గమత్తుగా రవాణా
అంతటా గుప్పుమంటున్న మన్యం గంజాయి
వరుసగా వెలుగు చూస్తున్న సంఘటనలు
ఏడాదిలో 14,602 కిలోలు స్వాధీనం
ఏవోబీలో రూ. కోట్లలో లావాదేవీలు
సాగు,రవాణా నియంత్రణలో ఎక్సైజ్‌శాఖ విఫలం
అందాల మన్యం అక్రమాలకు వేదిక అవుతోంది. ఏటేటా పంట విస్తీర్ణం పెరగడంతో ఏజెన్సీ అంతటా గంజాయి వాసన గుప్పుమంటోంది. రాష్ట్రం నలుమూలల తనిఖీల్లో విశాఖ మన్యం నుంచి దిగుమతి అవుతున్న గంజాయే పట్టుబడుతోంది. ఈ మత్తు గమ్మత్తుగా రవాణా అవుతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. ఎక్సైజ్, పోలీసులు దాడులు జరుపుతున్నా ఏటా రూ. వందల కోట్లపైనే ఈ వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. ఎక్కువగా కర్నాటక, మహారాష్ట్ర, పెద్ద మొత్తంలో తమిళనాడు తరలిస్తున్నట్టు అంచనా. అధికారుల నిఘా కొరవడడం వల్లే ఈ పరిస్థితి అన్న వాదన ఉంది.
నర్సీపట్నం: ఏజన్సీలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను వినియోగిస్తున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రశర్మ తెలిపారు. ఇక్కడి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ ఏవోబీలో పెద్ద ఎత్తున సాగవుతోందన్నారు. ఖరీదైన శీలావతి రకాన్ని ఇక్కడ సాగు చేయడంతో విదేశాల్లోనూ దీనికి డిమాండ్ ఉంటోందన్నారు. తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల సాగు, అక్రమ రవాణాను నిరోధించలేకపోతున్నామన్నారు. దాడులకు వెళ్లే సిబ్బందికి గిరిజనుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోందన్నారు. అయినప్పటికీ 2.6లక్షల గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు. నిర్మూలనకు పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు.