దూసుకురాని ‘బులెట్లు’
- సెమీ బులెట్ రైళ్ల ఊసే ఎత్తని రైల్వే మంత్రి
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఏడాది కిందట రైల్వే మంత్రి హోదాలో సదానంద గౌడ ఘనంగా ప్రకటించిన సెమీ బులెట్ రైళ్లు ఇప్పుడు మొహం చాటేశాయి. దక్షిణ మధ్య రైల్వేకు రెండు రైళ్లను కూడా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి చెన్నై, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మార్గాలను సిద్ధం చేసి హైస్పీడ్ (సెమీ బులెట్) రైళ్లను ప్రవేశపెడతామని ప్రకటించారు. 200 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ రైళ్లు వెళ్లే మార్గాలను బాగా మెరుగు పరచాల్సి ఉంటుంది. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు ఉండకూడదు. ఇదంతా జరగాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి. ఆ బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించి ఉసూరుమనిపించారు.
తాజాగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కనీసం వాటి ఊసెత్తలేదు. ఆ రెండు ప్రతిపాదనలను దాదాపు విరమించుకున్నారని తెలుస్తోంది. కొన్ని నిర్ధారిత మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్ల వరకు పెంచనున్నట్టు మంత్రి ప్రకటించారు. అందులో ఈ మార్గాలను కూడా చేర్చి సెమీ బులెట్ రైళ్ల ప్రతిపాదనకు తెరదించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ మార్గాల్లో బులెట్ రైళ్లను నడపాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్టు సమాచారం. అందుకే బడ్జెట్‌లో ఆ ప్రతిపాదనలకు నయా పైసా కూడా విదల్చలేదు.