transport charges hike
-
నిత్యావసరాలకు రెక్కలు...
- రైల్వే రవాణా చార్జీల మోత - ఆహార ధాన్యాల నుంచి బొగ్గు దాకా -12 కమోడిటీలు మరింత ప్రియం న్యూఢిల్లీ: టికెట్ చార్జీలను పెంచకుండా వదిలేసి ప్రయాణికులను కనికరించినా .. సరుకు రవాణా చార్జీలను మాత్రం భారీగా పెంచడం ద్వారా అందరిపైనా భారం మోపారు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు. రైల్వే బడ్జెట్లో 12 కమోడిటీలపై 0.8 శాతం నుంచి 10 శాతం దాకా రవాణా చార్జీల పెంపును ప్రతిపాదించారు. దీనితో ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, సిమెంటు, బొగ్గు, ఉక్కు మొదలైన వాటన్నింటి ధర లు దాదాపు 10 శాతం దాకా పెరగనున్నాయి. యూరియా రవాణా చార్జీ కూడా 10 శాతం పెంచడం వల్ల సబ్సిడీ భారం కూడా ఆ మేర పెరగనుంది. యూరియా రవాణా చార్జీలకు చెల్లించే సబ్సిడీ ప్రస్తుతం రూ. 3,000 కోట్ల మేర ఉండగా.. తాజా పరిణామంతో మరో రూ. 300 కోట్ల భారం పడనుందని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఐ) డెరైక్టర్ జనరల్ సతీష్ చందర్ తెలిపారు. మరోవైపు, సిమెంటు ఉత్పత్తి వ్యయం ప్రతి బస్తాకి (50 కేజీలు) రూ. 2-4 మేర పెరుగుతుందని దాల్మియా భారత్ సిమెంటు గ్రూప్ సీఈవో మహేంద్ర సింగి తెలిపారు. రేటు పెంచడమనేది డిమాండు, సరఫరాపై ఆధారపడి ఉంటుందని, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు. రవాణా చార్జీల పెంపుతో సిమెంటు రేట్లు బస్తాకి రూ. 5-10 మేర పెరిగే అవకాశాలున్నాయని మరో సిమెంటు తయారీ సంస్థ వర్గాలు తెలిపాయి. ఉక్కు కంపెనీల మిశ్రమ స్పందన.. రైల్వే సరకు రవాణా చార్జీల పెంపుపై ఉక్కు కంపెనీల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రాబోయే ఐదేళ్లలో రైల్వేలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో ఉక్కుకు డిమాండ్ పెరగగలదని కంపెనీలు అభిప్రాయపడ్డాయి. డీజిల్ ధర తగ్గినప్పటికీ రవాణా చార్జీలను తగ్గించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇనుము, ఉక్కు రవాణా చార్జీల పెంపు ప్రభావం తమపై పెద్దగా ఉండబోదని కొన్ని ఉక్కు తయారీ సంస్థలు తెలిపాయి. యూరియా ధరలు పెరగబోవని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. యూరియా ధర ఇప్పుడున్నట్లే టన్నుకు రూ. 5,360గానే కొనసాగుతుందని, సబ్సిడీ భారం పెరుగుతుందని వివరించారు. రైతులకిచ్చే ఎరువుల ధరలు పెరగబోవని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా కూడా తెలిపారు. పెంపు తీరిదీ.. రవాణా చార్జీలు సిమెంటుపై 2.7%, బొగ్గుపై 6.3%, ఇనుము..ఉక్కుపై 0.8%, ఆహార ధాన్యాలు..పప్పు ధాన్యాలపై 10%, వేరుశనగ నూనెపై 2.1%, ఎల్పీజీపై 0.8%, కిరోసిన్‌పై 0.8% మేర పెరగనున్నాయి. మరోవైపు సున్నపురాయి, డోలోమైట్, మ్యాంగనీస్, స్పీడ్ డీజిల్ ఆయిల్ మొదలైన వాటి రవాణా చార్జీలు మాత్రం సుమారు 1 శాతం దాకా తగ్గనున్నాయి. పెరగనున్న విద్యుత్ చార్జీలు.. బొగ్గు రవాణా చార్జీల పెంపు మూలంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయాలూ 2 శాతం మేర (యూనిట్‌కు సుమారు 4-5 పైసలు) పెరుగుతాయని ప్రభుత్వ రంగ ఎన్టీపీసీ తెలిపింది. ఇది రిటైల్ విద్యుత్ టారిఫ్‌లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, విద్యుత్ చార్జీలూ యూనిట్‌కు 5 పైసల మేర పెరగొచ్చని విద్యుదుత్పత్తి కంపెనీల అసోసియేషన్ ఏపీపీ పేర్కొంది. బొగ్గు రవాణా చార్జీలు 6.3 శాతం పెరిగితే విద్యుత్ చార్జీలు యూనిట్‌కు 3-5 పైసల మేర పెరుగుతాయని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ టచ్ తొమాత్సు ఇండియా సీనియర్ డెరైక్టర్ దేబాశీష్ మిశ్రా తెలిపారు. -
సి‘మంట’లు..!
- సిమెంటు, బొగ్గు రవాణాపై చార్జీల మోత - కంపెనీలకు బస్తాకు రూ.7-10 భారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిమాండ్ లేక కష్టాల్లో ఉన్న సిమెంటు పరిశ్రమకు రవాణా చార్జీల రూపంలో రైల్వే మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. సిమెంటు, బొగ్గు రవాణాపై చార్జీల భారం మోపారు. పర్యవసానంగా సిమెంటు ధరలకు రెక్కలు రానున్నాయి. దీనికి ప్రధాన కారణమేమంటే దేశంలో ఉత్పత్తి అవుతున్న సిమెంటులో 60 శాతం దాకా రైలు మార్గం ద్వారానే వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. బొగ్గు క్షేత్రాలు దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బొగ్గు కోసం సిమెంటు కంపెనీలకు రైల్వేలపై ఆధారపడడం తప్ప మరో మార్గం లేదు. చార్జీల ప్రభావం కంపెనీలపై తక్కువేమీ కాదు. నూతన టారిఫ్‌కు తగ్గట్టుగా ధరల్లో మార్పులు చేయడం తప్ప కంపెనీలకు గత్యంతరం లేదు. కొత్త టారిఫ్ కారణంగా తయారీ, సరఫరా వ్యయం కంపెనీలకు ఒక్కో బస్తాపై రూ.7-10 అధికమవుతోంది. ఈ లెక్కన బస్తా ధర కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కంపెనీల మాట ఇదీ కొత్త చార్జీలతో తయారీ వ్యయం తమకు బస్తాపైన రూ.2-4 అధికమవుతుందని దాల్మియా భారత్ సిమెంట్ హోల్‌టైమ్ డైరె క్టర్ మహేంద్ర సింఘి అన్నారు. గిరాకీ-సరఫరా ఆధారంగా కొత్త ధరపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని జేపీ సిమెంట్ హోల్‌టైమ్ డెరైక్టర్ శివ దీక్షిత్ తెలిపారు. కొత్త చార్జీల భారం సిమెంటు, స్టీలు, విద్యుత్ రంగ కంపెనీలపై ఉంటుందని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ డెరైక్టర్ పంకజ్ కులకర్ణి పేర్కొన్నారు. 60 శాతం సిమెంటు రైలు మార్గం ద్వారానే సరఫరా అవడంతో రవాణా చార్జీలు అధికమవుతాయని, తుదకు సాధారణ వినియోగదారుపైనే భారం పడుతుందని అన్నారు. డిమాండ్ అంతంతే.. భారత్‌లో సిమెంటు ప్లాంట్ల వార్షిక స్థాపిత సామర్థ్యం 38 కోట్ల టన్నులున్నట్టు సమాచారం. 2014-15లో సిమెంటు డిమాండ్ 25.4 కోట్ల టన్నులకే పరిమితమవుతుందని బార్క్లేస్ రిసర్చ్ చెబుతోంది. 2013-14తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ వ్యయం పరిమితమవడం, గ్రామీణ భారత్ నుంచి డిమాండ్ లేకపోవడం, నిర్మాణ రంగం పుంజుకోకపోవడంతో సిమెంటు అమ్మకాలపై ఒత్తిడి ఉంటుందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ఒక్కో బ్యాగు ధర ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ.320-350, వైజాగ్‌లో రూ.340-360 మధ్య ఉంది. బెంగళూరు, చెన్నైలో రూ.380-400, కేరళలో అధికంగా రూ.425 దాకా పలుకుతోంది. కష్టాల్లో పరిశ్రమ.. దేశవ్యాప్తంగా సిమెంటు పరిశ్రమ కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లుగా పలు సమస్యలతో పరిశ్రమ సతమతమవుతోంది. ఇక్కడి సిమెంటు కంపెనీల వార్షిక స్థాపిత సామర్థ్యం 8 కోట్ల టన్నులు. ఇందులో ప్లాంట్ల వినియోగం 50-52 శాతానికే పరిమితమైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నష్టాలు మూటగట్టుకోవడంతో కొన్ని కంపెనీలు ప్లాంట్లను సైతం మూసివేశాయని ఒక సంస్థ ఎండీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెల డిమాండు 12 లక్షల టన్నులే ఉందని చెప్పారు. అయిదేళ్ల క్రితం నెలకు 24 లక్షల టన్నులకుపైగా అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. నూతన రవాణా చార్జీలు పరిశ్రమకు గుదిబండగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.