translation to telugu language
-
వామ్మో తెలుగు అనువాదం!
కోజికోడ్: తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో తన ప్రసంగాల అనువాదం సందర్భంగా చిత్రమైన సమస్యలు ఎదుర్కొన్నట్టు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో నెల రోజులకు పైగా హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెర పడటం తెలిసిందే. బుధవారం కేరళలోని కోజికోడ్‌లో రాహుల్ ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగాన్ని ప్రముఖ ఉపన్యాసకుడు, ఐయూఎంఎల్ ఎంపీ అబుస్సమద్ సమాధానీ మలయాళంలోకి అనువదించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తనకెదురైన అనుభవాలను రాహుల్ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒక ప్రచార సభలో నా ప్రసంగాన్ని అనువదిస్తున్న వ్యక్తి ఎందుకోగానీ చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. నేనొకటి చెబుతుంటే ఆయన మరొకటి చెప్పసాగాడు. ఇక అలా కాదని నేను మాట్లాడిన పదాలు లెక్కబెట్టడం మొదలు పెట్టా. నేను హిందీలో ఐదు పదాలు మాట్లాడినప్పుడు తెలుగులో ఏడెనిమిది పదాలతో ముగిస్తాడని చూశా. కానీ ఆయన ఏకంగా 20 నుంచి 30 పదాలు మాట్లాడాడు. పైగా నేను బోరు కొట్టే విషయాలు మాట్లాడినప్పుడేమో జనం పరమోత్సాహంతో గట్టిగా చప్పట్లు కొట్టారు. మాంచి ఉత్సాహపూరితమైన ముచ్చట్లు చెప్పినప్పుడేమో అందరూ పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు. అంతా అనువాద మహిమ!’’ అంటూ వాపోయారు. ‘‘అంతా అలా ఉల్టాపల్టాగా నడిచింది. అయినా సరే, నేను ఎవరిపైనా కోపగించుకోలేని పరిస్థితి! పైగా ప్రసంగం సాగినంతసేపూ నిండుగా నవ్వుతూనే ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు. బహుశా తన ప్రసంగాలకు అనువాదకునిగా ఉండటం ప్రమాదకరమైన పనేనంటూ రాహుల్ చమత్కరించడంతో అంతా నవ్వుకున్నారు. చిరిగిన దుస్తుల మాటున సంపద దాస్తున్న నేతలు రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్ర శైలిని బట్టి వారిని అంచనా వేయకూడదని రాహుల్ అభిప్రాయపడ్డారు. నేటి నాయకులు తాము చూపించదలచింది మాత్రమే ప్రజలకు చూపిస్తుంటారని అన్నారు. ‘‘నన్ను కలవడానికి ఎందరో నాయకులు వస్తుంటారు. సాదాసీదా బట్టలు, చిరిగిన బూట్లతో కనిపిస్తారు. కానీ వాళ్లింటికి వెళ్తే పోరి్టకోలో ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లుంటాయి. వాళ్ల పిల్లలు అతి ఖరీదైన జీవితం గడుపుతూ కన్పిస్తారు. కనుక ఒక రాజకీయ నాయకుని ఆర్థిక స్థితిని సరిగా అంచనా వేయాలంటే అతని పిల్లలను గమనిస్తే చాలు. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను కనిపెట్టిన తిరుగులేని సూత్రమిది’’ అని చెప్పారు. -
మంచి పోలిక
సన్నగా పొడుగ్గా , జనం మాటల్లో చెప్పాలంటే సామనలుపు కోడెవాడు అతను. తల మీద మోయలేనంత బరువున్న కట్టెల మోపును మోస్తా ఎంతో దవ్వు నుంచి వస్తున్నట్లు ఉండాడు. అతని మొకం నుంచి చెమట కారుతా ఉంది. నేను అతని మోపుకు చెయ్యి వేస్తా ‘‘దించు’’ అంటిని. అతనూ ఒక చెయ్యి వేస్తా తలను సరుదుకొంటా ‘‘విడవండి’’ అని మోపును కిందకు దించినాడు. ‘‘చానా ఇక్కట్టు అయిపోయె సామీ. ఎప్పుడూ ఆ మోపురాతి మీదనే దించతా ఉంటిని. ఈ పొద్దు తాళేకి కాలేదు. మీ అట్లా పెద్దోళ్లను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది’’ అన్నాడు. ‘‘ఇబ్బంది ఏముంది? అయినా ఇంత మోయరాని బరువును ఎందుకు ఎత్తుకొంటివి?’’ అంటిని నేను. ‘‘అయ్యో సామీ, మనిషికి ఆత్రము ఉంటాది కదా. నాలుగు కట్టెలు ఎక్కువ ఉంటే మొదటి వీదిలోనే వెలపోతాయి. మూడు కాసులు ఎక్కువగానూ వస్తాయి’’ అన్నాడు. నేను తోవ పక్కన రాతిపైన కూచుని, అతన్నీ కూచోమని చెప్పి, ఇతని ఊరూవాడా మంచీచెడ్డా విచారించితిని. పేరు వెంకటరమణ. అయితే అందరూ వెంకటగా అనే పిలుస్తారు. ఇతనిలాంటి వాళ్లకు అది వెంకటగాడు అయిపోతుంది. జనం నోటిలో యంగటడుగా మారిపోతుంది. యంగటడు తిరుపతి పక్కన ఉండే ఒక పల్లెటూరి చిన్నోడు. బెంగుళూరులో బతుకును ఈడుద్దామని వచ్చినవాడు. ‘‘ఇంతదూరం ఎందుకు వస్తివి?’’ ‘ఏమో యాసట అయిపోయె సామీ. కొంచెంనాళ్లు ఊరికి దూరంగా ఉండేది మంచిదని ఈ తావుకు వచ్చేస్తిని’. ‘ఇంత చిన్న వయసులో వేసట ఎందుకొచ్చిందయ్యా?’ ‘నా తండ్రి మాదిరిగా అడుగుతా ఉండారు. లోకాన్ని ఎరిగినవారు ఒక నెమ్మది మాటను చెపితే నా మనసుకూ మంచిదే కదా’ అంటా అతను తన కతను చెప్పసాగినాడు. ∙∙l వెంకటడు తన పల్లెలో కూలినాలి చేసుకొని బతికేవాడు. అత్తకూతురు రంగి వీడితోపాటే పెరిగింది. చిన్నప్పటి నుంచే వీళ్లిద్దరూ ఆలూ మోగుళ్లని పెద్దవాళ్లు అనేవాళ్లు. రంగి మంచి అందగత్తె. ఈడు వచ్చిన తరువాత వాళ్లకు పెండ్లి అయింది. కానీ అదే వేళకు వాళ్ల గ్రహచారమూ చెడింది. ఊర్లో పుణ్యాత్ముడయిన రెడ్డి ఒకాయన, తెరువులో కనిపించిన ఆ పడుచును చూసి, ఆమెకు నగలూ చీరలూ ఆశ చూపించి లొంగదీసుకున్నాడు. ‘‘అంత బిరాన జరిగిపోయిందా అంటావా నాయనా. మనకు తెలియక బిరాన అనిపిస్తుంది అంతే. అట్లా పుణ్యాత్ములు ఎన్నినాళ్లుగా ఈ ఎత్తుగడలో ఉంటారో మనకు తెలుస్తుందా? వాని మీసం ఏమి, వాని రుమాలు ఏమి, వాడు ఆ గుర్రానెక్కి పోతావుంటే ఆ దర్పం ఏమి? మగోడిని నాకే ఆ పదవి కావాల అనిపిస్తాదే, అట్లాంటోడు పిలిస్తే ఏ పడుచు పడకుండా ఉంటాది? ఏమీ తెలియని రంగి కూడా ఒప్పుకునేసింది. తల్లితండ్రులు, ‘ఇది వద్దమ్మా కులానికే చెడ్డపేరు’ అనిరి. నేనూ చానా చెప్పి చూస్తిని. ఎంత మంచి ఆడది సామీ. కూలీకి పొయ్యే అప్పుడు నేను ఏదయినా ఎత్తుకొని పోదాము అంటే కూడా, ‘బద్దరం, దేవుడు చూస్తా ఉండాడు, మెట్టుతో కొడతాడు’ అనేది. అది ఏమి చెడ్డ గలిగో (లగ్నమో) సామీ, వానింట్లోనే నిలిచిపోయింది. ‘ఏమయినా మన ఇంటి కోడలు. రచ్చ పెట్టుకొంటే మన మర్యాదే చెడుతుంది. అక్కడయినా బాగా బతికితే చాలు. ఇంక దాని మాట వదిలెయ్యి’ అని మా అమ్మను నిలువరిస్తిని. మా అత్త వచ్చి ‘నీ కాపురాన్ని చెడిపేసింది కదరా. ఓలిని వెనక్కి ఇచ్చేస్తాము. వేరే పడుచును పెండ్లాడు’ అనింది. అయినా నాకు ఇంకొక పెండ్లి చేసుకోవాలని అనిపించలేదు. ‘ఉండనీయండి ఇట్లే’ అనేస్తిని. ‘‘వెంకటప్పా, నువ్వు ఊరు వదిలి ఎన్నాళ్లయింది?’’ ‘‘ఆరు నెలలు అయింది సామీ’’ ∙∙l ఆ తరువాత ఆ తోవలో నేను పదైదునాళ్లకో నెలకో ఒకసారి చూస్తానే ఉండాను. బేరాలు బాగుండాయా అంటా అడిగేవాడిని. ఒకనాడు, ‘నెల కిందట మా ఊరు నుంచి కాగితం వచ్చింది’ అంటా తన కొనసాగింపు కత చెప్పినాడు. ‘ఆ సావుకారోడు ఇంకొక ఆడదాన్ని మోసుకుని వచ్చెనంట. వాని ఇంట్లో పెద్ద రచ్చ జరిగెనంట. ఈ పడుచుకూ చానా యాసట అయిపోయి ‘నేనూ నీ దగ్గర ఉండను’ అనిందంట. దానికి వాడు ‘నువ్వేమి తాళి కట్టించుకొన్న పెండ్లాన్ని అనుకుంటా ఉండావా? ఉడుకు సంగటి దొరుకుతుందని నోరు తెరుచుకుని వచ్చిన కుక్కా, నీకెంత ఆంకారమే?’ అనెనంట. ‘దేవుడట్లా మొగుడ్ని విడిచి నీ దగ్గరకు వస్తిని. నా బుద్దికి మంకు పట్టి ఉండింది, ఆ పొద్దు మంచిగ మాట్లాడి నన్ను చెడిపి, మిండడివి అయితివి. ఈ పొద్దు చెడ్డగా మాట్లాడి నన్ను బాగుపరిస్తివి. నువ్వు ఇప్పుడు నాకు తండ్రివి’ అని వాడు ఇచ్చిన నగానట్రా అన్నిటినీ అక్కడనే వదిలేసి, వాడి పెండ్లాము కాళ్లకు మొక్కి ‘నేను నీ పడకను చెరిపితిని, నా పాపాన్ని మన్నించు’ అని వేడుకొని బయటకు వచ్చేసిందంట. మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మతో ‘నువ్వు చెప్పిన పని చేసుకొంటా నువ్వు పెట్టింది తింటా ఉంటాను’ అనిందంట. మా అమ్మ ఏమి చెప్పాలా అని ఆలోచిస్తా ఉంటే మా అత్త వచ్చి ‘కావలసినప్పుడు పోయి వద్దనుకున్నప్పుడు వస్తా ఉంటావా. నీకు కూడు పెట్టచ్చో పెట్టకూడదో చెప్పే యజమానుడు ఇక్కడ లేడు. వాడు ఉండే దగ్గరకు పోయి, వాడు ఒప్పుకొంటే బతుకు, లేదంటే పాడయిపో’ అని తిట్టిందంట. ‘రేపు బెంగుళూరుకు బయలుదేరి వస్తాద’ని కాగితంలో రాసి ఉండింది. కాగితంలోని ఆ మాటలను విని సంతోషపడితినో బాదపడితినో నాకే తెలియలేదు. మరునాడు కట్టెల కోసం పోకుండా పాళెంలోనే ఉంటిని. జనాన్ని అడుగుతా సరాసరి నేను కూచునుండే అరుగు దగ్గరకు వచ్చేసింది. నన్ను చూస్తానే తల దించుకొనింది. ఆ వెంటనే దగ్గరకు వచ్చి బిడ్డను కాళ్ల మీద పెట్టి తానూ తలను నేలకు తాకించి ‘నా దేవుడు తిరిగి దొరికినాడు, బతికించాల అనుకొంటే బతికించు, చంపేయాల అనుకొంటే చంపేయి’ అంటా ఏడిచింది. నేను బిడ్డను ఎత్తుకొంటిని. ‘పసిబిడ్డను ఇట్లా పడేస్తావా, లెయ్యి’ అని దానిని లేపి నిలబెట్టి, నేనుండే ఇంటి ఆడవాళ్లను పిలిచి ‘నా పెండ్లాము వచ్చింది, ఒక ఇల్లు చూసుకొనే వరకూ ఇక్కడ కొంచెం చోటు ఇయ్యమ్మా’ అని అడిగితిని’. నాకు అతని పెద్దమనసును చూసి ఆశ్చర్యమయింది. ‘‘బిడ్డనూ బాగా చూసుకోవాల’’ అంటిని. ‘‘చూసుకొంటాను సామీ. దానిని ఒప్పుకొంటాను కానీ బిడ్డను ఏమంటానో అని దానికి దిగులు ఉండొచ్చు. వచ్చిననాడే కాసేపు అయినాక బిడ్డను నా చేతికిచ్చి ‘బిడ్డ ముక్కూ మూతీ చూడు అంతా నీ అట్లానే ఉంది’ అనింది. అది అవునో కాదో నేనెందుకు చూడాల? నేను అవును అంటిని. ఆమెకు నెమ్మది అయింది. బిడ్డ ఎవరిది అయితే ఏమి? సాకినవాళ్లు పుణ్యాత్ములు’’. ‘‘ఇప్పుడు బిడ్డకు ఏడాదిన్నర అయిందా?’’ అని అడిగితిని నేను. ‘‘ఒక నెల ఎక్కువో తక్కువో. అడిగి చేసేది ఏముంది? అడిగితే అనుమానిస్తా ఉండానేమో అని నొచ్చుకుంటాది. దానిని సంతోషంగా ఉండనీ సామీ, నా మాట ఎందుకు?’’ అన్నాడు. వెంకటప్ప ఒక్కొక్క మాటా అతని సంస్కారము ఎంత గొప్పదో తెలియచేస్తా ఉంది. ∙∙l రథసప్తమి నాడు, నేను వెంకడిని మొదటిసారి చూసిన దిన్నకు అవతల కలిస్తిని. ‘‘అంతా బాగుండారా?’’ అని అడిగితిని. ‘‘పెద్దల దీవెనలు’’ అని ‘‘ఊరి నుంచి మొన్న ఒక కాగితము వచ్చింది నాయనా. ఆ సావుకారిని ఎవరో నరికేసిరంట. పాపం అన్యాయంగా చెడిపోయినాడు’’ అన్నాడు. ‘‘దీనిని మీ ఇంట్లో చెప్తివా?’’ అని అడిగితిని నేను. ‘‘అందరూ నీ అట్లా మంచివాళ్లే ఉంటారా? వీదిలోకి వచ్చిన పామును ఎవరో ఒకరు చంపే తీరుతారు’ అనింది అన్నాడు వెంకటప్ప. ఈ మాటల్లోనే మేము దిన్న నెత్తిమీదికి వస్తిమి. ‘‘అదిగో చూడండి నాయనా. అక్కడ కనబడతా ఉండే వాళ్లే నా పెండ్లాం బిడ్డలు’’ అన్నాడు. నేను అటుపక్కకు చూస్తిని. తల్లి తన బిడ్డకు నాలుగు దేవగన్నేరు పువ్వులను ఇచ్చి ఆడిస్తా ఉంది. రెండు అడుగులు ఆ పక్కకు పెట్టేసరికి ‘‘సామీ ఒక మాట. మన సాములోరు అని దానితో చెప్తాను. తల్లీ బిడ్డలను దీవించండి, కానీ ఊర్లో జరిగిన సంగతులు ఏమీ మీకు తెలిసినట్లు ఉండకూడదు. దాని మనసు నొచ్చుకుంటాది కదా’’ అన్నాడు వెంకటప్ప. మేము పాతూరు దగ్గరికి వస్తిమి. వెంకటడి పెండ్లాము లేచి నిలబడింది. బిడ్డ చేతిని పట్టుకొని తన కాళ్ల దగ్గర నిలబెట్టుకునింది. మొదట ఒక్క క్షణం ఆ బిడ్డ వెంకటడు లాగా ఉందా అని చూడాలనిపించింది. చేపట్టిన మొగుడే చేయని పరీక్షను నేను చేసేది ఎందుకు అనుకొని ఊరుకొన్నాను. మాస్తి వెంకటేశ అయ్యంగార్(1891–1986) కన్నడ కథ ‘వెంకటగాని పెండ్లాము’ సంక్షిప్త రూపం ఇది. దీన్ని నంద్యాల నారాయణరెడ్డి తెలుగులోకి అనువదించారు. ‘మాస్తి కన్నడ ఆస్తి’ అని కన్నడిగులు సగర్వంగా చెప్పుకునే గొప్ప కథా రచయిత మాస్తి. శ్రీనివాస కలంపేరుతో రాసేవారు. జ్ఞానపీఠ పురస్కారం స్వీకరించారు. -
అనువాదాలతో అమ్మ భాషకు పుష్టి
సందర్భం సమాజంలోని అన్ని రంగాలపై ప్రపం చీకరణ ప్రభావం పడింది. వ్యక్తి నుండి సమష్టి వరకు ప్రతి అడుగులో దాని ప్రభావం కనపడుతుంది. తద్వారా కలి గిన సౌకర్యాల సంగతి ఏమో గాని, సాంస్కృతిక రంగంపై పెద్ద దెబ్బ పడి నట్లయింది. వేషం, భాష, తిండి, నీరు మొదలుకొని సర్వ వ్యవహారాలకు దీని ప్రభావం పాకింది. ఫలితంగా భాషలు మార్పులకు గురి కావడమే కాదు, సమూలంగా వాటిని పెకలిం చివేసే ప్రమాదాలు కూడా ఏర్పడుతున్నాయి. జీవితంలో వ్యవ హారం తీరు మారింది. వ్యవహారాన్ని బట్టి భాష ఉంటుంది. ‘నాది వ్యవహార భాష’ అన్నాడు విశ్వనాథ. వ్యవహారమంటే వాడుక ఒక్కటే కాదు. వ్యాపార, రాజకీయ, శాస్త్ర రంగాలన్నిటిలో జరిగే వ్యవహారాలన్నీ వ్యవహారమే. అంటే నిత్య జీవితావసరాలు, రాజకీయ, పరిపాలన, శాస్త్ర, కళ, సాంస్కృతిక రంగాలన్నిటా వాడే భాష వ్యవహార భాష. ఆ విధంగా ఇవాళ వ్యవహారంలో వాడే తెలుగు భాష కొన్ని మూలాలను వదులుకుంటున్నది. నాగలి లేదు. ట్రాక్టర్ వచ్చింది. నీరుకు బదులు వాటర్ సామాన్య వ్యవ హారమయింది. ఇట్లా ఎన్నో! ఈ సందర్భంగా మనకు కలిగిన ఒక మేలు లేదా పరోక్ష వెసులుబాటు ఏమిటంటే మనకు తప్పనిసరిగా మరొక భాష, ముఖ్యంగా ఇంగ్లిష్ అవసరం అయింది. దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారికి, ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య హిందీతో పాటు మరో భాష అవసరం. అట్లే ఉర్దూ వంటి భాషల అవసరం కూడా ఏర్పడుతున్నది. ఈ కారణంగా ప్రతి వారికీ ఎంతో కొంత ఇంగ్లిష్ తెలుసుకోవాల్సిన అగత్యం ఏర్ప డింది. వస్తువులు, పద్ధతులు, సౌకర్యాలు, సాంకేతికాల పేర్లతో ఎంతో తనంత తానుగా వచ్చి చేరింది. పాతవి పోయి కొత్త పర భాషా పదాలు వచ్చి చేరాయి. ఆ చేరిన వాటిని భాషగా నేర్చు కోవడం వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి: పరాయి భాష నయినా సక్రమంగా మాట్లాడటం, చదవటం రావడం. రెండు: ఉభయ భాషలను కొంత సక్రమంగా నేర్చుకోవటం ఈనాటి తరానికి ఒక అత్యవసర సన్నివేశం. అది విద్యా మాధ్యమం వల్ల కొంత, సాహిత్యకారుల వల్ల కొంత, పత్రికలు, ప్రసార మాధ్య మాలు, సినిమా మొదలైన వాటివల్ల కొంత జరగవచ్చు. విద్యారంగం, సాహితీ రంగం రెండూ ప్రధానమైనవి. మిగతా రంగాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ వాటికి సరి ౖయెన రూపాలు ఈ రంగాల నుండే ఏర్పరచుకోవాలి. అప్పుడే కొత్త తరానికి సవ్యమైన సరిౖయెన భాష ఒకటి ఏర్పడుతుంది. రెండు భాషలు నేర్పడం ఇవాళ ప్రతి పాఠశాల చేస్తున్న పనే. అయితే భాషను నిత్య వ్యవహారానికి అను గుణంగాను, భాష స్వరూప స్వభావాల మౌలిక పరిచయాల ద్వారాను ఆ పని చేస్తే భాషలను సౌకర్యంగా వాడుకునే తీరులో నేర్చుకుంటారు. సాహితీవేత్తలు, పాత్రికేయులు అనువాదాన్ని ఒక ఆసరగా తీసుకొని ఆ పనిని చేయవచ్చు. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు అందించాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. ‘తెలుగు ముద్దు’ అనడంతో పాటు ‘ఇంగ్లిష్ వద్దు’ అనే నినాదం మారాలి. తెలుగు, ఇంగ్లిష్ లేదా హిందీ, లేదా ఉర్దూ ఏదో మరో భాషను కూడా అనివార్యమైన అవసరంగా అభిమానించి నేర్చు కోవాలి. ఏ భాష మీద తిరస్కరణా సరిౖయెనది కాదు. అనువాదాలు సాహిత్య రూపాలు కావచ్చు, శాస్త్ర విషయాలు కావచ్చు, రాజకీయ పరిపాలనా పరమైనవి కావచ్చు. చేసే ప్రయత్నం చేస్తే మూలభాష లోతులు, జాతీయాలు, నుడికారాలు తెలుస్తాయి. లక్ష్యభాష(అనువాదం చేయాలనుకున్న భాష)లో కూడా సమాన పద వాక్య ప్రయోగాలు చేõ¯ ప్రయత్నం జరుగు తుంది. తద్వారా లక్ష్య భాషను కూడా లోతుగా, మెరుగుగా, ఉన్నత అవసరాలకు అనుగుణంగా నేర్చుకున్నట్లవుతుంది. అమ్మ భాషను, అన్య భాషను అక్కచెల్లెండ్లుగా కలిపి నేర్చుకోవడం వల్ల ఉభయ సాంస్కృతిక, జీవన విధానాలకు మేలు కలుగుతుంది. పలు రంగాలలో రెండింటి అవసరం ఎంతో ఉంది కనుక ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి చిన్న చాయ్ దుకాణాలు పల్లెల్లో కూడా పెట్టుకొని గడుపుతున్నారు. భాషా సమస్యను తేలి కగా అధిగమించడానికి వారు తెలుగు పదాలను నేర్చుకున్నారు. ప్రజలు వారి హిందీ పదాలను కొన్నింటిని తెలుసుకున్నారు. వ్యాపారం అనే వ్యవహారం సాగుతున్నది. ఇట్లా ఎన్నో రంగాలలో ఎంతో వినిమయం, ఇచ్చిపుచ్చుకోవడాలు భాషల విషయంలో కూడా జరగాలి. అనువాదాలతో రెండు భాషలు బలపడతాయి. సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, తత్వశాస్త్రం, న్యాయ రాజకీయ ఆర్థిక రంగాలకు సంబంధించిన ఎన్నో అనువాదాలు అనేక భాషల నుండి మన భాషకు, మన భాష నుండి ఇతర భాషలకు జరిగాయి. వాటివల్ల ప్రయోజనమే తప్ప ఏ భాషకూ నష్టం లేదు. అనువాదం ఈనాడు విద్యార్థుల నుండి మేధావుల వరకు అందరికీ తప్పనిసరి. అందుకే తెలుగు భాషా పరిరక్షణ సమితి అనువాదాల ద్వారా, ఉభయభాషల ద్వారా శిక్షణ వాటి పరిరక్షణకే కాదు ప్రగతికి కూడా అత్యవసరమని విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి, సమాజం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తేవాలని తెలుగు భాష పరిరక్షణ సమితి భావిస్తోంది. 6–11–2016న వరంగల్లులో జరిగే చర్చాగోష్ఠిలో దానిని ప్రధానాంశంగా ప్రతిపాదించబోతోంది. (వ్యాసకర్త : డాక్టర్ గండ్ర లక్ష్మణరావు విశ్రాంత తెలుగు రీడర్, కాకతీయ యూనివర్సిటీ మొబైల్ : 98493 28036)