’చక్కటి భారత నిర్మాతలు మీరే’
పుణె: భావి భారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం అని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. దేశ అవసరాలకు తగినట్లు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలన్నా ఉపాధ్యాయులే ముఖ్యం అని చెప్పారు. అందుకే ఇకనుంచి టీచర్లు జవాబుదారులుగా ఉండే విద్యావిధానం తీసుకొస్తామని ఆయన చెప్పారు. హెచ్చార్డీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆయన తొలిసారి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పుణెలోని ఫెర్గుసన్ కాలేజీలో ఉపాధ్యాయులను సత్కరిస్తూ ఆయన పలు అంశాలు స్పృషించారు. ’విద్యా విధానంలో ఎన్నో ఫిర్యాదులు, సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు మనమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. విద్యా విధానంలో మార్పులకు ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషించాలి. ప్రతికూల దోరణిని విడిచిపెట్టి సానూకూలంగా పనిచేయాలి. జవాబుదారి తనంతో పనిచేసే ఉపాధ్యాయులకు కచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ పని మేం చేస్తాం’ అని ఆయన చెప్పారు.