Special Railway Zone
-
ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యామా?
విశాఖపట్నం: చంద్రబాబు కేబినెట్ రావణాసురులతో నిండిపోయిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మహిళలపై వేధింపుల కేసుల్లో ఉన్న నలుగురిలో ఇద్దరు మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు.. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నారని తెలిపారు. వేల కోట్ల రూపాయాలు ఎగ్గొట్టినా సుజనా చౌదరి కేంద్రంలో, రూ. వందల కోట్లు ఎగ్గొట్టినా గంట శ్రీనివాసరావుకు రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బావబామ్మర్ది గంట, నారాయణ దోచుకున్నారని ఆరోపించారు. వారిద్దరి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయికి విశాఖ అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా లిక్కర్ షాపులు విశాఖలోనే ఉన్నాయని తెలిపారు. బెల్ట్ షాపులు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. మంత్రి అయ్యన్నపాత్రుడు దగ్గరుండి గంజాయి సాగు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యామా అని ప్రశ్నించారు. టీడీపీ మంత్రులకు దోపిడీపై ఉన్న శ్రద్ధ విశాఖ రైల్వే జోన్ సాధనపై లేదని విమర్శించారు. ఓటుకు కోటు కేసు నుంచి బటయపడేందుకు చంద్రబాబు ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ ను కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని అన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ కోసం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చేపట్టబోతున్న పాదయాత్రకు అందరూ మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరువుతో రైతులు, వ్యవసాయ కూలీలు అల్లాడుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం ధ్వజమెత్తారు. -
పరిశీలనలో విశాఖ రైల్వే జోన్
రైల్వే బోర్డు సభ్యులు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశం ఇంకా తమ పరిశీలనలోనే ఉందని రైల్వే బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.శుక్రవారం తెలుగు మీడియా ప్రతినిధులతో బోర్డు సభ్యులు మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై బోర్డు సభ్యులు స్పందిస్తూ.. ‘రైల్వే జోన్ ఇవ్వడం వల్ల ఏపీకి ఏం లాభం? జోన్ ఏర్పాటు వల్ల ఏపీకి ఉద్యోగాలు కానీ, ఆదాయం కానీ రాదు కదా? అని ఎదురు ప్రశ్నించారు. దీనిపై రైల్వే బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. భువనేశ్వర్ – మైసూర్, హౌరా – యత్వంత్‌పూర్ మధ్య నడిచే అంత్యోదయా రైళ్లకు ఏపీలో పలుచోట్ల హాల్ట్ ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీకి రాజధాని రైలును ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించగా.. ‘ముందు మీ రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తి కానివ్వండి.. తర్వాత మా రాజధాని రైలును కేటాయిస్తామ’ని సభ్యులు చమత్కరించారు. -
ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు
ఏపీ ఇన్చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ సాక్షి, విశాఖపట్నం: ఏపీని ఆదుకునేందుకు ప్రత్యేక సాయం చేస్తామే తప్ప ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ స్పష్టం చేశారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన బీజేపీ స్టేట్ మీడియా వర్కుషాపు బుధవారం విశాఖలో జరిగింది. అనంతరం సిద్ధార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిన మాట వాస్తవమేనని, దాన్ని పూడ్చేందుకు కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే ఏపీకి 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులను 10 శాతం వరకు పెంచామన్నారు. ఏపీకి త్వరలో ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించారు.టీడీపీతో సమన్వయలోపం, కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. గత రెండేళ్లలో ఏపీకి ఎన్నో చేశామనీ ఎంతో సాయం చేశాం..ఇంతకంటే ఎవరూ ఏమీ చేయలేరని సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2014-15 రెవెన్యూ లోటును తొలుత రూ.14,409 కోట్లుగా పేర్కొన్న రాష్ట్రం ఈ ఏడాది జనవరిలో సమర్సించిన ప్రతిపాదనల్లో 13,776 కోట్లుగా నిర్ధారించి రూ.11,473 కోట్లు సాయం ఇవ్వాలని కోరితే రూ.2,303 కోట్ల సాయం అందించామన్నారు. -
'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గెలిచాం'
విశాఖ : రైల్వే ప్రత్యేక జోన్ ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గురువారం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి విజయం సాధించాం. ఇప్పుడు అదే తరహాలో రైల్వే ప్రత్యేక జోన్ కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రైల్వే జోన్ డిమాండ్ కొత్తది కాదని, దశాబ్ధాలుగా ఉందని గుర్తుచేశారు. పునర్విభజన చట్టంలోనూ హామీ ఇచ్చారని తెలిపారు. ఆ చట్టబద్ధ హక్కు కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమన్నారు. రైల్వే జోన్ వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణం విశాఖకు రైల్వే ప్రత్యేక జోన్ ను కేటాయించాలని విజయ్ సాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. -
రైల్వేజోన్ ఉత్తరాంధ్రుల ఆకాంక్ష
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రౌండ్‌టేబుల్ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం డాబాగార్డెన్స్ : విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్షని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. రైల్వేజోన్ సాధనకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, మేధావులు, విద్యార్థులను కలుస్తున్నామని, ఇప్పటికే వామపక్షాలు, రైల్వే యూని యన్ నాయకులను కలిసి మద్దతు కోరామని తెలిపారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌ను సోమవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశంపై ఈ నెల 6న వైఎస్సార్ సీపీ నేతృత్వంలో జిల్లా పరిషత్ జంక్షన్ దరి అంకోసా గెస్ట్‌హౌస్‌లో నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశానికి రాజకీయ పార్టీలకతీతంగా హాజరుకావాలని వాసుపల్లికి అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. స్పందించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ గత నెల 14న రైల్వే డీఆర్ఎమ్కు వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఏప్రిల్ 14 లోపు స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని లేఖ పంపినా ఇంత వరకూ స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ కోసం ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రికి లేఖ పంపినా స్పందన రాలేదన్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బడ్జెట్‌కు, జోన్‌కు సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి టీడీపీని ఆహ్వానించడానికే వచ్చామని అమర్ స్పష్టం చేశారు. దీనిని రాజకీయం చేస్తే వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. వాసుపల్లిని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయ్‌కుమార్, కార్యదర్శులు కంపా హానోక్, జాన్‌వెస్లీ, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవిరెడ్డి, బీసీ నాయకుడు ఫక్కి దివాకర్, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, నగర కార్యదర్శి శ్రీదేవివర్మ, పలువురు పార్టీ నాయకులు కలిశారు. ఇచ్చేది... తెచ్చేది మేమే.. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇచ్చేది... తెచ్చేది మేమేనని తెలిపారు. రైల్వేజోన్ కోసం మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నామని, వామపక్షాలతో కలిసి ఉద్యమించామన్నారు. వైజాగ్‌కి జోన్ రాకపోతే రాష్ట్రంలో మరెక్కడా రైల్వే జోనే ఉండదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ రైల్వేజోన్ కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. రైల్వే జోన్ కోసం వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరుకానున్నట్టు తెలిపారు. -
'నాయుడుకు విశాఖ రైల్వేజోన్ పై ఆసక్తిలేదు'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పాలన రాజ్యమేలుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో శుక్రవారం ఆయన విశాఖ రైల్వేజోన్ అంశంపై మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై ఉన్న ఆసక్తి విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ పై లేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14 లోగా ప్రత్యేక రైల్వే జోన్ పై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని పేర్కొన్నారు. -
ఆమరణ పథం
రైల్వే జోన్ డిమాండ్‌తో కదం తొక్కిన వైఎస్సార్సీపీ నెల రోజుల్లోగా స్పష్టమైన ప్రకటన చేయాలి లేకపోతే ఏప్రిల్ 14 నుంచి నిరవధిక దీక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ అల్టిమేటమ్ డీఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా.. వినతిపత్రం సమర్పణ తాటిచెట్లపాలెం: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ సోమవారం వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. జోన్ ఏర్పాటులో ప్రజాప్రతినిధుల వైఫల్యాన్ని ప్రశ్నించాయి. రైల్వేజోన్ విశాఖ హక్కు.. కేంద్రం రైల్వే జోన్‌ను ప్రకటించాలి. ఎంపీలు రైల్వే జోన్ కోసం పోరాడాలి.. చేతకాని ఎంపీలు రాజీనామా చేయాలి.. అన్న నినాదాలతో డీఆర్ఎం ఆఫీసు ప్రాంగణాన్ని హోరెత్తించాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రైల్వే జోన్ సాధనకు ఏప్రిల్ 14 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. అనంతరం డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీకి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. డీఆర్ఎం కార్యాలయం వద్ద బైఠాయింపు తొలుత ఉదయం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు డీఆర్ఎం ఆఫీసుకు చేరుకున్నారు. రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట కాసేపు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్ సాధన కోసం అంబేడ్కర్ జయంతి రోజైన వచ్చే నెల 14 నుంచి అమరణదీక్ష చేపడతానని వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టంలో విశాఖకురైల్వేజోన్ ఇస్తామని పేర్కొన్నారని, ఇప్పటివరకూ ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలోనూ ఆ అంశం చేర్చకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో విశాఖ వచ్చిన నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు రైల్వే జోన్‌పై ఇచ్చిన హామీలను అటకెక్కించారని విమర్శించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బడ్జెట్‌కు జోన్‌కు సంబంధంలేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు రైల్వేజోన్‌కు సాంకేతిక అడ్డంకులున్నాయని చెప్పడం విడ్డూరమన్నారు. ఈ విషయాన్ని డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ వద్ద ప్రస్తావించగా జోన్ విషయంలో సాంకేతిక సమస్యలేవీ లేవనీ, ఇది పూర్తిగా రాజకీయ అంశమని చెప్పారన్నారు. నెల రోజుల్లోగా జోన్‌పై సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు మాట్లాడుతూ విభజన చట్టంలో రైల్వేజోన్ ఇస్తామనన్నారని, దాన్ని నెరవేర్చకపోతే పార్టీ తరఫున పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జోన్ విషయంలో టీడీపీ, బీజేపీలు మోసం చేస్తున్నాయని, ఆ పార్టీల ఎంపీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రైల్వే జోన్ సాధన చేతగాని ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల అత్యుత్సాహం: డీఆర్ఎంకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలపై, కార్యక్రమం కవరేజికి వచ్చిన మీడియాపై ఆర్పీఎఫ్, జీఆర్పీ, టూటౌన్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నేతలతో పాటు మీడియాను లోపలికి వెళ్లకుండా అడ్డుకుని నెట్టేశారు. పాత్రికేయుల ఆందోళనతో డీఆర్ఎం బయటకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోక్, జాన్‌వెస్లీ, సమన్వయకర్తలు కోలా గురువులు, అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి, రొంగలి జగన్నాథం, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, సీనియర్ నాయకుడు సత్తి రామకృష్ణారెడ్డి, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, జిల్లా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు, బీసీ సెల్ నాయకుడు పక్కి దివాకర్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బద్రీనాథ్, స్టీల్‌ప్లాంట్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మస్తానప్ప, సేవాదళ్ అధ్యక్షుడు వాసు, నగర ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ అలీ, వార్డు అధ్యక్షులు సమయం హేమంత్‌కుమార్, పైడి రమణ, దుప్పలపూడి శ్రీనివాస్, నొల్లి సోమరాజు, తోట రామారావు, సారిపల్లి గోవిందు, పోలారావు, ఎన్.మైఖేల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
'24 గంటల్లో ఆ ఎంపీలు రాజీనామా చేయాలి'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రైల్వేకి ప్రత్యేక జోన్ ఇప్పట్లో వచ్చేట్లు కనిపించడం లేదు. బీజేపీ నేతలు విశాఖ వాసుల ఆశలపై నీళ్లు చల్లారు. మే 27 న విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి ప్రకటన విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. దీంతో ఆగ్రహించిన ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ఫోరం నేతలు బీజేపీ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు. 24 గంటల్లో విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ ఇద్దరు ఎంపీల ఇళ్లు, కార్యాలయాలు ముట్టడిస్తామని ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ఫోరం నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారంటూ ఫోరం సభ్యుడు చలసాని గాంధీ ప్రశ్నించారు. -
విశాఖ వాసుల ఆశలపై నీళ్లు!
-
కూతల్లేవు.. అన్నీ కోతలే!
- ఏపీలో ఊసులేని రైల్వే జోన్ - ఒడిశా ఒత్తిడికి కేంద్రం ‘జీ హుజూర్’ - నోరెళ్లబెట్టిన ఏపీ ప్రభుత్వం! జాడలేని కొత్తలైన్లు.. కొత్తరైళ్లు... - కావాల్సినవి సాధించుకోడంలో బాబు సర్కారు ఘోర విఫలం సాక్షి, హైదరాబాద్ : రైల్వే జోన్ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపింది. కొత్త లైన్లు, కొత్త రైళ్ల ఆశలపై నీళ్లుజల్లింది. పెండింగ్ ప్రాజెక్టులకూ అరకొర విదిలింపులతో సరిపెట్టింది. రాష్ట్ర విభజనవల్ల రాజధానితోపాటు అన్నీ కోల్పోయి ఆర్థికలోటులో ఉన్న ఏపీకి రైల్వే బడ్జెట్లోనూ తీవ్ర అన్యాయమే జరిగింది. కొత్త రాష్ట్ర ప్రగతికి, పారిశ్రామిక అభివృద్ధికీ దోహదపడే రాజధాని కనెక్టివిటీ అంశం బడ్జెట్లో ప్రస్తావించనేలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కొత్త రైల్వే జోన్ కోసం విశాఖపట్నం, విజయవాడ డివిజన్లు పోటీ పడ్డాయి. విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నందున విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దీనిని సాధించుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కమిటీతో అధ్యయనం చేయించి నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సందర్భంగా పేర్కొంది. ఈక్రమంలో రైల్వే జోన్‌పై కేంద్రం వేసిన కమిటీ నివేదికను కూడా ఇచ్చింది. అయితే.. సరకు రవాణా ద్వారా తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు అధిక ఆదాయం సమకూర్చుతున్న వాల్తేరు డివిజన్‌ను విడదీయరాదంటూ ఒడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఒడిశా సీఎం, ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వాల్తేరు డివిజన్‌ను తూర్పు కోస్తా జోన్ నుంచి తప్పించవద్దని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాల్సిన మన రాష్ట్ర ప్రభుత్వం.. చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఫలితంగా ఒడిశా ప్రభుత్వం ఒత్తిడికి కేంద్రం తలాడించింది. బాబు ప్రభుత్వం ఘోర విఫలం రైల్వే పరంగా కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కీలకమైన విశాఖ రైల్వే జోన్.. కొత్త రైళ్లు.. కొత్త లైన్లు.. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధుల కోసం ప్రణాళికాబద్ధమైన ప్రయత్నమే చేయలేదు. రైల్వే బడ్జెట్‌కు ముందు రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులపై రైల్వే ఉన్నతాధికారులు, ఎంపీలతో భేటీ నిర్వహించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలి. వాటిని బడ్జెట్లో చేర్చేలా ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. దివంగత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఇలానే చేశారు. అయితే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తాము భాగస్వాములైన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే చేయలేదు. దీనివల్ల నష్టం జరిగే ప్రమాదముందని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విపక్షాలు కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. రాజధాని కనెక్టివిటీ లైన్లు లాంటి కొన్ని అంశాలపై ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకొన్నారు. పెపైచ్చు విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా బాబు ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన బడ్జెట్లో ఉంటుందని, ఆ మేరకు తమకు సమాచారముందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వారం కిందటే ప్రకటించారు. ఇప్పుడు ఆ జోన్ ఊసులేకపోవడం గమనార్హం. జాడలేని రాజధాని కనెక్టివిటీ! రాయలసీమకు, ఇతర ప్రధాన నగరాలకు రాజధానిని అనుసంధానం చేసేందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్తలైన్లకు బడ్జెట్లో చోటు లభించలేదు. గుంటూరు-గుంతకల్లు-ధర్మవరం లైన్, విజయవాడ-గుంటూరు మార్గానికి రాయలసీమ ప్రాంతం నుంచి ఫాస్ట్ట్రాక్తో పాటు ఈ మార్గాన్ని డబ్లింగ్ చేయాలని రాష్ట్రం కోరింది. రాయలసీమ ప్రాంతంలోని 4 జిల్లాల నుంచి రాజధానికి రైల్లో చేరాలంటే 9 గంటలకు పైగా పడుతుంది. ఈ సమయాన్ని 6 గంటలకు తగ్గించేలా ఈ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి పోర్టులతో రైల్వేలైన్ల అనుసంధానం కీలకం. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నేపధ్యంలో కృష్ణపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టుల నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా సరుకు తరలించేందుకు రైల్వే లైన్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. కొన్ని మార్గాల్లో డబుల్ లైన్లు మాత్రమే ఉండటం వల్ల గూడ్స్ రైళ్లను, ఎక్స్‌ప్రెస్ రైళ్ళను క్రాసింగ్‌ల కోసం స్టేషన్లలో గంటల తరబడి నిలిపేయాల్సి వస్తోంది. ఈ సమస్య పరి ష్కారానికి ట్రిబుల్ లైను ఏర్పాటు ఒక్కటే పరిష్కా ర మార్గం. అయితే ఈ బడ్జెట్లో పెద్దగా ట్రిబుల్లైన్లు మంజూరు కాలేదు. విజయవాడ-కాజీపేట ట్రిపుల్ లైను ప్రకటించినా ఈ లైను 2006-07 నాటి ప్రతిపాదనే. దీన్ని పూర్తిచేసేందుకు రూ.1,054 కోట్లు అవసరం కాగా ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. అరకొర విదిలింపులతో.. పెండింగ్ రైల్వేలైన్లకు కూడా ప్రస్తుత బడ్జెట్లో అరకొర కేటాయింపులే వచ్చాయి. బడ్జెట్లో కేటాయించిన నిధులు ఆయా ప్రాజెక్టులకు ఏమూలకూ చాలని రీతిలో ఉన్నాయి. ఫలితంగా ఈ మార్గాలు ఎప్పటికి పూర్తవుతాయో ప్రభుత్వాలకే తెలియాలి. ఏపీకి అన్యాయం జరిగింది : చంద్రబాబు రైల్వే బడ్జెట్లో ఏపీకి అన్యాయం చేశారు. సప్లిమెంటరీ బడ్జెట్లోనైనా న్యాయం చేయాలని రైల్వే మంత్రిని, కేంద్రాన్ని కోరతాం. రైల్వే బడ్జెట్లో గత పదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడూ అదే రీతిలో అన్యాయం చేయడం దారుణం. రాష్ట్రానికి స్పీడ్ రైళ్లు మంజూరు చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని తాము పంపిన ప్రతిపాదనలను పట్టించుకోకపోవడం దారుణం. బడ్జెట్లో సేవల(సర్వీసెస్)కు ఎక్కువగా నిధులు కేటాయించారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చడానికి కట్టుబడి ఉన్నాం. ఇందుకోసం రైల్వే కార్గో అవసరం. -
బడ్జెట్ బండి.. ఆగలేదండి
ఏలూరు/భీమవరం :రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇక్కడి స్టేషన్లలో ప్రత్యేక సదుపాయాలు కల్పిం చాలని, నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ నిర్మించాలని, భీమవరం-గుడివాడ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు అధిక నిధుల కేటాయించాలని, విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన ఎంపీలు రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకు ప్రతిపాదనలు ఇచ్చారు. బడ్జెట్ ప్రకటనను చూస్తే అవన్నీ బుట్టదాఖలైనట్టు స్పష్టమైంది. ఎంపీలను దూరం పెట్టారా బడ్జెట్ కసరత్తులో భాగంగా ఎంపీల నుంచి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రతిపాదనలు స్వీకరించారు. చివరకు వాటిని పట్టించుకోలేదు. ఈ తీరు చూస్తుంటే ఎంపీలను దూరం పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే సౌకర్యాల కోసం ఎంపీ కోటా నిధులను వెచ్చించాలని సూచించడం ఎంపీలను అయోమయంలోకి నెట్టేసింది. లిఫ్ట్‌లు.. ఎస్కలేటర్లు ఏ స్టేషన్లకో.. ప్రధాన రైల్వేస్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. జిల్లాలోని ఎన్ని స్టేషన్లకు ఈ సౌకర్యం కల్పిస్తారనేది తేలాల్సి ఉంది. అసలు మన జిల్లాలోని స్టేషన్లను ప్రధాన స్టేషన్లుగా పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది అనుమానంగానే ఉంది. మరోవైపు గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం స్టేషన్లలో సదుపాయాలు ఏమైనా కల్పిస్తారా లేదా అన్నది స్పష్టం కాలేదు. బడ్జెట్లో ఈ ప్రస్తావన కనిపించలేదు. ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా 970 చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. మన జిల్లాల్లో 15చోట్ల ఆర్వోబీలు నిర్మించాలనే ప్రతిపాదనలు దశాబ్దాల క్రితమే రైల్వే శాఖకు వెళ్లాయి. ఈసారైనా ఈ ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే. కోటిపల్లికి దారేది కమలనాథులపై ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కోనసీమ రైల్వే ప్రాజెక్ట్‌పై పెట్టుకున్న ఆశలు ఈసారి కూడా నెరవేరలేదు. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి యూపీఏ సర్కారు తరహాలోనే ఎన్డీయే కూడా మొండిచెయ్యి చూపించింది. గత ఏడాది బడ్జెట్లో ఈ లైన్‌కు రూ.11 కోట్లు కేటాయిం చగా, ఈసారి రూ.5 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజె క్ట్ ప్రతిపాదనల్ని సజీవంగా ఉంచడానికి మినహా ఈ కేటాయింపులు ఎందుకూ సరిపోవు. అదేవిధంగా విజయవాడ-భీమవరం బ్రాంచిలైన్ డబ్లింగ్ పనుల కోసం రూ.1,500 కోట్లు అవసరం కాగా, ఈ ఏడాది కేవలం రూ.150 కోట్లు మాత్రమే కేటాయించారు. -
అవసరమనుకుంటే సీమాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్: రైల్వే మంత్రి
బెంగళూరు: సీమాంధ్ర అభివృద్ధి కోసం అవసరమనుకుంటే ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా రైల్వే లైన్లు, జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందులో భాగంగా సీమాంధ్రలో ప్రత్యేకరైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రయాణికులకు భద్రత పెంపు కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయంలో ‘మెట్రోమాన్’గా పేరుగాంచిన శ్రీధరన్‌ను స్వయంగా కలిసి కమిటీకి సేవలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తానన్నారు. కేవలం భద్రతపరంగానేకాక ఇతర అంశాల విషయంలో కూడా నిపుణుల సలహాలు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రితో చర్చించి మూడు, నాలుగు రోజుల్లో ఈ కమిటీని ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. ఇందులో ఎవరెవరు ఉంటారో ఇంకా నిర్ణయించనప్పటికీ శ్రీధరన్మాత్రం కచ్చితంగా ఉంటారన్నారు. భద్రత, రక్షణ, సేవ, వేగం అనే అంశాలు తన ఎజెండా అన్నారు. అభివృద్ధిపథంలో ముందుకు సాగడానికి నూతన ఆవిష్కారాలు ఎంతో అవసరమన్నారు.