ఆమరణ పథం | The demand for railway zone | Sakshi
Sakshi News home page

ఆమరణ పథం

Published Mon, Mar 14 2016 11:30 PM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

The demand for railway zone

రైల్వే జోన్ డిమాండ్‌తో కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ
నెల రోజుల్లోగా స్పష్టమైన  ప్రకటన చేయాలి
లేకపోతే ఏప్రిల్  14 నుంచి నిరవధిక దీక్ష
పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ అల్టిమేటమ్
డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ధర్నా.. వినతిపత్రం సమర్పణ

 
తాటిచెట్లపాలెం:  విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ సోమవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి. జోన్ ఏర్పాటులో ప్రజాప్రతినిధుల వైఫల్యాన్ని ప్రశ్నించాయి. రైల్వేజోన్ విశాఖ హక్కు.. కేంద్రం రైల్వే జోన్‌ను ప్రకటించాలి. ఎంపీలు రైల్వే జోన్ కోసం పోరాడాలి.. చేతకాని ఎంపీలు రాజీనామా చేయాలి..  అన్న నినాదాలతో డీఆర్‌ఎం ఆఫీసు ప్రాంగణాన్ని హోరెత్తించాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ రైల్వే జోన్  సాధనకు ఏప్రిల్ 14 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. అనంతరం డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీకి ఈ మేరకు  వినతి పత్రం అందజేశారు.
 
డీఆర్‌ఎం కార్యాలయం వద్ద బైఠాయింపు
తొలుత ఉదయం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు డీఆర్‌ఎం ఆఫీసుకు చేరుకున్నారు. రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట కాసేపు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్ సాధన కోసం అంబేడ్కర్ జయంతి రోజైన వచ్చే నెల 14 నుంచి అమరణదీక్ష చేపడతానని వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టంలో విశాఖకురైల్వేజోన్ ఇస్తామని పేర్కొన్నారని, ఇప్పటివరకూ ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలోనూ ఆ అంశం చేర్చకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో విశాఖ వచ్చిన నరేంద్రమోదీ, చంద్రబాబు,  పవన్‌కల్యాణ్‌లు రైల్వే జోన్‌పై ఇచ్చిన హామీలను అటకెక్కించారని విమర్శించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బడ్జెట్‌కు జోన్‌కు సంబంధంలేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు రైల్వేజోన్‌కు సాంకేతిక అడ్డంకులున్నాయని చెప్పడం విడ్డూరమన్నారు. ఈ విషయాన్ని డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ వద్ద ప్రస్తావించగా జోన్ విషయంలో సాంకేతిక సమస్యలేవీ లేవనీ, ఇది పూర్తిగా రాజకీయ అంశమని చెప్పారన్నారు. నెల రోజుల్లోగా జోన్‌పై సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు మాట్లాడుతూ విభజన చట్టంలో రైల్వేజోన్ ఇస్తామనన్నారని, దాన్ని నెరవేర్చకపోతే పార్టీ తరఫున పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జోన్ విషయంలో టీడీపీ, బీజేపీలు మోసం చేస్తున్నాయని, ఆ పార్టీల ఎంపీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రైల్వే జోన్ సాధన చేతగాని ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసుల అత్యుత్సాహం: డీఆర్‌ఎంకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై, కార్యక్రమం కవరేజికి వచ్చిన మీడియాపై ఆర్‌పీఎఫ్, జీఆర్పీ, టూటౌన్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నేతలతో పాటు మీడియాను లోపలికి వెళ్లకుండా అడ్డుకుని నెట్టేశారు. పాత్రికేయుల ఆందోళనతో డీఆర్‌ఎం బయటకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోక్, జాన్‌వెస్లీ, సమన్వయకర్తలు కోలా గురువులు, అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి, రొంగలి జగన్నాథం, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, సీనియర్ నాయకుడు సత్తి రామకృష్ణారెడ్డి, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, జిల్లా క్రమశిక్షణ  సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు, బీసీ సెల్ నాయకుడు పక్కి దివాకర్, ట్రేడ్ యూనియన్  అధ్యక్షుడు బద్రీనాథ్, స్టీల్‌ప్లాంట్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మస్తానప్ప, సేవాదళ్ అధ్యక్షుడు వాసు, నగర ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ అలీ, వార్డు అధ్యక్షులు సమయం హేమంత్‌కుమార్,  పైడి రమణ, దుప్పలపూడి శ్రీనివాస్, నొల్లి సోమరాజు, తోట రామారావు, సారిపల్లి గోవిందు, పోలారావు, ఎన్.మైఖేల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement