ఇక మల్టీ కరెన్సీ కార్డులు
వ్యాపార అవసరాల రీత్యా కావొచ్చు లేదా విహార యాత్రలకు వెళ్లినప్పుడు కావొచ్చు.. విదేశీ పర్యటనలకి వెళ్లినప్పుడు మన కరెన్సీ అక్కడ చెల్లుబాటు కాదు కాబట్టి ఆయా దేశాల కరెన్సీ చాలా అవసరం పడుతుంది. డాలర్లు, యూరోలను వెంట తీసుకెళ్లినా అన్ని చోట్లా అవి మార్పిడి కాకపోవచ్చు కూడా. క్రెడిట్ కార్డులు, ట్రావెలర్స్ చెక్కులు ఉన్నా.. వాటికి ఉండే పరిమితులు వాటికి ఉన్నాయి.
నగదు వెంట తీసుకెడితే దొంగల భయం ఒకటి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే అక్కరకొచ్చేది సురక్షితమైన మల్టీ కరెన్సీ కార్డు.
విదే శీ పర్యటనల్లో కొనుగోళ్లు జరిపేందుకు, అక్కడి ఏటీఎంలలో ఆయా దేశాల కరెన్సీలో నగదు విత్డ్రా చేసుకునేందుకు.. ఇలా అనేక రకాలుగా ఈ మల్టీ కరెన్సీ కార్డు ఉపయోగపడుతుంది. ఇది ప్రీపెయిడ్ కార్డులాంటిది.
ఈ కార్డు ఖాతాలో డాలర్లు, పౌండ్లు, యూరోలు జమ చేసుకుని, విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయా దేశాల కరెన్సీలో లావాదేవీలు జరిపేందుకు ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉండే వారు తరచుగా వివిధ దేశాల్లో పర్యటిస్తుండే వారి కోసం మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డులను రూపొం దించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఐఎన్జీ వైశ్యా వంటి పలు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ కార్డులను ఇస్తున్నాయి. ప్రయాణించబోయే విమానం టికెట్, పాస్పోర్టు, పాన్ కార్డు నంబరు లాంటి వివరాలు మొదలైనవి ఇస్తే చాలు కార్డు చేతికి వచ్చేస్తుంది.
క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఈ మల్టీ కరెన్సీ కార్డులో ప్రయోజనాలు అనేకం. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులకు వార్షిక ఫీజులు చాలా భారీగా ఉంటాయి. ఇదే కాకుండా కొనుగోళ్లు లాంటివి జరిపినప్పుడు సందర్భాన్ని బట్టి లావాదేవీ ఫీజులు. ప్రీపెయిడ్ మల్టీ కరెన్సీ కార్డుల్లో ఈ సమస్యలు ఉండవు. ఇక, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు జరిపినప్పుడు విదేశీ మారక విలువ కూడా కీలక పాత్ర పోషిస్తుంటుంది. విదేశీ మారకం విలువలు తరచూ హెచ్చు తగ్గులకు లోనవుతుంటాయన్న సంగతి తెలిసిందే.
మనం కొనుగోలు చేసిన రోజున మన దేశ కరెన్సీతో పోలిస్తే ఆ దేశ కరెన్సీ విలువ అధికంగా ఉంటే ఆ మేరకు మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అదే మల్టీ కరెన్సీ కార్డుల విషయంలో కరెన్సీ హెచ్చుతగ్గుల బాదరబందీ ఉండదు. కార్డు తీసుకున్న రోజే కరెన్సీ మారకం విలువ ఇంత ఉంటుందని ముందుగానే నిర్ణయిస్తారు.ప్రత్యేకమైన పిన్ నంబరు కలిగి ఉండే ఈ కార్డులు సురక్షితమైనవి. ఒకవేళ పోగొట్టుకున్నా 48 గంటల్లోగా మరో కార్డు అందుతుంది.