సి‘మంట’లు..! | cement, coal transport charges raised | Sakshi
Sakshi News home page

సి‘మంట’లు..!

Published Fri, Feb 27 2015 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

cement, coal transport charges raised

- సిమెంటు, బొగ్గు రవాణాపై చార్జీల మోత
- కంపెనీలకు బస్తాకు రూ.7-10 భారం

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిమాండ్ లేక కష్టాల్లో ఉన్న సిమెంటు పరిశ్రమకు  రవాణా చార్జీల రూపంలో రైల్వే మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. సిమెంటు, బొగ్గు రవాణాపై చార్జీల భారం మోపారు. పర్యవసానంగా సిమెంటు ధరలకు రెక్కలు రానున్నాయి. దీనికి ప్రధాన కారణమేమంటే దేశంలో ఉత్పత్తి అవుతున్న సిమెంటులో 60 శాతం దాకా రైలు మార్గం ద్వారానే వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. బొగ్గు క్షేత్రాలు దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బొగ్గు కోసం సిమెంటు కంపెనీలకు రైల్వేలపై ఆధారపడడం తప్ప మరో మార్గం లేదు. చార్జీల ప్రభావం కంపెనీలపై తక్కువేమీ కాదు. నూతన టారిఫ్‌కు తగ్గట్టుగా ధరల్లో మార్పులు చేయడం తప్ప కంపెనీలకు గత్యంతరం లేదు. కొత్త టారిఫ్ కారణంగా తయారీ, సరఫరా వ్యయం కంపెనీలకు ఒక్కో బస్తాపై రూ.7-10 అధికమవుతోంది. ఈ లెక్కన బస్తా ధర కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.
 
కంపెనీల మాట ఇదీ  
కొత్త చార్జీలతో తయారీ వ్యయం తమకు బస్తాపైన రూ.2-4 అధికమవుతుందని దాల్మియా భారత్ సిమెంట్ హోల్‌టైమ్ డైరె క్టర్ మహేంద్ర సింఘి అన్నారు. గిరాకీ-సరఫరా ఆధారంగా కొత్త ధరపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని జేపీ సిమెంట్ హోల్‌టైమ్ డెరైక్టర్ శివ దీక్షిత్ తెలిపారు. కొత్త చార్జీల భారం సిమెంటు, స్టీలు, విద్యుత్ రంగ కంపెనీలపై ఉంటుందని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ డెరైక్టర్ పంకజ్ కులకర్ణి పేర్కొన్నారు. 60 శాతం సిమెంటు రైలు మార్గం ద్వారానే సరఫరా అవడంతో రవాణా చార్జీలు అధికమవుతాయని, తుదకు సాధారణ వినియోగదారుపైనే భారం పడుతుందని అన్నారు.
 
డిమాండ్ అంతంతే..
 భారత్‌లో సిమెంటు ప్లాంట్ల వార్షిక స్థాపిత సామర్థ్యం 38 కోట్ల టన్నులున్నట్టు సమాచారం. 2014-15లో సిమెంటు డిమాండ్ 25.4 కోట్ల టన్నులకే పరిమితమవుతుందని బార్‌క్లేస్ రిసర్చ్ చెబుతోంది. 2013-14తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ వ్యయం పరిమితమవడం, గ్రామీణ భారత్ నుంచి డిమాండ్ లేకపోవడం, నిర్మాణ రంగం  పుంజుకోకపోవడంతో సిమెంటు అమ్మకాలపై ఒత్తిడి ఉంటుందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ఒక్కో బ్యాగు ధర ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ.320-350, వైజాగ్‌లో రూ.340-360 మధ్య ఉంది. బెంగళూరు, చెన్నైలో రూ.380-400, కేరళలో అధికంగా రూ.425 దాకా పలుకుతోంది.
 
కష్టాల్లో పరిశ్రమ..

దేశవ్యాప్తంగా సిమెంటు పరిశ్రమ కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లుగా పలు సమస్యలతో పరిశ్రమ సతమతమవుతోంది. ఇక్కడి సిమెంటు కంపెనీల వార్షిక స్థాపిత సామర్థ్యం 8 కోట్ల టన్నులు. ఇందులో ప్లాంట్ల వినియోగం 50-52 శాతానికే పరిమితమైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నష్టాలు మూటగట్టుకోవడంతో కొన్ని కంపెనీలు ప్లాంట్లను సైతం మూసివేశాయని ఒక సంస్థ ఎండీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెల డిమాండు 12 లక్షల టన్నులే ఉందని చెప్పారు. అయిదేళ్ల క్రితం నెలకు 24 లక్షల టన్నులకుపైగా అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. నూతన రవాణా చార్జీలు పరిశ్రమకు గుదిబండగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement