Railway budget-2015
-
పెరుగుతున్న ప్రైవేటు సెగ
- కార్మిక సంఘాల కన్నెర్ర.. - ఏప్రిల్ 28న పార్లమెంటు ముట్టడికి పిలుపు సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రైవేటీకరణ దిశగా నడుస్తోందా? రైలు మార్గాల నిర్మాణంలోనూ ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చేసిన ప్రకటన తో ఈ అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కారణంగా రైల్వే ఉద్యోగులు, కార్మికులను అభద్రతా భావం వెంటాడుతోంది. ఇప్పటికే రైల్వేలోని పలు విభాగాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలోని రైల్వే కేటరింగ్ వ్యవస్థ, ఏసీ రైళ్లలో బెడ్ రోల్స్ పంపిణీ ఎప్పుడో ప్రైవేటు పరమయ్యాయి. అలాగే రైల్వే కాలనీల నిర్మాణం, ఫ్లాట్ ఫామ్‌ల నిర్వహణ, స్టేషన్ల పరిధిలోని అన్ని కార్యాలయాల పార్కింగ్ సేవలను కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఇంజన్లు, బోగీలు, వ్యాగన్ల నిర్వహణలో కాంట్రాక్టు సేవలు పెంచారు. డీజిల్ లోకో షెడ్లో దాదాపుగా అన్ని పనులు ప్రైవేటు సిబ్బందితోనే చేయిస్తున్నారు. ఇలా రైల్వేలో ఒక్కో విభాగాన్నీ ప్రైవేటు పరం చేస్తూ వెళుతుండటంతో కార్మిక సంఘాల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో 48 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత ఏకతాటి పైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఏప్రిల్ 28న పార్లమెంట్ ముట్టడికి సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసేందుకు కార్మికులు ఉద్యుక్తులవుతున్నారు. -
బడ్జెట్ నిరాశ పరిచింది: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఎంతో చేస్తారని ఆశించామని, అయితే బడ్జెట్ నిరాశపర్చిందని వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుకతో కలసి ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడారు. రైల్వే బడ్జెట్ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని.. ఉమ్మడి ఏపీకి సంబంధించి దాదాపు రూ.29 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ‘‘అవన్నీ ఈ బడ్జెట్లో చేరుస్తారనుకున్నాం. ఏపీకి ఆరునెలల్లోనే కొత్త రైల్వేజోన్ ఇస్తామని విభజన చట్టంలో ఉన్నా దాని ఊసే లేదు.’’ అని అన్నారు. -
ఇది దార్శనిక బడ్జెట్: శ్రీవాస్తవ
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల ప్రణాళికతో ప్రవేశపెట్టిన ముందుచూపు బడ్జెట్‌తో రైల్వేకు గొప్ప బలం చేకూరుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ అన్నారు. ఇటివలికాలంలో ఇలాంటి మంచి బడ్జెట్‌ను తాను చూడలేదని పేర్కొన్నారు. రైల్వేలకు జవసత్వాలు నింపే ఆలోచనతో ఉన్న రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు మంచి బడ్జెట్‌ను రూపొందించారని అభినందించారు. గురువారం సాయంత్రం ఆయన రైల్ నిలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 93 శాతంగా ఉన్న నిర్వహణ వ్యయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో 88 శాతానికి తీసుకొచ్చే దిశగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంతకాలంగా అనుసరిస్తున్న చర్యల వల్ల నిర్వహణ వ్యయం 76 శాతానికి చేరిందని తెలిపారు. సరుకు రవాణాపై మంత్రి ప్రధానంగా దృష్టి సారించి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారని, చార్జీల సవరణ నిర్ణయం సబబేనని శ్రీవాస్తవ పేర్కొన్నారు. భారీ పెట్టుబడులను లక్ష్యంగా నిర్దేశించుకున్నందున ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగే అవకాశముందన్నారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలతో ప్రాజెక్టుల కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ఏర్పాటు చే సే అవకాశముందని, దాంతో పనుల్లో జాప్యం తొలగిపోతుందని జీఎం తెలిపారు. -
కూతల్లేవు.. అన్నీ కోతలే!
- ఏపీలో ఊసులేని రైల్వే జోన్ - ఒడిశా ఒత్తిడికి కేంద్రం ‘జీ హుజూర్’ - నోరెళ్లబెట్టిన ఏపీ ప్రభుత్వం! జాడలేని కొత్తలైన్లు.. కొత్తరైళ్లు... - కావాల్సినవి సాధించుకోడంలో బాబు సర్కారు ఘోర విఫలం సాక్షి, హైదరాబాద్ : రైల్వే జోన్ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపింది. కొత్త లైన్లు, కొత్త రైళ్ల ఆశలపై నీళ్లుజల్లింది. పెండింగ్ ప్రాజెక్టులకూ అరకొర విదిలింపులతో సరిపెట్టింది. రాష్ట్ర విభజనవల్ల రాజధానితోపాటు అన్నీ కోల్పోయి ఆర్థికలోటులో ఉన్న ఏపీకి రైల్వే బడ్జెట్లోనూ తీవ్ర అన్యాయమే జరిగింది. కొత్త రాష్ట్ర ప్రగతికి, పారిశ్రామిక అభివృద్ధికీ దోహదపడే రాజధాని కనెక్టివిటీ అంశం బడ్జెట్లో ప్రస్తావించనేలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కొత్త రైల్వే జోన్ కోసం విశాఖపట్నం, విజయవాడ డివిజన్లు పోటీ పడ్డాయి. విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నందున విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దీనిని సాధించుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కమిటీతో అధ్యయనం చేయించి నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సందర్భంగా పేర్కొంది. ఈక్రమంలో రైల్వే జోన్‌పై కేంద్రం వేసిన కమిటీ నివేదికను కూడా ఇచ్చింది. అయితే.. సరకు రవాణా ద్వారా తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు అధిక ఆదాయం సమకూర్చుతున్న వాల్తేరు డివిజన్‌ను విడదీయరాదంటూ ఒడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఒడిశా సీఎం, ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వాల్తేరు డివిజన్‌ను తూర్పు కోస్తా జోన్ నుంచి తప్పించవద్దని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాల్సిన మన రాష్ట్ర ప్రభుత్వం.. చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఫలితంగా ఒడిశా ప్రభుత్వం ఒత్తిడికి కేంద్రం తలాడించింది. బాబు ప్రభుత్వం ఘోర విఫలం రైల్వే పరంగా కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కీలకమైన విశాఖ రైల్వే జోన్.. కొత్త రైళ్లు.. కొత్త లైన్లు.. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధుల కోసం ప్రణాళికాబద్ధమైన ప్రయత్నమే చేయలేదు. రైల్వే బడ్జెట్‌కు ముందు రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులపై రైల్వే ఉన్నతాధికారులు, ఎంపీలతో భేటీ నిర్వహించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలి. వాటిని బడ్జెట్లో చేర్చేలా ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. దివంగత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఇలానే చేశారు. అయితే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తాము భాగస్వాములైన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే చేయలేదు. దీనివల్ల నష్టం జరిగే ప్రమాదముందని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విపక్షాలు కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. రాజధాని కనెక్టివిటీ లైన్లు లాంటి కొన్ని అంశాలపై ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకొన్నారు. పెపైచ్చు విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా బాబు ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన బడ్జెట్లో ఉంటుందని, ఆ మేరకు తమకు సమాచారముందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వారం కిందటే ప్రకటించారు. ఇప్పుడు ఆ జోన్ ఊసులేకపోవడం గమనార్హం. జాడలేని రాజధాని కనెక్టివిటీ! రాయలసీమకు, ఇతర ప్రధాన నగరాలకు రాజధానిని అనుసంధానం చేసేందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్తలైన్లకు బడ్జెట్లో చోటు లభించలేదు. గుంటూరు-గుంతకల్లు-ధర్మవరం లైన్, విజయవాడ-గుంటూరు మార్గానికి రాయలసీమ ప్రాంతం నుంచి ఫాస్ట్ట్రాక్తో పాటు ఈ మార్గాన్ని డబ్లింగ్ చేయాలని రాష్ట్రం కోరింది. రాయలసీమ ప్రాంతంలోని 4 జిల్లాల నుంచి రాజధానికి రైల్లో చేరాలంటే 9 గంటలకు పైగా పడుతుంది. ఈ సమయాన్ని 6 గంటలకు తగ్గించేలా ఈ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి పోర్టులతో రైల్వేలైన్ల అనుసంధానం కీలకం. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నేపధ్యంలో కృష్ణపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టుల నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా సరుకు తరలించేందుకు రైల్వే లైన్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. కొన్ని మార్గాల్లో డబుల్ లైన్లు మాత్రమే ఉండటం వల్ల గూడ్స్ రైళ్లను, ఎక్స్‌ప్రెస్ రైళ్ళను క్రాసింగ్‌ల కోసం స్టేషన్లలో గంటల తరబడి నిలిపేయాల్సి వస్తోంది. ఈ సమస్య పరి ష్కారానికి ట్రిబుల్ లైను ఏర్పాటు ఒక్కటే పరిష్కా ర మార్గం. అయితే ఈ బడ్జెట్లో పెద్దగా ట్రిబుల్లైన్లు మంజూరు కాలేదు. విజయవాడ-కాజీపేట ట్రిపుల్ లైను ప్రకటించినా ఈ లైను 2006-07 నాటి ప్రతిపాదనే. దీన్ని పూర్తిచేసేందుకు రూ.1,054 కోట్లు అవసరం కాగా ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. అరకొర విదిలింపులతో.. పెండింగ్ రైల్వేలైన్లకు కూడా ప్రస్తుత బడ్జెట్లో అరకొర కేటాయింపులే వచ్చాయి. బడ్జెట్లో కేటాయించిన నిధులు ఆయా ప్రాజెక్టులకు ఏమూలకూ చాలని రీతిలో ఉన్నాయి. ఫలితంగా ఈ మార్గాలు ఎప్పటికి పూర్తవుతాయో ప్రభుత్వాలకే తెలియాలి. ఏపీకి అన్యాయం జరిగింది : చంద్రబాబు రైల్వే బడ్జెట్లో ఏపీకి అన్యాయం చేశారు. సప్లిమెంటరీ బడ్జెట్లోనైనా న్యాయం చేయాలని రైల్వే మంత్రిని, కేంద్రాన్ని కోరతాం. రైల్వే బడ్జెట్లో గత పదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడూ అదే రీతిలో అన్యాయం చేయడం దారుణం. రాష్ట్రానికి స్పీడ్ రైళ్లు మంజూరు చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని తాము పంపిన ప్రతిపాదనలను పట్టించుకోకపోవడం దారుణం. బడ్జెట్లో సేవల(సర్వీసెస్)కు ఎక్కువగా నిధులు కేటాయించారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చడానికి కట్టుబడి ఉన్నాం. ఇందుకోసం రైల్వే కార్గో అవసరం. -
బడ్జెట్ పై తెలంగాణ నేతల స్పందన
హైదరాబాద్: - కొంత న్యాయం జరిగింది : టీఆర్ఎస్ ఎంపీ కవిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ప్రస్తుత రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కొంత మేర న్యాయం జరిగింది. రాష్ట్రం విడిపోకపోతే తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టులన్నీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లేవి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీల సమష్టి కృషి వల్లే తెలంగాణకు కొన్ని రైల్వే ప్రాజెక్టులొచ్చాయి. బడ్జెట్లో కొత్త మార్పులను స్వాగతిన్నాం. అయితే రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రాల నుంచి నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం. అన్యాయాన్ని మోదీకి వివరిస్తాం వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళతాం. త్వరలోనే వైఎస్సార్ సీపీ తెలంగాణ తరఫున మోదీని కలుస్తాం. గతంలో మాదిరిగానే ఈ రైల్వే బడ్జెట్లోనూ రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇదో వింత బడ్జెట్: పొన్నాల కొత్త రైళ్లు, నూతన లైన్ల ప్రస్తావన లేకుండా ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ వింతగా ఉంది. రాష్ట్రానికి కొత్త పథకాలు, రైళ్లు, లైన్లు తీసుకురావడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. రైల్వేను ప్రైవేటీకరించడానికి కుట్ర జరుగుతోంది. నిర్మాణాత్మక బడ్జెట్ : డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రైల్వే బడ్జెట్ నిర్మాణాత్మకంగా ఉంది. పేదలు, సామాన్య ప్రయాణికులపై చార్జీల భారం లేకుండా దూరదృష్టితో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెండురాష్ట్రాలు విఫలం: తమ్మినేని వీరభద్రం, సీపీఎం కేంద్రప్రభుత్వంపై, రైల్వే మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తేవడంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపీలు విఫలమయ్యారు. తెలంగాణ విషయంలో రైల్వే బడ్జెట్ పూర్తినిరాశను మిగిల్చింది. ప్రజలను మోసం చేసిన బడ్టెట్: చాడ వెంకటరెడ్డి, సీపీఐ రైల్వే బడ్టెట్‌లో తెలుగుప్రజలను పూర్తిగా మోసం చేశారు. ఈ బడ్జెట్లో చిన్నచూపు చూపినందుకు కేంద్రంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. -
తెలంగాణ ఆశలు ఆవిరి
- కనికరించని రైల్వే మంత్రి - ప్రాజెక్టులకు బడ్జెట్లో దక్కని ప్రాధాన్యం - పాత వాటికీ కంటితుడుపు కేటాయింపులు - కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు - మనోహరాబాద్-కొత్తపల్లి లైనుకూ అరకొర నిధులు - సీఎం విన్నపాలూ బుట్టదాఖలు సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ సంస్కరణల హోరులో తెలంగాణ రైల్వే ఆశలు కొట్టుకుపోయాయి. కొత్త రైళ్ల ఊసేలేని బడ్జెట్‌తో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఏ దశలోనూ తెలంగాణపై జాలి చూపలేదు. కనీసం దశాబ్దాలుగా పెండింగులో ఉన్న పాత ప్రాజెక్టులకైనా నిధులు విదిల్చలేదు. చివరికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పదేపదే విజ్ఞప్తి చేసి, స్వయంగా అందించిన విన్నపాలను కూడా నిర్దయగా బుట్టదాఖలు చేశారు. వెరసి మోదీ పాలనలోనూ తెలంగాణ రైల్వే తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 25 ఏళ్ల క్రితం మంజూరైన పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లైన్ పూర్తి అయ్యేలా రూ. 141 కోట్లు కేటాయించడమొక్కటే రాష్ట్రానికి ఏకైక ఓదార్పు. తీవ్ర రైల్ ట్రాఫిక్‌తో అల్లాడుతున్న విజయవాడ-కాజీపేట-బల్లార్షా మార్గంలో మూడో లైన్ నిర్మాణానికి రూ. 146 కోట్లు కేటాయించడం క ంటితుడుపుగా మిగిలింది. ఇవి మినహా తెలంగాణకు కేటాయించిన, ప్రకటించిన చెప్పుకోదగ్గ లైన్లు, ఇతర పనులేవీ లేవు. రాష్ట్ర విభజన సమయంలో గత యూపీఏ-2 ప్రభుత్వం ప్రతిపాదించిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా ఒట్టిదేనని తేలిపోయింది. దాని సాధ్యాసాధ్యాలపై అప్పట్లో శరవేగంగా ఏర్పాటైన కమిటీ కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో దానిపై ఆశలు సన్నగిల్లలేదు. తాజా బడ్జెట్లో కనీసం రేఖామాత్రంగానైనా దాని ప్రస్తావన ఉంటుందని ప్రజలు ఆశించినా ఆ ఊసే లేదు. మనోహరాబాద్-కొత్తపల్లికి మళ్లీ నిరాశే హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు నేరుగా రైల్వే మార్గంతో అనుసంధానించే మనోహరాబాద్-కొత్తపల్లి లైను విషయంలో తాజా బడ్జెట్లో కూడా అడుగు ముందుకు పడలేదు. సిద్దిపేట, గజ్వేల్ మీదుగా సాగే ఈ లైను కేసీఆర్ కలల ప్రాజెక్టు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండగా ఈ లైన్ సర్వే పనులు మంజూరు కాగా ఇప్పటికీ పురోగతి లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రంపై ఒత్తిడి తేవటంతో గత బడ్జెట్లో రూ. 10 కోట్లు కేటాయించారు. ఈసారి భారీగా నిధులివ్వాలని సీఎం స్వయం గా కోరినా కేవలం రూ. 20 కోట్లతో సరిపెట్టారు. ఇక హైదరాబాద్-మహబూబ్‌నగర్ మార్గంలో రెండో లైన్ నిర్మాణానికి రూ. 27.44 కోట్లను కేటాయించారు. రూ. 1200 కోట్లు అవసరమయ్యే 110 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు ఇంత తక్కువ నిధులివ్వడం నిరాశపరిచింది. లెవల్ క్రాసింగ్స్‌పై దృష్టి గత సంవత్సరం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొని 18 మంది చనిపోయిన దుర్ఘటన నేపథ్యంలో ఆర్ఓబీ/ఆర్యూబీలకు రైల్వేమంత్రి ప్రాధాన్యతనిచ్చా రు. బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు 38 ఆర్ఓబీ/ఆర్‌యూబీలను మంజూరు చేశారు. వీటిని నిర్మించేందుకు రూ. 1587 కోట్లు అవసరమని అంచనా వేశారు. తొలి విడతగా రూ. 101.67 కోట్లు కేటాయించారు. ఇందులో తెలంగాణకు 14 కేటాయించినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు పంపిన ప్రతిపాదనల్లో 15 ఆర్ఓబీ/ఆర్‌యూబీలను ప్రస్తావించగా 14 మంజూరు కావడం విశేషం. రైలు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వీటిని నిర్మిస్తారు. -
దూసుకురాని ‘బులెట్లు’
- సెమీ బులెట్ రైళ్ల ఊసే ఎత్తని రైల్వే మంత్రి సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఏడాది కిందట రైల్వే మంత్రి హోదాలో సదానంద గౌడ ఘనంగా ప్రకటించిన సెమీ బులెట్ రైళ్లు ఇప్పుడు మొహం చాటేశాయి. దక్షిణ మధ్య రైల్వేకు రెండు రైళ్లను కూడా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి చెన్నై, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మార్గాలను సిద్ధం చేసి హైస్పీడ్ (సెమీ బులెట్) రైళ్లను ప్రవేశపెడతామని ప్రకటించారు. 200 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ రైళ్లు వెళ్లే మార్గాలను బాగా మెరుగు పరచాల్సి ఉంటుంది. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు ఉండకూడదు. ఇదంతా జరగాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి. ఆ బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించి ఉసూరుమనిపించారు. తాజాగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కనీసం వాటి ఊసెత్తలేదు. ఆ రెండు ప్రతిపాదనలను దాదాపు విరమించుకున్నారని తెలుస్తోంది. కొన్ని నిర్ధారిత మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్ల వరకు పెంచనున్నట్టు మంత్రి ప్రకటించారు. అందులో ఈ మార్గాలను కూడా చేర్చి సెమీ బులెట్ రైళ్ల ప్రతిపాదనకు తెరదించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ మార్గాల్లో బులెట్ రైళ్లను నడపాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్టు సమాచారం. అందుకే బడ్జెట్లో ఆ ప్రతిపాదనలకు నయా పైసా కూడా విదల్చలేదు. -
తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశ...
- కొత్త ప్రాజెక్టుల ఊసే లేని రైల్వే బడ్జెట్ - అరకొరగా నిధుల విదిలింపు - కొన్ని సర్వేలకు రూ.వెయ్యే - కొత్త జోన్, కొత్త రైళ్ల ప్రస్తావనే లేదు సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్లో యథావిధిగా తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. అరకొర విదిలింపులతో అవిభాజ్య రాష్ట్రం దశాబ్దాలుగా అన్యాయానికి గురికాగా ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురైంది. చివరికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాల్సిన కొత్త రైల్వే జోన్ ప్రకటన కూడా లేదు. అలాగే తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ గానీ, రైల్ నెట్వర్క్ విస్తరణ హామీకిగానీ ఈ రైల్వే బడ్జెట్లో మోక్షం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ పేర్కొంది. బడ్జెట్లో దాని ఊసు కూడా లేదు. మొత్తంగా పాత ప్రాజెక్టులకే అరకొర విదిలింపులు మినహా రెండు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదు. ఒకటీ రెండు కొత్త సర్వే పనులు మంజూరు చేసినా వాటికి కేటాయింపులు మాత్రం బహు స్వల్పం. ఇదివరకే మంజూరైన సర్వే పనులకు కొన్నింటికి కేవలం వెయ్యి రూపాయలతో సరిపెట్టడం విస్మయపరుస్తోంది. మొత్తం పాతవి, కొత్తవి సర్వే పనులకు రూ. 15.26 కోట్లు అవసరం కాగా కేవలం రూ. 1.13 కోట్లను కేటాయించారు. ఇలా ఏటా కోటి కేటాయిస్తే సర్వే పనులు పూర్తయ్యేసరికే ఇంకో పదేళ్లు పడుతుందని భావించాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఎదురుచూసిన పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావనేదీ రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చోటుచేసుకోలేదు. గత బడ్జెట్ ప్రసంగంలో తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను మంత్రి ప్రస్తావించారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 20,680 కోట్ల అంచనా వ్యయం కలిగిన 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. రెండు కొత్త రాష్ట్రాల అధికారులతో సమన్వయ సమావేశాలు జరిపి వాటి అవసరాలను తెలుసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. ఇప్పుడా సంగతే మరిచారు. గణనీయంగా కేటాయింపులు జరిపిన వాటిలో తెలంగాణ విషయానికి వస్తే పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైను నిర్మాణానికి రూ. 140 కోట్లు, మేళ్లచెర్వు-విష్ణుపురం లైనుకు రూ. 100 కోట్లు కేటాయించారు. కొత్తగా సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను మంజూరు చేశారు. మన్మాడ్-ముద్కేడ్ మధ్య, పగిడిపల్లి-నల్లపాడు మధ్య విద్యుదీకరణ పనులు మంజూరు చేశారు. కొత్త రైళ్లకు, కొత్త రైల్వే లైన్లకు చాలా డిమాండ్ ఉందని, అయితే వీటిపై ఇంకా సమీక్ష జరుగుతోందని, ఈ బడ్జెట్ సెషన్లోనే వాటిని ప్రకటిస్తామని రైల్వే మంత్రి చెప్పారు. తాము ప్రజాకర్షక ప్రకటనలకు వ్యతిరేకమని, రైల్వేలను పటిష్టం చేయడంలో భాగంగా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తామన్నారు. ఏపీ, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులపై రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టల్‌ను విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. నిర్వహణ నిష్పత్తి లక్ష్యం 88.5 % న్యూఢిల్లీ: రాబోయే ఆర్థిక సంవత్సరం(2015-16)లో నిర్వహణ నిష్పత్తిని 88.5 శాతం స్థాయికి తగ్గించుకోవాలని రైల్వేలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. గడిచిన తొమ్మిదేళ్లలో ఇదే అత్యుత్తమం కానుంది. సామర్ధ్యం మెరుగుదలలో నిర్వహణ నిష్పత్తిది కీలకపాత్ర. దీనిని 2014-15 ఆర్థిక సంవత్సరంలో 91.8 శాతంగా నిర్దేశించుకోగా అంతకుముందు సంవత్సరం(2013-14)లో 93.6 శాతంగా ఉండింది. నిర్వహణ నిష్పత్తిని తగ్గించుకోవడం సంస్థ లాభాలబాటలో పయనించడానికి దోహదపడుతుంది. ఉదాహరణకు నిర్వహణ నిష్పత్తి 93.6 శాతంగా ఉంటే.. భారత రైల్వేలు ఆర్జిస్తున్న ప్రతి రూపాయిలో కేవలం 6.4 పైసలు మాత్రమే మిగులుతుంది. నిర్వహణ నిష్పత్తి తగ్గిన పక్షంలో ఈ మిగులు ఎక్కువగా ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఈ నిష్పత్తి 70 నుంచి 80 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా పార్లమెంటుకు రైల్వే బడ్జెట్‌ను సమర్పించిన సందర్భంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ.. తమ మంత్రిత్వశాఖ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన నిర్వహణ, వ్యాపార దక్షతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ నిష్పత్తిని 88.5 శాతంగా నిర్దేశించుకున్నట్టు చెప్పారు. గత తొమ్మిదేళ్లలో ఇదే ఉత్తమ నిర్వహణ నిష్పత్తిగా నిలవడమేగాక ఆరవ వేతన కమిషన్ తరువాత ఇదే అత్యుత్తమమైనదిగా నిలుస్తుందని వివరించారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో, జవాబుదారీతనాన్ని పెంచడంలో, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను మెరుగుపరచడంలో మార్పులు రానంతకాలం నిర్వహణ సామర్ధ్యంలో నిరంతర మెరుగుదలను రైల్వేలు సాధించలేవన్నారు. -
నిత్యావసరాలకు రెక్కలు...
- రైల్వే రవాణా చార్జీల మోత - ఆహార ధాన్యాల నుంచి బొగ్గు దాకా -12 కమోడిటీలు మరింత ప్రియం న్యూఢిల్లీ: టికెట్ చార్జీలను పెంచకుండా వదిలేసి ప్రయాణికులను కనికరించినా .. సరుకు రవాణా చార్జీలను మాత్రం భారీగా పెంచడం ద్వారా అందరిపైనా భారం మోపారు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు. రైల్వే బడ్జెట్లో 12 కమోడిటీలపై 0.8 శాతం నుంచి 10 శాతం దాకా రవాణా చార్జీల పెంపును ప్రతిపాదించారు. దీనితో ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, సిమెంటు, బొగ్గు, ఉక్కు మొదలైన వాటన్నింటి ధర లు దాదాపు 10 శాతం దాకా పెరగనున్నాయి. యూరియా రవాణా చార్జీ కూడా 10 శాతం పెంచడం వల్ల సబ్సిడీ భారం కూడా ఆ మేర పెరగనుంది. యూరియా రవాణా చార్జీలకు చెల్లించే సబ్సిడీ ప్రస్తుతం రూ. 3,000 కోట్ల మేర ఉండగా.. తాజా పరిణామంతో మరో రూ. 300 కోట్ల భారం పడనుందని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఐ) డెరైక్టర్ జనరల్ సతీష్ చందర్ తెలిపారు. మరోవైపు, సిమెంటు ఉత్పత్తి వ్యయం ప్రతి బస్తాకి (50 కేజీలు) రూ. 2-4 మేర పెరుగుతుందని దాల్మియా భారత్ సిమెంటు గ్రూప్ సీఈవో మహేంద్ర సింగి తెలిపారు. రేటు పెంచడమనేది డిమాండు, సరఫరాపై ఆధారపడి ఉంటుందని, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు. రవాణా చార్జీల పెంపుతో సిమెంటు రేట్లు బస్తాకి రూ. 5-10 మేర పెరిగే అవకాశాలున్నాయని మరో సిమెంటు తయారీ సంస్థ వర్గాలు తెలిపాయి. ఉక్కు కంపెనీల మిశ్రమ స్పందన.. రైల్వే సరకు రవాణా చార్జీల పెంపుపై ఉక్కు కంపెనీల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రాబోయే ఐదేళ్లలో రైల్వేలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో ఉక్కుకు డిమాండ్ పెరగగలదని కంపెనీలు అభిప్రాయపడ్డాయి. డీజిల్ ధర తగ్గినప్పటికీ రవాణా చార్జీలను తగ్గించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇనుము, ఉక్కు రవాణా చార్జీల పెంపు ప్రభావం తమపై పెద్దగా ఉండబోదని కొన్ని ఉక్కు తయారీ సంస్థలు తెలిపాయి. యూరియా ధరలు పెరగబోవని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. యూరియా ధర ఇప్పుడున్నట్లే టన్నుకు రూ. 5,360గానే కొనసాగుతుందని, సబ్సిడీ భారం పెరుగుతుందని వివరించారు. రైతులకిచ్చే ఎరువుల ధరలు పెరగబోవని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా కూడా తెలిపారు. పెంపు తీరిదీ.. రవాణా చార్జీలు సిమెంటుపై 2.7%, బొగ్గుపై 6.3%, ఇనుము..ఉక్కుపై 0.8%, ఆహార ధాన్యాలు..పప్పు ధాన్యాలపై 10%, వేరుశనగ నూనెపై 2.1%, ఎల్పీజీపై 0.8%, కిరోసిన్‌పై 0.8% మేర పెరగనున్నాయి. మరోవైపు సున్నపురాయి, డోలోమైట్, మ్యాంగనీస్, స్పీడ్ డీజిల్ ఆయిల్ మొదలైన వాటి రవాణా చార్జీలు మాత్రం సుమారు 1 శాతం దాకా తగ్గనున్నాయి. పెరగనున్న విద్యుత్ చార్జీలు.. బొగ్గు రవాణా చార్జీల పెంపు మూలంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయాలూ 2 శాతం మేర (యూనిట్‌కు సుమారు 4-5 పైసలు) పెరుగుతాయని ప్రభుత్వ రంగ ఎన్టీపీసీ తెలిపింది. ఇది రిటైల్ విద్యుత్ టారిఫ్‌లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, విద్యుత్ చార్జీలూ యూనిట్‌కు 5 పైసల మేర పెరగొచ్చని విద్యుదుత్పత్తి కంపెనీల అసోసియేషన్ ఏపీపీ పేర్కొంది. బొగ్గు రవాణా చార్జీలు 6.3 శాతం పెరిగితే విద్యుత్ చార్జీలు యూనిట్‌కు 3-5 పైసల మేర పెరుగుతాయని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ టచ్ తొమాత్సు ఇండియా సీనియర్ డెరైక్టర్ దేబాశీష్ మిశ్రా తెలిపారు. -
సి‘మంట’లు..!
- సిమెంటు, బొగ్గు రవాణాపై చార్జీల మోత - కంపెనీలకు బస్తాకు రూ.7-10 భారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిమాండ్ లేక కష్టాల్లో ఉన్న సిమెంటు పరిశ్రమకు రవాణా చార్జీల రూపంలో రైల్వే మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. సిమెంటు, బొగ్గు రవాణాపై చార్జీల భారం మోపారు. పర్యవసానంగా సిమెంటు ధరలకు రెక్కలు రానున్నాయి. దీనికి ప్రధాన కారణమేమంటే దేశంలో ఉత్పత్తి అవుతున్న సిమెంటులో 60 శాతం దాకా రైలు మార్గం ద్వారానే వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. బొగ్గు క్షేత్రాలు దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బొగ్గు కోసం సిమెంటు కంపెనీలకు రైల్వేలపై ఆధారపడడం తప్ప మరో మార్గం లేదు. చార్జీల ప్రభావం కంపెనీలపై తక్కువేమీ కాదు. నూతన టారిఫ్‌కు తగ్గట్టుగా ధరల్లో మార్పులు చేయడం తప్ప కంపెనీలకు గత్యంతరం లేదు. కొత్త టారిఫ్ కారణంగా తయారీ, సరఫరా వ్యయం కంపెనీలకు ఒక్కో బస్తాపై రూ.7-10 అధికమవుతోంది. ఈ లెక్కన బస్తా ధర కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కంపెనీల మాట ఇదీ కొత్త చార్జీలతో తయారీ వ్యయం తమకు బస్తాపైన రూ.2-4 అధికమవుతుందని దాల్మియా భారత్ సిమెంట్ హోల్‌టైమ్ డైరె క్టర్ మహేంద్ర సింఘి అన్నారు. గిరాకీ-సరఫరా ఆధారంగా కొత్త ధరపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని జేపీ సిమెంట్ హోల్‌టైమ్ డెరైక్టర్ శివ దీక్షిత్ తెలిపారు. కొత్త చార్జీల భారం సిమెంటు, స్టీలు, విద్యుత్ రంగ కంపెనీలపై ఉంటుందని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ డెరైక్టర్ పంకజ్ కులకర్ణి పేర్కొన్నారు. 60 శాతం సిమెంటు రైలు మార్గం ద్వారానే సరఫరా అవడంతో రవాణా చార్జీలు అధికమవుతాయని, తుదకు సాధారణ వినియోగదారుపైనే భారం పడుతుందని అన్నారు. డిమాండ్ అంతంతే.. భారత్‌లో సిమెంటు ప్లాంట్ల వార్షిక స్థాపిత సామర్థ్యం 38 కోట్ల టన్నులున్నట్టు సమాచారం. 2014-15లో సిమెంటు డిమాండ్ 25.4 కోట్ల టన్నులకే పరిమితమవుతుందని బార్క్లేస్ రిసర్చ్ చెబుతోంది. 2013-14తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ వ్యయం పరిమితమవడం, గ్రామీణ భారత్ నుంచి డిమాండ్ లేకపోవడం, నిర్మాణ రంగం పుంజుకోకపోవడంతో సిమెంటు అమ్మకాలపై ఒత్తిడి ఉంటుందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ఒక్కో బ్యాగు ధర ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ.320-350, వైజాగ్‌లో రూ.340-360 మధ్య ఉంది. బెంగళూరు, చెన్నైలో రూ.380-400, కేరళలో అధికంగా రూ.425 దాకా పలుకుతోంది. కష్టాల్లో పరిశ్రమ.. దేశవ్యాప్తంగా సిమెంటు పరిశ్రమ కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లుగా పలు సమస్యలతో పరిశ్రమ సతమతమవుతోంది. ఇక్కడి సిమెంటు కంపెనీల వార్షిక స్థాపిత సామర్థ్యం 8 కోట్ల టన్నులు. ఇందులో ప్లాంట్ల వినియోగం 50-52 శాతానికే పరిమితమైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నష్టాలు మూటగట్టుకోవడంతో కొన్ని కంపెనీలు ప్లాంట్లను సైతం మూసివేశాయని ఒక సంస్థ ఎండీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెల డిమాండు 12 లక్షల టన్నులే ఉందని చెప్పారు. అయిదేళ్ల క్రితం నెలకు 24 లక్షల టన్నులకుపైగా అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. నూతన రవాణా చార్జీలు పరిశ్రమకు గుదిబండగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. -
ఇంటి ముందూ రైలు కూత..
న్యూఢిల్లీ : ఇంటి ముందు నుంచే కూ.. చుక్.. చుక్ అంటూ కూత పెడుతూ రైలు వెళితే ఎలా ఉంటుంది.. భలే కదా! ఇదే కాదు మరెన్నో విశేషాలతో అలరిస్తోంది పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే. ఇప్పటి కొత్తతరం డీజిల్ ఇంజిన్లతో పాటు బ్రిటిష్ కాలంనాటి నాలుగు బీ క్లాస్ ఆవిరి ఇంజిన్లతో కేవలం 78 కిలోమీటర్ల పొడవున్న ట్రాక్‌పై ఈ రైళ్లు అటూ ఇటూ తిరుగుతుంటాయి. అంతేకాదు 100 మీటర్ల నుంచి 2,200 మీటర్ల ఎత్తు పల్లాలతో.. దేశంలోనే ఎత్తయిన రైల్వే స్టేషన్‌కు తీసుకెళతాయి. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ‘టాయ్’ రైలును కూడా నడుపుతున్నారు. రెండు అడుగుల వెడల్పున పట్టాలుండే ఈ నేరోగేజ్ రైలు మార్గాన్ని 1879లో నిర్మించారు.. అన్నట్టూ దీనికి ప్రపంచ వారసత్వ హోదా కూడా ఉంది.