సరుకులపై సమ్మెట
తాడేపల్లిగూడెం : లారీల సమ్మె ప్రభావం నిత్యావసర సరుకులపై పడింది. సమ్మె ప్రభావం నేరుగా జిల్లాలోని గుత్త మార్కెట్ తాడేపల్లిగూడెంపై పడింది. ఆదివారం లారీల సమ్మె కారణంగా సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే సరుకులు రాని పరిస్థితి మార్కెట్లో నెలకొంది. దీంతో ఉన్న సరుకుకు డిమాండ్ ఏర్పడి ధరలకు రెక్కలు వచ్చాయి. కూరగాయలపై ఈ ప్రభావం తక్కువుగా పడింది. అపరాలు, నూనెలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలు బాగా పెరిగాయి. ఉల్లి, బంగాళాదుంపల ధరలు 50 శాతం పైగా పెరిగాయి. సోమవారం నుంచి సమ్మె ప్రభావం అధికంగా ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. సమ్మె నిరవధికంగా కొనసాగిన పక్షంలో ధరలు మండుతాయని వ్యాపారవర్గాలు అంచనా వేస్తుండగా మరోపక్క ధరలకు రెక్కలు వస్తే ఎలా అనే ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది.
నిలిచిన 2000 లారీలు
లారీలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో సరుకుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్లు, మినీ వ్యాన్లను వినియోగించాల్సి వచ్చింది. ఒక్క గూడెం మార్కెట్లో 2,000 వరకు లారీలు ఆగిపోయాయి. లారీల యజమానులు ఆదివారం నిరసన ప్రదర్శనలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఆదివారం రద్దీగా కనబడే బ్రహ్మానందరెడ్డి మార్కెట్ బోసిపోయింది.
కిలోకు రూ.10 పెరిగిన బంగళాదుంపలు
లారీల సమ్మె కారణంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలు పెరిగాయి. ఉల్లిపాయలు రిటైల్ మార్కెట్లో రెండు రోజుల క్రితం వరకు పది రూపాయలకు లభించగా ఆదివారం 15 రూపాయలకు పెరిగాయి. బంగాళాదుంపలు కిలోకు పది రూపాయల వరకు పెరిగాయి. కిలో దుంపలు రూ. 30 చేసి విక్రయిస్తున్నారు. ఉల్లిపాయల ధర గుత్త మార్కెట్లో క్వింటాలు రూ.900 చేరుకుంది. మహరాష్ట్ర నుంచి ఉల్లిపాయలు, కోల్కత నుంచి బంగాళాదుంపలు మార్కెట్కు రాలేదు. వరి కోతలు మొదలయ్యాయి. దీంతో ధాన్యాన్ని రైతులు తరలించుకునే వీలులేక పొలాల్లో ఉంచుకుంటున్నారు. ఇది ఆసరాగా చేసుకొని తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయిల్ ధరలపై సమ్మె ప్రభావం ఇంకా తీవ్రప్రభావం చూపలేదు. అపరాలు కూడా అదేస్థాయిలో ఉన్నా స్వల్పంగా ధరలు పెరిగాయి. కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండటం ఊరట ఇచ్చే విషయం.