రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
తణుకు : రోడ్డు ప్రమాదాల నివారణకు ఏ చర్యలు చేపట్టాలో సర్వే చేస్తున్నట్టు, ఆ నివేదిక ఆధారంగా ఆయా కూడళ్లలో రక్షణ చర్యలు చేపట్టనున్నట్టు రవాణాశాఖ డెప్యూటీ కమిషనర్ ఎస్.సత్యనారాయణమూర్తి తెలిపారు. తణుకు మండలం దువ్వ వెంకయ్య వయ్యేరు నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం వరకు పదహారో నంబరు జాతీయ రహదారిౖపై ప్రధాన కూడళ్లలో జరుగుతున్న ప్రమాదాలపై బుధవారం ఆయన ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలపై దృష్టి సారించి ఆయా కూడళ్లలో ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? కారణాలు ఏమిటనే కోణంలో సర్వే చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎంవీఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.