వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
రౌండ్‌టేబుల్ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం
డాబాగార్డెన్స్ : విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్షని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కోరారు. రైల్వేజోన్ సాధనకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, మేధావులు, విద్యార్థులను కలుస్తున్నామని, ఇప్పటికే వామపక్షాలు, రైల్వే యూని యన్ నాయకులను కలిసి మద్దతు కోరామని తెలిపారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌ను సోమవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ అంశంపై ఈ నెల 6న వైఎస్సార్ సీపీ నేతృత్వంలో జిల్లా పరిషత్ జంక్షన్ దరి అంకోసా గెస్ట్‌హౌస్‌లో నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశానికి రాజకీయ పార్టీలకతీతంగా హాజరుకావాలని వాసుపల్లికి అమర్‌నాథ్ విజ్ఞప్తి చేశారు.
స్పందించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
అనంతరం అమర్‌నాథ్ మాట్లాడుతూ గత నెల 14న రైల్వే డీఆర్‌ఎమ్‌కు వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఏప్రిల్ 14 లోపు స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని లేఖ పంపినా ఇంత వరకూ స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ కోసం ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రికి లేఖ పంపినా స్పందన రాలేదన్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బడ్జెట్‌కు, జోన్‌కు సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి టీడీపీని ఆహ్వానించడానికే వచ్చామని అమర్ స్పష్టం చేశారు. దీనిని రాజకీయం చేస్తే వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. వాసుపల్లిని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయ్‌కుమార్, కార్యదర్శులు కంపా హానోక్, జాన్‌వెస్లీ, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవిరెడ్డి, బీసీ నాయకుడు ఫక్కి దివాకర్, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, నగర కార్యదర్శి శ్రీదేవివర్మ, పలువురు పార్టీ నాయకులు కలిశారు.
ఇచ్చేది... తెచ్చేది మేమే..
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇచ్చేది... తెచ్చేది మేమేనని తెలిపారు. రైల్వేజోన్ కోసం మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నామని, వామపక్షాలతో కలిసి ఉద్యమించామన్నారు. వైజాగ్‌కి జోన్ రాకపోతే రాష్ట్రంలో మరెక్కడా రైల్వే జోనే ఉండదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ రైల్వేజోన్ కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. రైల్వే జోన్ కోసం వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరుకానున్నట్టు తెలిపారు.