నాలుగు నెలల్లో ఆర్టీసీ విభజన
రవాణామంత్రి మహేందర్రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఆర్టీసీ)ను నాలుగు నెలల్లోగా విభజిస్తామని రవాణామంత్రి మహేందర్రెడ్డి చెప్పారు. శనివారం హెచ్ఐసీసీలో జరిగిన మహిళా పారిశ్రామిక వేత్తల అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కొద్దిసేపు విలేకరులతో విడిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బస్సులు వెళ్లని గ్రామాలు 1300 వరకున్నాయని, త్వరలోనే వాటికి బస్సు సదుపాయం కల్పిస్తామన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆహ్లాదకరంగా కనిపించేలా ప్రత్యేక రంగు వేయించాలని నిర్ణయించామన్నారు. పలు డిజైన్లను ఎంపిక చేశామని, అంతిమనిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడపనున్నట్టు మంత్రి చెప్పారు. సొంత కార్ల కన్నా ఆర్టీసీ బస్సుల్లోనే మహిళా ఉద్యోగులకు భద్రత ఉంటుందన్నారు.
మరో 20 ఏళ్లు మా ప్రభుత్వమే..
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మేలు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వస్తున్నారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో 20ఏళ్లపాటు టీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో ఉంటుందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కొద్దిరోజుల్లోనే ఖాళీ అవుతాయన్నారు.