రవాణా బంద్..పాక్షికం
సాక్షి, కడప : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రవాణా బిల్లును వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనబాట పట్టారు. రోడ్డు రవాణా భద్రత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని సంఘాలు ఆందోళనలలో పాల్గొన్నాయి. జిల్లాలో గురువారం నిర్వహించిన బంద్ పాక్షికంగా కొనసాగింది.
రాయచోటి డిపో ఎదుట కార్మికుల ధర్నా
కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లును వ్యతిరేకిస్తూ రాయచోటి ఆర్టీసీ డిపో ఎదురుగా ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీలు నాగరాజు, రంగనాథ్, రీజినల్ ప్రెసిడెంట్ నాగమణిల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని, కార్మికులకు 43 శాతం ఫిట్మెంటు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు.
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన
జిల్లాలోని అనేక డిపోల్లోని ఆర్టీసి కార్మికులు గురువారం నిర్వహించిన బంద్ నేపథ్యంలో జేబులకు నల్లబ్యాడ్జీలు తగిలించుకొని నిరసన తెలిపారు. కొన్ని యూనియన్లు బంద్కు మద్దతు ప్రకటించి ఆందోళనల్లో పాల్గ్గొనగా, మరికొన్ని యూనియన్ల వారు బ్యాడ్జీలతొ నిరసన తెలిపారు.
సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్సార్ సీపీ
కార్మికులు చేపట్టిన బంద్కు వైఎస్సార్ సీపీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కడపలో జరిగిన ప్రత్యక్ష ఆందోళనల్లో కూడా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
కడపలో పలు సంఘాల నాయకుల అరెస్టు
జిలా ్లకేంద్రమైన కడపలో ధర్నా, రాస్తారోకో చేస్తున్న పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఏఐటీయూసీ, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్లకు చెందిన సంఘాల నాయకులను అరెస్టు చేసి ధర్నా, రాస్తారోకోలను భగ్నం చేశారు. అనంతరం నేతలను పోలీస్ స్టేషన్కు తరలించి పూచికత్తుపై విడుదల చేశారు.
తప్పని తిప్పలు
జిల్లాలో కార్మికులు రవాణా బంద్కు పూనుకోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్ప లేదు. రోజూ మాదిరిగా కాకుండా గురువారం ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గడంతో సమస్యలు ఎదురయ్యాయి. గమ్యస్థానాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే జిల్లాలో బంద్ మాత్రం పాక్షికంగానే కొనసాగింది.