- కార్మిక సంఘాల కన్నెర్ర..
- ఏప్రిల్ 28న పార్లమెంటు ముట్టడికి పిలుపు
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రైవేటీకరణ దిశగా నడుస్తోందా? రైలు మార్గాల నిర్మాణంలోనూ ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చేసిన ప్రకటన తో ఈ అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కారణంగా రైల్వే ఉద్యోగులు, కార్మికులను అభద్రతా భావం వెంటాడుతోంది. ఇప్పటికే రైల్వేలోని పలు విభాగాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి.
ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలోని రైల్వే కేటరింగ్ వ్యవస్థ, ఏసీ రైళ్లలో బెడ్ రోల్స్ పంపిణీ ఎప్పుడో ప్రైవేటు పరమయ్యాయి. అలాగే రైల్వే కాలనీల నిర్మాణం, ఫ్లాట్ ఫామ్‌ల నిర్వహణ, స్టేషన్ల పరిధిలోని అన్ని కార్యాలయాల పార్కింగ్ సేవలను కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఇంజన్లు, బోగీలు, వ్యాగన్ల నిర్వహణలో కాంట్రాక్టు సేవలు పెంచారు. డీజిల్ లోకో షెడ్‌లో దాదాపుగా అన్ని పనులు ప్రైవేటు సిబ్బందితోనే చేయిస్తున్నారు. ఇలా రైల్వేలో ఒక్కో విభాగాన్నీ ప్రైవేటు పరం చేస్తూ వెళుతుండటంతో కార్మిక సంఘాల్లో ఆందోళన పెరుగుతోంది.
దీంతో 48 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత ఏకతాటి పైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఏప్రిల్ 28న పార్లమెంట్ ముట్టడికి సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసేందుకు కార్మికులు ఉద్యుక్తులవుతున్నారు.