- ఏపీలో ఊసులేని రైల్వే జోన్
- ఒడిశా ఒత్తిడికి కేంద్రం ‘జీ హుజూర్’
- నోరెళ్లబెట్టిన ఏపీ ప్రభుత్వం! జాడలేని కొత్తలైన్లు.. కొత్తరైళ్లు...
- కావాల్సినవి సాధించుకోడంలో బాబు సర్కారు ఘోర విఫలం
సాక్షి, హైదరాబాద్ : రైల్వే జోన్ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపింది. కొత్త లైన్లు, కొత్త రైళ్ల ఆశలపై నీళ్లుజల్లింది. పెండింగ్ ప్రాజెక్టులకూ అరకొర విదిలింపులతో సరిపెట్టింది. రాష్ట్ర విభజనవల్ల రాజధానితోపాటు అన్నీ కోల్పోయి ఆర్థికలోటులో ఉన్న ఏపీకి రైల్వే బడ్జెట్‌లోనూ తీవ్ర అన్యాయమే జరిగింది. కొత్త రాష్ట్ర ప్రగతికి, పారిశ్రామిక అభివృద్ధికీ దోహదపడే రాజధాని కనెక్టివిటీ అంశం బడ్జెట్‌లో ప్రస్తావించనేలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కొత్త రైల్వే జోన్ కోసం విశాఖపట్నం, విజయవాడ డివిజన్లు పోటీ పడ్డాయి. విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నందున విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దీనిని సాధించుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అదేవిధంగా ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కమిటీతో అధ్యయనం చేయించి నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం సందర్భంగా పేర్కొంది. ఈక్రమంలో రైల్వే జోన్‌పై కేంద్రం వేసిన కమిటీ నివేదికను కూడా ఇచ్చింది. అయితే.. సరకు రవాణా ద్వారా తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు అధిక ఆదాయం సమకూర్చుతున్న వాల్తేరు డివిజన్‌ను విడదీయరాదంటూ ఒడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఒడిశా సీఎం, ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వాల్తేరు డివిజన్‌ను తూర్పు కోస్తా జోన్ నుంచి తప్పించవద్దని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాల్సిన మన రాష్ట్ర ప్రభుత్వం.. చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఫలితంగా ఒడిశా ప్రభుత్వం ఒత్తిడికి కేంద్రం తలాడించింది.
బాబు ప్రభుత్వం ఘోర విఫలం
రైల్వే పరంగా కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కీలకమైన విశాఖ రైల్వే జోన్.. కొత్త రైళ్లు.. కొత్త లైన్లు.. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధుల కోసం ప్రణాళికాబద్ధమైన ప్రయత్నమే చేయలేదు. రైల్వే బడ్జెట్‌కు ముందు రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులపై రైల్వే ఉన్నతాధికారులు, ఎంపీలతో భేటీ నిర్వహించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలి. వాటిని బడ్జెట్‌లో చేర్చేలా ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. దివంగత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఇలానే చేశారు. అయితే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తాము భాగస్వాములైన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే చేయలేదు. దీనివల్ల నష్టం జరిగే ప్రమాదముందని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విపక్షాలు కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. రాజధాని కనెక్టివిటీ లైన్లు లాంటి కొన్ని అంశాలపై ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకొన్నారు. పెపైచ్చు విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా బాబు ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన బడ్జెట్‌లో ఉంటుందని, ఆ మేరకు తమకు సమాచారముందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వారం కిందటే ప్రకటించారు. ఇప్పుడు ఆ జోన్ ఊసులేకపోవడం గమనార్హం.
జాడలేని రాజధాని కనెక్టివిటీ!
రాయలసీమకు, ఇతర ప్రధాన నగరాలకు రాజధానిని అనుసంధానం చేసేందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్తలైన్లకు బడ్జెట్‌లో చోటు లభించలేదు. గుంటూరు-గుంతకల్లు-ధర్మవరం లైన్, విజయవాడ-గుంటూరు మార్గానికి రాయలసీమ ప్రాంతం నుంచి ఫాస్ట్‌ట్రాక్‌తో పాటు ఈ మార్గాన్ని డబ్లింగ్ చేయాలని రాష్ట్రం కోరింది. రాయలసీమ ప్రాంతంలోని 4 జిల్లాల నుంచి రాజధానికి రైల్లో చేరాలంటే 9 గంటలకు పైగా పడుతుంది. ఈ సమయాన్ని 6 గంటలకు తగ్గించేలా ఈ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి పోర్టులతో రైల్వేలైన్ల అనుసంధానం కీలకం. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నేపధ్యంలో కృష్ణపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టుల నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా సరుకు తరలించేందుకు రైల్వే లైన్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. కొన్ని మార్గాల్లో డబుల్ లైన్లు మాత్రమే ఉండటం వల్ల గూడ్స్ రైళ్లను, ఎక్స్‌ప్రెస్ రైళ్ళను క్రాసింగ్‌ల కోసం స్టేషన్లలో గంటల తరబడి నిలిపేయాల్సి వస్తోంది. ఈ సమస్య పరి ష్కారానికి ట్రిబుల్ లైను ఏర్పాటు ఒక్కటే పరిష్కా ర మార్గం. అయితే ఈ బడ్జెట్‌లో పెద్దగా ట్రిబుల్‌లైన్లు మంజూరు కాలేదు. విజయవాడ-కాజీపేట ట్రిపుల్ లైను ప్రకటించినా ఈ లైను 2006-07 నాటి ప్రతిపాదనే. దీన్ని పూర్తిచేసేందుకు రూ.1,054 కోట్లు అవసరం కాగా ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు.
అరకొర విదిలింపులతో..
పెండింగ్ రైల్వేలైన్లకు కూడా ప్రస్తుత బడ్జెట్‌లో అరకొర కేటాయింపులే వచ్చాయి. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఆయా ప్రాజెక్టులకు ఏమూలకూ చాలని రీతిలో ఉన్నాయి. ఫలితంగా ఈ మార్గాలు ఎప్పటికి పూర్తవుతాయో ప్రభుత్వాలకే తెలియాలి.
ఏపీకి అన్యాయం జరిగింది : చంద్రబాబు
రైల్వే బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం చేశారు. సప్లిమెంటరీ బడ్జెట్‌లోనైనా న్యాయం చేయాలని రైల్వే మంత్రిని, కేంద్రాన్ని కోరతాం. రైల్వే బడ్జెట్‌లో గత పదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడూ అదే రీతిలో అన్యాయం చేయడం దారుణం. రాష్ట్రానికి స్పీడ్ రైళ్లు మంజూరు చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని తాము పంపిన ప్రతిపాదనలను పట్టించుకోకపోవడం దారుణం. బడ్జెట్‌లో సేవల(సర్వీసెస్)కు ఎక్కువగా నిధులు కేటాయించారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చడానికి కట్టుబడి ఉన్నాం. ఇందుకోసం రైల్వే కార్గో అవసరం.
కూతల్లేవు.. అన్నీ కోతలే!
Published Fri, Feb 27 2015 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement