సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల ప్రణాళికతో ప్రవేశపెట్టిన ముందుచూపు బడ్జెట్‌తో రైల్వేకు గొప్ప బలం చేకూరుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ అన్నారు. ఇటివలికాలంలో ఇలాంటి మంచి బడ్జెట్‌ను తాను చూడలేదని పేర్కొన్నారు. రైల్వేలకు జవసత్వాలు నింపే ఆలోచనతో ఉన్న రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు మంచి బడ్జెట్‌ను రూపొందించారని అభినందించారు. గురువారం సాయంత్రం ఆయన రైల్ నిలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 93 శాతంగా ఉన్న నిర్వహణ వ్యయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో 88 శాతానికి తీసుకొచ్చే దిశగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంతకాలంగా అనుసరిస్తున్న చర్యల వల్ల నిర్వహణ వ్యయం 76 శాతానికి చేరిందని తెలిపారు. సరుకు రవాణాపై మంత్రి ప్రధానంగా దృష్టి సారించి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారని, చార్జీల సవరణ నిర్ణయం సబబేనని శ్రీవాస్తవ పేర్కొన్నారు. భారీ పెట్టుబడులను లక్ష్యంగా నిర్దేశించుకున్నందున ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగే అవకాశముందన్నారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలతో ప్రాజెక్టుల కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ఏర్పాటు చే సే అవకాశముందని, దాంతో పనుల్లో జాప్యం తొలగిపోతుందని జీఎం తెలిపారు.