కథలన్నీ మనువాదానికి చెందినవే..
ఎల్జీబీటీ హక్కుల నేత నవదీప్
హైదరాబాద్: ప్రస్తుతం ప్రచురితమయ్యే కథలన్నీ మనువాదానికి చెందినవే ఉన్నాయని ఎల్జీబీటీ(లెస్బియన్ గే బెసైక్సువల్ ట్రాన్స్‌జెండర్) రైట్స్ యాక్టివిస్ట్ నవదీప్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కథా ఉత్సవం-2015 జరిగింది. ఈ సందర్భంగా 2014లో వెలువడిన ఉత్తమ కథల సంకలనం ‘‘ప్రాతినిధ్య-2014’’ను నవదీప్ ఆవిష్కరించారు. నేటి సమాజంలో స్వలింగ సంపర్కులను అంటరానివాళ్లుగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వలింగ సంపర్కులను సినిమా, మీడియా వాళ్లు అణచివేత ధోరణితోనే చూస్తున్నారని, ఇది పోవాలంటే విస్తృతమైన చర్చ జరగాలన్నారు. ముఖ్యఅతిథి ప్రముఖకవి సతీష్ చందర్ మాట్లాడుతూ సామాజిక స్పృహతో కూడిన రచనలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఎక్స్‌లెన్సీ అవార్డు ఫర్ లిటరరీ క్రిటిసిజం సాహితీవేత్త సి.విజయభారతికి, సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఎక్సెలెన్సీ అవార్డ్ ఫర్ స్టోరీ రైటింగ్‌ను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత మునిపల్లె రాజుకు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో సీఐడీ ఐజీపీ పి.వి.సునీల్ కుమార్, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మి నారాయణ, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు పాల్గొన్నారు.