హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద పేలుడు
హైదరాబాద్: రాజధాని నగరంలోని ప్రఖ్యాత మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(సీబీఎస్, ఇమ్లీబన్ స్టేషన్) వద్ద మంగళవారం రాత్రి కలకలం రేగింది. బస్‌స్టేషన్ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిప్పు అంటుకోవడంతో అక్కడే నిలిపిఉన్న పలు వాహనాలు తగలబడ్డాయి. ఎంజీబీఎస్.. నిత్యం లక్షల్లో ప్రయాణికులు వచ్చిపోయే ప్రదేశం కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది.
ఆస్తి నష్టం రూ.4 కోట్లు
ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్టుసర్క్యూట్‌తో మంటలు చేలరేగాయి పది ఫైరింజన్లతో ప్రయత్నించినప్పటికీ ఎంతకీ మంటలు అదుపులోకి రాలేదు. 132 కెవీఎం ట్రాన్స్ఫార్మర్ కావడంతో అందులో సుమారు 47,000 లీటర్ల ఆయిల్ ఉంటుందని, అందువల్ల మంటలు భారీగా వ్యాపించాయని చెబుతున్నారు. చివరకు ఫోమ్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం రూ.4 కోట్ల వరకు జరిగింది అని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేయడానికి ఆరు గంటల సమయం పట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.