సింగిల్ పర్మిట్ ఇవ్వండి.. లేదంటే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత రవాణా లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వకపోతే ఏపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నేతలు సయ్యద్ సాధిక్, నవాజ్ గోరి తదితరులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను టక్కర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లారీ అసోసియేషన్ ప్రతినిధులతో కలసి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత విధానం వల్ల నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు చెల్లించాల్సి వస్తోందని, దీంతో లారీ యాజమాన్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు.
సింగిల్ పర్మిట్ విధానం ద్వారా రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. ఏపీకి కూడా తెలంగాణ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఏపీనే ముందుకు రావట్లేదని చెప్పారు. జూన్ 6 లోగా ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే కోదాడ వద్ద ఏపీ లారీలను అడ్డుకుంటామని హెచ్చరించారు.