పార్టీలకు ‘మీడియా’లో ప్రవేశం వద్దు
* కార్పొరేట్ల ప్రవేశానికీ ఆంక్షలుండాలి
* పెయిడ్ న్యూస్‌ను స్పష్టంగా పేర్కొనాలి
* ట్రాయ్ సిఫారసులు
న్యూఢిల్లీ: ప్రచురణ, ప్రసార మీడియాల్లో రాజకీయ జోక్యాన్ని, ఒత్తిడిని నివారించే ఉద్దేశంతో భారత టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) మంగళవారం పలు సిఫారసులు చేసింది. ’మీడియా -యాజమాన్యపరమైన అంశాల’పై ట్రాయ్ రూపొందించిన సిఫార్సులను ట్రాయ్ చెర్మన్ రాహుల్ ఖుల్లర్ విడుదల చేశారు. కార్పొరేట్ యాజమాన్యంలోని మీడియా సంస్థలో పనిచేసే సంపాదకవర్గం, వాస్తవంగా ఎంతమేర స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తోందో పరిశీలించాలని ఈ సందర్భంగా ఖుల్లర్ అభిప్రాయపడ్డారు. సంపాదకవర్గానికి చెందిన న్యూస్ రూమ్‌కు.. యాజమాన్యానికి చెందిన బోర్డ్ రూమ్‌కు మధ్య విభజనరేఖ ఎంత బలహీనంగా ఉందో పరిశీలన జరపాలన్నారు. వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసేటపుడు అది ప్రకటనే అన్న విషయాన్ని స్పష్టంగా వివరించాలని ట్రాయ్ సూచించింది.
ట్రాయ్ సిఫారసుల్లో కొన్ని..
- ఈ రంగంలో రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధం విధించాలి.
- పెయిడ్ వార్తలకు సంబంధించి ఆ వార్త పై భాగంలో స్పష్టంగా కనిపించేలా ‘కింది సమాచారం చెల్లింపు వార్త(పెయిడ్ న్యూస్)’ అని పేర్కొనాలి.
- ఒక నేతకు అనుకూలంగా పెయిడ్ న్యూస్ ప్రచురణ/ ప్రసారమై ఉంటే, ఆ నేతతో పాటు మీడియా సంస్థనూ బాధ్యులను చేయాలి.
- పార్టీలతో పాటు మత సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ నిధులు పొందిన సంస్థలు వార్తాప్రసార, వార్తాప్రచురణల్లోకి రాకుండా నిషేధం విధించాలి. వాటి అనుబంధ సంస్థలకూ అవకాశం ఇవ్వకూడదు.
- అలాంటి సంస్థలకు ఇప్పటికే లెసైన్సులు ఇచ్చి ఉంటే, ఆ రంగం నుంచి బయటకు వచ్చే మార్గం వాటికి చూపాలి.
- ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థల్లో.. అవి ఒకే యాజమాన్య సంస్థ కింద ఉంటే.. అందులో ఒక యజమానికి 32% కన్నా ఎక్కువ వాటా ఉండకూడదు.