దేశవ్యాప్త సమ్మెకు ఏపీలో రవాణా కార్మికుల మద్దతు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన రవాణా భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్లోని రవాణా రంగంలోని కార్మికులంతా గురువారం సమ్మెకు దిగనున్నారు. ఈ సమ్మెకు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. రవాణా రంగ రాజధాని అయిన విజయవాడలో పెద్ద ఎత్తున రవాణా భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రైవేటు ట్రావెల్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాక్సీ, ఆటోల యూనియన్లు పెద్ద ఎత్తున నిరసన తెలపనున్నాయి. ఆర్టీసీలో ఎంప్లాయిస్ యూనియన్ యాజమాన్యానికి సమ్మె నోటీసిచ్చింది.
మే 6 నుంచి ఈయూ ఆర్టీసీ సమ్మెకు పిలుపునివ్వడంతో బస్ డిపోల వద్ద కొద్ది సేపు నిరసన తెలిపేందుకు కార్మికులు సమాయత్తమవుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొని మద్దతు పలకనున్నాయి. దీంతో నేడు ఏపీలో రవాణా రంగం పూర్తిగా స్తంభించనుంది. ఆయా ప్రాంతాలకు వెళ్లిన లారీలు ఎక్కడికక్కడ నిలిపేసి నిరసన తెలియజేయాల్సిందిగా లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అయితే రవాణా శాఖ రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవీ చేయలేదు. మధ్యాహ్నం వరకు సమ్మె ప్రభావం ఉన్నా, సాయంత్రం నుంచి యధావిధిగా రవాణా సౌకర్యాలు ఉంటాయన్న ఆలోచనలో రవాణా అధికారులున్నారు.