సమ్మె దెబ్బ...
ఎక్కడి బస్సులు.. అక్కడే..
అతికష్టం మీద 50 వరకు బస్సులను తిప్పిన ఆర్టీసీ
రూ.కోటికిపైగా ఆదాయం కోల్పోయిన వైనం
చార్జీలు రెట్టింపుచేసిన ప్రైవేటు వాహనదారులు
ఇబ్బందులు పడిన ప్రయాణికులు
నెల్లూరు(రవాణా) : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రయాణికులకు చుక్కలు చూపింది. ఫిట్మెంట్ 43 శాతం పెంచాలంటూ ఆర్టీసీలోనే అన్ని యూనియన్లు బుధవారం నుంచి సమ్మెకు దిగాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 800లకు పైగా బస్సులు ఆయా డిపోలకే పరిమితమయ్యాయి. మొత్తం ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు కార్మికులు, మెకానికల్ విభాగం, కార్యాలయ సిబ్బంది, అందరూ మూకుమ్మడిగా సమ్మెలోకి వెళ్లిపోయారు. కేవలం ఆయా డిపో మేనేజర్లు, అధికారులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
ఆయా డిపోల నుంచి 4 నుంచి 5 బస్సుల వరకు అధికారులు అతికష్టం మీద తిప్పారు. సమ్మె కారణంగా జిల్లాకు రోజుకు రూ.కోటి వరకు రావాల్సిన రెవెన్యూను ఆర్టీసీ కోల్పోయింది. ప్రైవేటు వాహనాలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో చార్జీలు పెంచి అందినకాడికి ప్రయాణికుల నుంచి దోచుకున్నారు. అధికారులు మొదటిరోజు బస్సులు తిప్పడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాలను విరమించుకుంటే మరికొంతమంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.
ఇబ్బందులుపడ్డ ప్రయాణికులు...
జిల్లావ్యాప్తంగా 800లకుపైగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అధికారులు అతికష్టం మీద ఆయా డిపోల నుంచి 51 బస్సులను తిప్పారు. ప్రయాణికులు బస్సుల కోసం డిపోల్లోనే నిరీక్షించారు. కొంతమంది చేసేదేమీలేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ప్రధానంగా బెంగళూరు, తిరుపతి, చెన్నై, వైజాగ్, విజయవాడకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ముందే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో బస్టాండుకు వచ్చి ఇబ్బందులుపాలయ్యారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారులతో వాదనలకు దిగారు. కనీసం రిజర్వేషన్ చేసుకున్న సొమ్మును తిరిగి చెల్లించమని అడిగినా అధికారుల నుంచి సమాధానం కరువైందని పలువురు ప్రయాణికులు వాపోయారు.
తాత్కాలిక ఏర్పాట్లలోనూ నిర్లక్ష్యం
బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లు కావాలన్న సమాచారం ముందే తెలియడంతో అధికసంఖ్యలో యువకులు బస్టాండుకు వచ్చారు. కేవలం డ్రైవర్లు, కండక్టర్లు ధృవపత్రాలను పరిశీలించేందుకు అంత సుముఖత కనబడటంలేదని విధులు నిర్వహించడానికి వచ్చిన పలువురు యువకులు వాపోయారు. ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఆ ప్రయత్నాలు చేయకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పటికప్పుడు రద్దుచేశారు...
వారం ముందే హైదరాబాద్ నుంచి చెన్నైకి రిజర్వేషన్ చేసుకున్నాం. తీరా మంగళవారం రాత్రి బస్సు దగ్గరకి వచ్చేసరికి రిజర్వేషన్ రద్దుచేస్తూ మెసేజ్ పంపారు. అక్కడి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి నెల్లూరుకు ఇతర వాహనాల్లో వచ్చాం. ఇక్కడ నుంచి చెన్నై వెళ్లేందుకు బస్సులు లేవు. బస్సుకోసం ఇబ్బందులు పడుతున్నాం.
- వంశీకృష్ణ, ప్రయాణికుడు
సమాచారమే కరువు...
బస్సులు రద్దవుతున్నట్లు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సమ్మె విషయం తెలిసినట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వాళ్లం. ఈ విషయంపై అధికారుల నుంచి ఎలాంటి సమాధానం కూడా రావడంలేదు. బస్సుకోసం నాలుగు గంటలకుపైగా ఎదురుచూస్తున్నాం.
- జోయల్, ప్రయాణికుడు
పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం..
తిరుపతి వెళ్దామని పిల్లలతో బస్టాండుకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులు వెళ్లడం లేదని తెలిసింది. ఉదయం నుంచి తిరుపతి వెళ్లేందుకు బస్టాండులోనే కూర్చున్నాం. చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం.
- నాగిళ్ల శీనమ్మ.. ప్రయాణికురాలు
బస్సులను ఏర్పాటు చేయలేదు..
సమ్మె విషయం ముందే తెలిసినా అధికారులు అం దుకు తగిన ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయలేదు. ప్రైవేటు వాహనాలు కూ డా అంతంతమాత్రంగానే తిరుగుతున్నాయి. చార్జీలు ఎక్కువ చెల్లించి అయినా వెళ్దామన్నా కుదరడంలేదు. ఉదయం నుంచి బస్సుకోసం బస్టాండులో పడిగాపులు కాస్తున్నాం.
- కొండా నాగమణి, ప్రయాణికురాలు
శ్రీలంకకు విమాన టికెట్ రిజర్వు చేసుకున్నాం..
బుధవారం రాత్రికి శ్రీలంకకు వెళ్లేందుకు బెంగళూరు నుంచి విమానానికి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం. నెల్లూరు నుంచి వెళ్లేందుకు బుధవారం వోల్వో బస్సుకు బెంగళూరుకు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం. తీరా బస్టాండుకు వచ్చాక బస్సు లేదని అధికారులు చెప్పారు. బస్సు రద్దయిన విషయంపై ఎలాంటి సమాచారం అందించలేదు. శ్రీలంకకు వెళ్లాలంటే ఏం చేయాలో అర్థం కావడంలేదు.
- ఆరాఫత్, లష్ర్పత్