
అవసరమనుకుంటే సీమాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్: రైల్వే మంత్రి
బెంగళూరు: సీమాంధ్ర అభివృద్ధి కోసం అవసరమనుకుంటే ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా రైల్వే లైన్లు, జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందులో భాగంగా సీమాంధ్రలో ప్రత్యేకరైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రయాణికులకు భద్రత పెంపు కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
ఈ విషయంలో ‘మెట్రోమాన్’గా పేరుగాంచిన శ్రీధరన్‌ను స్వయంగా కలిసి కమిటీకి సేవలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తానన్నారు. కేవలం భద్రతపరంగానేకాక ఇతర అంశాల విషయంలో కూడా నిపుణుల సలహాలు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రితో చర్చించి మూడు, నాలుగు రోజుల్లో ఈ కమిటీని ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. ఇందులో ఎవరెవరు ఉంటారో ఇంకా నిర్ణయించనప్పటికీ శ్రీధరన్‌మాత్రం కచ్చితంగా ఉంటారన్నారు. భద్రత, రక్షణ, సేవ, వేగం అనే అంశాలు తన ఎజెండా అన్నారు. అభివృద్ధిపథంలో ముందుకు సాగడానికి నూతన ఆవిష్కారాలు ఎంతో అవసరమన్నారు.