హైదరాబాద్:
- కొంత న్యాయం జరిగింది : టీఆర్‌ఎస్ ఎంపీ కవిత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ప్రస్తుత రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కొంత మేర న్యాయం జరిగింది. రాష్ట్రం విడిపోకపోతే తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టులన్నీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లేవి. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీల సమష్టి కృషి వల్లే తెలంగాణకు కొన్ని రైల్వే ప్రాజెక్టులొచ్చాయి. బడ్జెట్‌లో కొత్త మార్పులను స్వాగతిన్నాం. అయితే రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రాల నుంచి నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం.
అన్యాయాన్ని మోదీకి వివరిస్తాం
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
రైల్వే బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళతాం. త్వరలోనే వైఎస్సార్ సీపీ తెలంగాణ తరఫున మోదీని కలుస్తాం. గతంలో మాదిరిగానే ఈ రైల్వే బడ్జెట్‌లోనూ రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వలేదు.
ఇదో వింత బడ్జెట్: పొన్నాల
కొత్త రైళ్లు, నూతన లైన్ల ప్రస్తావన లేకుండా ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ వింతగా ఉంది. రాష్ట్రానికి కొత్త పథకాలు, రైళ్లు, లైన్లు తీసుకురావడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది. రైల్వేను ప్రైవేటీకరించడానికి కుట్ర జరుగుతోంది.
నిర్మాణాత్మక బడ్జెట్ : డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ
రైల్వే బడ్జెట్ నిర్మాణాత్మకంగా ఉంది. పేదలు, సామాన్య ప్రయాణికులపై చార్జీల భారం లేకుండా దూరదృష్టితో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రెండురాష్ట్రాలు విఫలం: తమ్మినేని వీరభద్రం, సీపీఎం
కేంద్రప్రభుత్వంపై, రైల్వే మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తేవడంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపీలు విఫలమయ్యారు. తెలంగాణ విషయంలో రైల్వే బడ్జెట్ పూర్తినిరాశను మిగిల్చింది.
ప్రజలను మోసం చేసిన బడ్టెట్: చాడ వెంకటరెడ్డి, సీపీఐ
రైల్వే బడ్టెట్‌లో తెలుగుప్రజలను పూర్తిగా మోసం చేశారు. ఈ బడ్జెట్‌లో చిన్నచూపు చూపినందుకు కేంద్రంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం.