స్లమ్ షాట్
కెమెరా కంటితో ప్రపంచాన్ని చూసే వారికి కాలు ఓ చోట నిలవదు. పల్లె అందాలను.. పట్నం సొగసులను కెమెరాలో బంధిస్తారు. ఇందుకోసం అవిశ్రాంతంగా సంచరించినా అలసిపోరు ఫొటోగ్రాఫర్లు. ప్రకృతి రమణీయతను ఎంత అందంగా ఒడిసిపడతారో.. కూలిన బతుకులనూ అంతే హృద్యంగా కళ్ల ముందు ఉంచుతారు.
అలా ట్రావెల్ ఫొటోగ్రఫీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఛాయాగ్రాహకుడు రాంచందర్ పెంటుకర్. 63 ఏళ్ల పెంటుకర్ ఫ్లాష్ కొట్టిన ఎన్నో దృశ్యాలు అంతర్జాతీయ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. ఎన్నో సుందర దృశ్యాలను కన్నుగీటిన పెంటుకర్ ఇటీవల నల్లగుట్ట మురికివాడలో తీసిన కెమెరా క్లిక్ గురించి ఇలా వివరించారు..
మా సొంతూరు వరంగల్. 1980ల్లో సిటీకి వచ్చి ఓ ఫార్మసీ పెట్టుకుని జీవనం మొదలుపెట్టాను. సికింద్రాబాద్ ప్యారడైజ్ థియేటర్లో ప్రొజెక్షన్ మ్యాన్‌తో స్నేహం.. నన్ను ఫొటోగ్రఫీకి దగ్గర చేసింది. ఇలా సిటీ నుంచి మొదలైన నా లెన్స్ జీవితం, వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు...ఆ తర్వాత విదేశాల వరకు చేరుకుంది.
ఇదీ దృశ్యం..
ఈ మధ్య కాలంలో నేను తీసిన ఓ ఫొటో మురికివాడల్లోని దుస్థితిని కళ్లకుకట్టింది. దేశమంతా స్వచ్ఛ భారత్ అంటోంది. ప్రధాని నుంచి సెలిబ్రిటీల వరకు చీపుర్లు పట్టుకుని రోడ్లెక్కి శుభ్రం చేస్తున్నారు. అందరి చేతులూ కలుస్తుండటంతో ఎన్నో వాడలు అద్దాల్లా మెరిసిపోతున్నాయి. ఇదే సమయంలో నేను సికింద్రాబాద్‌లోని నల్లగుట్ట మురికివాడ ప్రాంతానికి వేకువజామునే వెళ్లాను. అక్కడ స్వచ్ఛ భారత్ ఆనవాళ్లేమీ కనబడలేదు.
మురుగు పరుచుకున్న దారులు.. అందులో నుంచి ఓ పోలియో బాధిత కుర్రాడు వస్తున్న దృశ్యం కనిపించింది. మురికిలో భారంగా మసులుతున్న ఆ కుర్రాడ్ని చూడగానే నా కెమెరా వెంటనే క్లిక్మంది. అణువణువూ అపరిశుభ్రతకు ఆనవాళ్లున్న ఆ ప్రాంతం.. స్వచ్ఛ భారత్‌కు సవాల్ విసురుతున్నట్టు కనిపించింది. ఇది నేను తీసిన ఫొటోల్లో వన్ ఆఫ్ ది బెస్ట్. సాక్షి ‘సిటీప్లస్’ ద్వారా తొలిసారి ప్రచురితం అవుతున్న ఈ దృశ్యం వల్ల నేతల్లో కొంత కదలిక ఉంటుందని ఆశిస్తున్నా.
టెక్నికల్ యాంగిల్...
నల్లగుట్టలో నేను తీసింది నార్మల్ షాటే. వాడింది ఫిల్మ్ కెమెరా నికాన్ ఎఫ్ 801. మీడియం జూమ్ 35 మీటర్లు టూ 85 మీటర్లు, షట్టర్ స్పీడ్.. 125ఎఫ్8.