అమరావతి ప్రతిష్టను రెట్టింపు చేయాలి
ఆటోడ్రైవర్లతో డీటీసీ ఎం.పురేంద్ర
విజయవాడ (మొగల్రాజపురం) : రాజధాని అమరావతి ప్రతిష్ట రెట్టింపు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎం.పురేంద్ర ఆటో డ్రైవర్లను కోరారు. చుట్టుగుంటలోని రాంకోర్ కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్, వాలంటరీ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎకానమిక్ డెవలప్మెంట్ యూనిట్ (వీడు) ఆధ్వర్యంలో ‘ఐ యామ్ ఎ సేఫ్ డ్రైవర్’ పేరుతో ఎంపికచేసిన ఆటోడ్రైవర్లకు డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన పురేంద్ర మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చినవారు మొట్టమొదట సంప్రదించేది ఆటో డ్రైవర్లనేనన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రతిష్టను పెంపొందించేలా ప్రవర్తించాలని కోరారు.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి.శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 250 మంది ఆటోడ్రైవర్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ‘సేవ్ డ్రైవర్’ అనే సర్టిఫికెట్తో పాటు యూనిఫాం, ఒక సంవత్సరానికి లక్ష రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అందజేస్తామని వివరించారు. ప్రమాదరహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంకోర్ మేనేజింగ్ డెరైక్టర్ కేవీఎస్ ప్రకాశరావు, ‘వీడు’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం.వాసు పాల్గొన్నారు.