ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు
ఏపీ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీని ఆదుకునేందుకు ప్రత్యేక సాయం చేస్తామే తప్ప ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ స్పష్టం చేశారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన బీజేపీ స్టేట్ మీడియా వర్కుషాపు బుధవారం విశాఖలో జరిగింది. అనంతరం సిద్ధార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిన మాట వాస్తవమేనని, దాన్ని పూడ్చేందుకు కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు.
ఇందులో భాగంగానే ఏపీకి 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులను 10 శాతం వరకు పెంచామన్నారు. ఏపీకి త్వరలో ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించారు.టీడీపీతో సమన్వయలోపం, కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. గత రెండేళ్లలో ఏపీకి ఎన్నో చేశామనీ ఎంతో సాయం చేశాం..ఇంతకంటే ఎవరూ ఏమీ చేయలేరని సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2014-15 రెవెన్యూ లోటును తొలుత రూ.14,409 కోట్లుగా పేర్కొన్న రాష్ట్రం ఈ ఏడాది జనవరిలో సమర్సించిన ప్రతిపాదనల్లో 13,776 కోట్లుగా నిర్ధారించి రూ.11,473 కోట్లు సాయం ఇవ్వాలని కోరితే రూ.2,303 కోట్ల సాయం అందించామన్నారు.