- కొత్త ప్రాజెక్టుల ఊసే లేని రైల్వే బడ్జెట్
- అరకొరగా నిధుల విదిలింపు
- కొన్ని సర్వేలకు రూ.వెయ్యే
- కొత్త జోన్, కొత్త రైళ్ల ప్రస్తావనే లేదు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్‌లో యథావిధిగా తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. అరకొర విదిలింపులతో అవిభాజ్య రాష్ట్రం దశాబ్దాలుగా అన్యాయానికి గురికాగా ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురైంది. చివరికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాల్సిన కొత్త రైల్వే జోన్ ప్రకటన కూడా లేదు. అలాగే తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ గానీ, రైల్ నెట్‌వర్క్ విస్తరణ హామీకిగానీ ఈ రైల్వే బడ్జెట్‌లో మోక్షం లభించలేదు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ పేర్కొంది. బడ్జెట్‌లో దాని ఊసు కూడా లేదు. మొత్తంగా పాత ప్రాజెక్టులకే అరకొర విదిలింపులు మినహా రెండు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదు. ఒకటీ రెండు కొత్త సర్వే పనులు మంజూరు చేసినా వాటికి కేటాయింపులు మాత్రం బహు స్వల్పం. ఇదివరకే మంజూరైన సర్వే పనులకు కొన్నింటికి కేవలం వెయ్యి రూపాయలతో సరిపెట్టడం విస్మయపరుస్తోంది. మొత్తం పాతవి, కొత్తవి సర్వే పనులకు రూ. 15.26 కోట్లు అవసరం కాగా కేవలం రూ. 1.13 కోట్లను కేటాయించారు. ఇలా ఏటా కోటి కేటాయిస్తే సర్వే పనులు పూర్తయ్యేసరికే ఇంకో పదేళ్లు పడుతుందని భావించాల్సి వస్తోంది.
తెలుగు రాష్ట్రాలు ఎదురుచూసిన పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావనేదీ రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చోటుచేసుకోలేదు. గత బడ్జెట్ ప్రసంగంలో తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను మంత్రి ప్రస్తావించారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 20,680 కోట్ల అంచనా వ్యయం కలిగిన 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. రెండు కొత్త రాష్ట్రాల అధికారులతో సమన్వయ సమావేశాలు జరిపి వాటి అవసరాలను తెలుసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. ఇప్పుడా సంగతే మరిచారు.
గణనీయంగా కేటాయింపులు జరిపిన వాటిలో తెలంగాణ విషయానికి వస్తే పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైను నిర్మాణానికి రూ. 140 కోట్లు, మేళ్లచెర్వు-విష్ణుపురం లైనుకు రూ. 100 కోట్లు కేటాయించారు. కొత్తగా సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను మంజూరు చేశారు. మన్మాడ్-ముద్కేడ్ మధ్య, పగిడిపల్లి-నల్లపాడు మధ్య విద్యుదీకరణ పనులు మంజూరు చేశారు. కొత్త రైళ్లకు, కొత్త రైల్వే లైన్లకు చాలా డిమాండ్ ఉందని, అయితే వీటిపై ఇంకా సమీక్ష జరుగుతోందని, ఈ బడ్జెట్ సెషన్‌లోనే వాటిని ప్రకటిస్తామని రైల్వే మంత్రి చెప్పారు. తాము ప్రజాకర్షక ప్రకటనలకు వ్యతిరేకమని, రైల్వేలను పటిష్టం చేయడంలో భాగంగా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తామన్నారు. ఏపీ, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులపై రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టల్‌ను విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు.
నిర్వహణ నిష్పత్తి లక్ష్యం 88.5 %
న్యూఢిల్లీ: రాబోయే ఆర్థిక సంవత్సరం(2015-16)లో నిర్వహణ నిష్పత్తిని 88.5 శాతం స్థాయికి తగ్గించుకోవాలని రైల్వేలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. గడిచిన తొమ్మిదేళ్లలో ఇదే అత్యుత్తమం కానుంది. సామర్ధ్యం మెరుగుదలలో నిర్వహణ నిష్పత్తిది కీలకపాత్ర. దీనిని 2014-15 ఆర్థిక సంవత్సరంలో 91.8 శాతంగా నిర్దేశించుకోగా అంతకుముందు సంవత్సరం(2013-14)లో 93.6 శాతంగా ఉండింది. నిర్వహణ నిష్పత్తిని తగ్గించుకోవడం సంస్థ లాభాలబాటలో పయనించడానికి దోహదపడుతుంది. ఉదాహరణకు నిర్వహణ నిష్పత్తి 93.6 శాతంగా ఉంటే.. భారత రైల్వేలు ఆర్జిస్తున్న ప్రతి రూపాయిలో కేవలం 6.4 పైసలు మాత్రమే మిగులుతుంది. నిర్వహణ నిష్పత్తి తగ్గిన పక్షంలో ఈ మిగులు ఎక్కువగా ఉంటుంది.
పాశ్చాత్య దేశాల్లో ఈ నిష్పత్తి 70 నుంచి 80 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా పార్లమెంటుకు రైల్వే బడ్జెట్‌ను సమర్పించిన సందర్భంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ.. తమ మంత్రిత్వశాఖ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన నిర్వహణ, వ్యాపార దక్షతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ నిష్పత్తిని 88.5 శాతంగా నిర్దేశించుకున్నట్టు చెప్పారు. గత తొమ్మిదేళ్లలో ఇదే ఉత్తమ నిర్వహణ నిష్పత్తిగా నిలవడమేగాక ఆరవ వేతన కమిషన్ తరువాత ఇదే అత్యుత్తమమైనదిగా నిలుస్తుందని వివరించారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో, జవాబుదారీతనాన్ని పెంచడంలో, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను మెరుగుపరచడంలో మార్పులు రానంతకాలం నిర్వహణ సామర్ధ్యంలో నిరంతర మెరుగుదలను రైల్వేలు సాధించలేవన్నారు.