‘దేవగిరి’.. 100 నిమిషాల ఆలస్యం
- ఒకటో ప్లాట్‌ఫారంపైకి వస్తుందని ప్రకటన
- వచ్చిందేమో రెండో ప్లాట్ ఫారంపైకి..
- అవస్థలు పడ్డ ప్రయాణికులు
నిజామాబాద్‌కల్చరల్ : దేవగిరి ఎక్స్‌ప్రెస్ సుమారు వంద నిమిషాల ఆలస్యంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ వచ్చింది. ఒకటో నంబర్ ప్లాట్ఫారం మీదికి రైలు వస్తుందని ప్రకటన చేయగా.. రెండో ప్లాట్‌ఫారంపైకి వచ్చి ఆగింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.
ముంబయి నుంచి బయలుదేరే దేవగిరి ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ వెళ్తుంది. ఇది నిజామాబాద్‌కు రోజూ ఉదయం 11.05 గంటలకు చేరుకుంటుంది. సోమవారం చాలా ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు నిజామాబాద్ వచ్చింది. సుమారు వంద నిమిషాల ఆలస్యంగా రైలు వచ్చింది. కాగా ఈ రైలు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపైకి వస్తుందని రైల్వే అధికారులు ప్రకటించారు.
ప్రయాణికులు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై వేచి ఉన్నారు. కానీ రెండో నంబర్‌పైకి వచ్చి ఆగింది. దీంతో ప్రయాణికులు ఉరుకులు పరుగుల మీద రెండో ప్లాట్ఫారానికి చేరుకున్నారు. అసలే ఆలస్యంగా రావడం, ఆపైన ప్లాట్‌ఫారాలు మారాల్సి రావడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.