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలిసింది. వచ్చే నెల ఐదవ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండడంతో రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్ అధికారులను శాంతిభద్రతల పోస్టులలో నియమించడం అత్యవసరమని సీఎం కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు ఏ అధికారిని ఎక్కడ నియమించాలనే విషయమై డీజీపీ కసరత్తు జరిపి సర్కార్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఎస్పీ నుంచి ఐజీ స్థాయి అధికారుల బదిలీల ప్రతిపాదనలు పరిశీలించిన సీఎం కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఏపీకి వెళ్లనున్న కొందరు ఐపీఎస్‌లను తుది ఉత్తర్వులు వచ్చేంత వరకైనా ఇక్కడే కొనసాగించేందుకు అంగీకరించలేదని సమాచారం. ఎలాగూ వారు కొద్ది రోజుల్లో ఏపీకి వెళ్లాల్సినవారేనని తేల్చిన ప్రభుత్వం వారిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్‌లకే అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. దీంట్లో భాగంగానే ఐజీ నవీన్‌చంద్, సందీప్ శాండిల్య, డీఐజీ బి.మల్లారెడ్డి తదితరలకు అదన పు బాధ్యతలను అప్పగించింది. అసెంబ్లీ సమావేశాల వేళ శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఈ బదిలీలు చేసినట్టు తెలిసింది.
తెలంగాణ ఐపీఎస్‌లకు కీలక బాధ్యతలు
Published Mon, Oct 27 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM
Advertisement
Advertisement